కిడ్నీవ్యాధి కబళిస్తోంది
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:00 AM
Kidney disease in chapara చాపర గ్రామాన్ని కిడ్నీవ్యాధి కబళిస్తోంది. గ్రామంలో సుమారు 5వేల మంది జనాభా ఉన్నారు. ఇటీవల కిడ్నీవ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన బి.మధు, వి.దాసునాయుడు, ఆర్.తేజ, నారాయణమూర్తి తదితరులు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు.
ఆందోళనలో చాపర గ్రామస్థులు
ఇటీవల ఇద్దరు వ్యక్తుల మృతి
కలుషితనీరే కారణమని ఆరోపణలు
మెళియాపుట్టి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన రంది రమేష్ కొన్నేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతూ.. ఈ నెల 20న మృతి చెందాడు. ఆయన మృతితో తమకు పెద్ద దిక్కులేకుండా పోయిందని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే గ్రామానికి చెందిన అడ్డాపు రామారావు కూడా కిడ్నీవ్యాధితో బాధపడుతూ గత నెలలో ప్రాణాలు కోల్పోయాడు. డయాలసిస్ చేయించినా, మందులు వాడినా ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు విలపించారు.
..ఇలా చాపర గ్రామాన్ని కిడ్నీవ్యాధి కబళిస్తోంది. గ్రామంలో సుమారు 5వేల మంది జనాభా ఉన్నారు. ఇటీవల కిడ్నీవ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన బి.మధు, వి.దాసునాయుడు, ఆర్.తేజ, నారాయణమూర్తి తదితరులు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ సేవలు పొందుతున్నారు. పేద కుటుంబాలు కావడంతో వైద్యం చేయించు కోవడానికి కొంతమంది బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్ అందజేస్తున్నా వైద్యఖర్చులకు చాలడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో గ్రామస్థులు కొంతమంది చందాలు వేసుకుని బాధితులకు అండగా నిలుస్తున్నారు. గ్రామంలో కొన్నాళ్ల నుంచి కిడ్నీవ్యాధి తీవ్రత పెరుగుతున్నా పట్టించుకునే నాథులు లేరని మాజీ వైస్ సర్పంచ్ ఆర్.తేజేశ్వరరావు తెలిపారు.
కలుషిత నీరే కిడ్నీవ్యాప్తికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రక్షితనీటి పథకం పూర్తిగా పాడైపోయి.. నాచు పట్టి నీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మెళియాపుట్టిలోని మహేంద్ర తనయ నదిలో బోరు ఏర్పాటు చేశారు. దానిద్వారా చాపర, సట్టపురం, శేఖరాపురం, పెద్దలక్ష్మీపురం గ్రామాలకు తాగునీరందించేందుకు ట్యాంకులు ఏర్పాటు చేసి పైపులైన్లు అమర్చారు. వైసీపీ పాలనలో వీటి నిర్వహణను పట్టించుకోలేదు. పాత బోర్లు నీరే సరఫరా చేస్తున్నారు. దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కిడ్నీవ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తాగునీరు బాగోలేదు
కొన్ని నెలల నుంచి తాగునీరు బాగోలేక గ్రామానికి చెందిన కొంతమంది కిడ్నీవ్యాధి బారిన పడుతున్నారు. ట్యాంకులు పూర్తిగా నాచు పట్టడంతో నీరు కలుషితమవుతోంది. అధికారులు, పాలకులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.
- బి.మన్మథరావు, చాపర