Share News

ఆ గ్రామానికి ఏమైౖంది?

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:26 PM

25 people died of kidney disease in three years ఒకప్పుడు ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది. వ్యవసాయంతో పాటు, క్వారీల్లో పనిచేసి ఆ వచ్చిన సంపాదనతో గ్రామస్థులు ఆనందంగా జీవించేవారు. అలాంటి గ్రామాన్ని మూడేళ్ల నుంచి కిడ్నీ వ్యాధి పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారితో మూడేళ్లలో 25 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో రోగులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇదీ పొందూరు మండలం కృష్ణాపురం(గారపేట) గ్రామంలోని పరిస్థితి.

ఆ గ్రామానికి ఏమైౖంది?
కృష్ణాపురం గ్రామం

కృష్ణాపురాన్ని పీడిస్తున్న కిడ్నీ వ్యాధి

మూడేళ్లలో 25 మంది మృతి

పదుల సంఖ్యలో బాధితులు

ఆందోళనలో గ్రామస్థులు

పొందూరు, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది. వ్యవసాయంతో పాటు, క్వారీల్లో పనిచేసి ఆ వచ్చిన సంపాదనతో గ్రామస్థులు ఆనందంగా జీవించేవారు. అలాంటి గ్రామాన్ని మూడేళ్ల నుంచి కిడ్నీ వ్యాధి పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారితో మూడేళ్లలో 25 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో రోగులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇదీ పొందూరు మండలం కృష్ణాపురం(గారపేట) గ్రామంలోని పరిస్థితి. ఈ గ్రామంలో 2వేల మంది జనాభా నివసిస్తున్నారు. మూడేళ్ల కిందట గ్రామంలో కిడ్నీ వ్యాధి వెలుగుచూసింది. అప్పటి నుంచి చిన్న పెద్ద తేడాలేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చికిత్సకు రూ.లక్షలు వెచ్చించాల్సి రావడంతో కొన్ని కుటుంబాలు అప్పులపాలయ్యాయి. ఆసుపత్రులు చుట్టూ తిరిగినా వ్యాధి ముదిరి డయాలసిస్‌కు దారితీయడం, ఆ తరువాత కొన్ని నెలలకే మృత్యువాత పడుతుండడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 2019లో కాయల శ్రీను(35) అనే వ్యక్తి ఈ వ్యాధి బారినపడి మృతిచెందాడు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది కిడ్నీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పది రోజుల కిందట గార వెంకటమ్మ అనే వివాహిత ఈ వ్యాధితో మృతి చెందింది. ఈ మూడేళ్లలో 25 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఎవరికి ఎప్పుడు ఈ లక్షణాలు బయట పడతాయోనని గ్రామస్థులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ప్రస్తుతం గార రమణ, పిసిని రామారావు తదితరులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే మరో ఉద్దానంగా మారినా ఆశ్చర్యం లేదని గ్రామస్థులు అంటున్నారు.

కారణాలేంటో?

కృష్ణాపురం గ్రామంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి అసలు కారణాలు తెలియడం లేదు. అధికారులు ఇటీవల గ్రామంలో నీటి పరీక్షలు చేసి కాలుష్యం లేదని తేల్చారు. కానీ, వ్యాధికి గల కారణాలపై మాత్రం పరిశోధనలు చేయలేదు. తూతూమంత్రంగా నీటి పరీక్షలు చేసి మమ అనిపించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సమీపంలో ఉన్న స్టోన్‌క్రషర్లు కిడ్నీ వ్యాధికి కారణం కావచ్చని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. స్టోన్‌క్రషర్ల నుంచి వచ్చే పౌడర్‌ చాలా ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. మండలంలోని కొంచాడలో కూడా కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. ఈ గ్రామం చుట్టూ క్రషర్లు ఉండడంతోనే ఆ గ్రామస్థులు కిడ్నీ వ్యాధిబారిన పడుతున్నారని, అదే సమస్య కృష్ణాపురం గ్రామానికి వచ్చిందని పలువురు చెబుతున్నారు.

వైద్య పరీక్షలు చేయాలి

మా గ్రామంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. గ్రామస్థులందరికీ సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించాలి. రోగ లక్షణాలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించి ఉచితంగా మందులు అందించాలి.

- అంబల్ల శ్రీనివాసరావు, కృష్ణాపురం

కారణాలు వెలికితీయాలి

మా గ్రామంలో కిడ్నీ వ్యాధి ప్రబలి పదుల సంఖ్యలో చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు తూతూ మంత్రంగా నీటి పరీక్షలు చేసి వదిలేశారు. పూర్తిస్థాయిలో నీటి పరీక్షల చేయడంతో పాటు సమస్యకు కారణాలను వెలికితీయాలి.

- గార వెంకటరమణ, మాజీ సర్పంచ్‌, కృష్ణాపురం

చర్యలు తీసుకుంటాం

ఇప్పటికే కృష్ణాపురంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో కలిసి నీటి పరీక్షలు చేశాం. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించాం. పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి సమస్యకు పరిష్కారం చూపుతాం.

- డాక్టర్‌ అనిత, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం

Updated Date - Oct 12 , 2025 | 11:26 PM