Share News

పాలసింగిలో కిడ్నీవ్యాధి

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:31 PM

Two deaths from kidney disease so far ఆ ఊరిలో 18 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 50 మంది. అంతా నిరుపేద గిరిజనులే. వారిని గత ఐదేళ్ల నుంచి కిడ్నీవ్యాధి వేధిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇంకొక నలుగురు వరకు మందులు వాడుతున్నారు. ఇదీ టెక్కలి మండలం ముఖలింగపురం పంచాయతీలోని పాలసింగిలో దుస్థితి.

పాలసింగిలో కిడ్నీవ్యాధి
పాలసింగి గ్రామం

  • ఇప్పటివరకు ఇద్దరి మృతి

  • చికిత్స పొందుతున్న మరో ఏడుగురు

  • రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు

  • ఆందోళన చెందుతున్న గిరిజనులు

  • టెక్కలి రూరల్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఆ ఊరిలో 18 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 50 మంది. అంతా నిరుపేద గిరిజనులే. వారిని గత ఐదేళ్ల నుంచి కిడ్నీవ్యాధి వేధిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇంకొక నలుగురు వరకు మందులు వాడుతున్నారు. ఇదీ టెక్కలి మండలం ముఖలింగపురం పంచాయతీలోని పాలసింగిలో దుస్థితి. ఈ గ్రామంలో పలువురు కిడ్నీ వ్యాధితో మంచం పట్టారు. కూలికి వెళ్తేకానీ కుటుంబ పోషణ జరగని తమని కిడ్నీ వ్యాధి చంపేస్తుందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల కిందట గ్రామానికి చెందిన మల్లిపురం పార్వతి(జటలు) డయాలసిస్‌ జరుగుతుండగా మృతి చెందింది. గత ఏడాది జన్ని రత్నాలు అనే మహిళ అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి కిడ్నీ వ్యాధిగా నిర్ధారించారు. అప్పటికే మూడో స్టేజ్‌లోకి వెళ్లడంతో మృతి చెందింది. ప్రస్తుతం చిన్నింటి అప్పలస్వామి, జన్ని మోహనరావు, ఏ.సుభద్ర కిడ్నీవ్యాధితో బాధపడుతూ టెక్కలి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు.

  • తాగునీరే కారణమా?

  • గతంలో ఐటీడీఏ ద్వారా పాలసింగిలో రెండు తాగునీటి బావులను తవ్వారు. ఆ నీరు వినియోగించడం వల్లనే అధికంగా కిడ్నీవ్యాధి ప్రబలినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. రెండేళ్ల కిందట గ్రామానికి దూరంగా బోరును తవ్వారు. అది ఎన్ని రోజులూ పనిచేయలేదు. దీంతో మళ్లీ గ్రామ సమీపంలో మరో బోరును తవ్వారు. ప్రస్తుతం ఈ నీటినే గ్రామస్థులు తాగుతున్నారు. అయినా ఇటీవల గ్రామానికి చెందిన జన్ని మోహనరావు అనే యువకుడు కిడ్నీ వ్యాధి బారినపడడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. నీరు కలుషితం కావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొండల నుంచి వచ్చే వరద నీరు బావుల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టింది. దీనికోసం కాలువతో పాటు రోడ్డును నిర్మించింది. అయినా వ్యాధిగ్రస్థులు తగ్గకపోవడంతో గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు.

  • ఆదుకున్న కూటమి ప్రభుత్వం

  • పాలసింగిలోని డయాలసిస్‌ రోగులను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మూడేళ్ల నుంచి వారు డయాలసిస్‌ చేయించుకుంటున్నా పింఛన్‌ ఇవ్వకపోవడంతో వైద్య ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమందిలో వ్యాధి లక్షణాలు బయటపడుతున్నా వైద్యానికి డబ్బులు లేక చికిత్స పొందలేకపోతున్నారు. వ్యాధి తీవ్రత పెరిగిన తరువాత ఆసుపత్రికి వెళ్తుండడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి సమస్యను స్థానిక టీడీపీ నాయకుడు గుజ్జరు సత్యనారాయణ.. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కిడ్నీ బాధితులకు నెలకు రూ.10వేలు చొప్పున పింఛన్‌ మంజూరైంది. అలాగే ప్రభుత్వం స్పందించి కిడ్నీవ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి రక్తపరీక్షలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • పెళ్లయిన రెండు నెలలకే..

  • నాకు వివాహం జరిగిన రెండు నెలలకే కిడ్నీ వ్యాధి తీవ్రత ఎక్కువైంది. దీంతో వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకుంటున్నా. చిన్నవయసులో వ్యాధి ప్రబలడంతో చాలా బాధగా ఉంది. గత మూడు నెలల నుంచి రూ.10వేలు పింఛన్‌ వస్తోంది.

    - జన్ని మోహనరావు, కిడ్నీ బాధితుడు, పాలసింగి

  • డయాలసిస్‌ చేయించుకుంటున్నా

  • రెండేళ్ల కిందట నాకు కిడ్నీ వ్యాధి సోకింది. వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకుంటున్నా. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే నాకు రూ.10వేలు పింఛన్‌ వస్తోంది. గ్రామంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణమేంటో తెలుసుకుని నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలి.

    - అనుపురం సుభద్ర, కిడ్నీ బాధితురాలు, పాలసింగి

  • శాశ్వత పరిష్కారం చూపాలి

  • మా గ్రామంలో రోజురోజుకూ కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో తక్కువ కుటుంబాలే ఉన్నా ఎక్కువ మందిలో కిడ్నీ వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలి. సురక్షితమైన తాగు నీరు ఇస్తే మంచిది.

    - చిన్నింటి అప్పలస్వామి, కిడ్నీ బాధితుడు, పాలసింగి

Updated Date - Dec 08 , 2025 | 11:31 PM