Railway Flyover: శరవేగంగా..
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:08 PM
railway flyover works కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వంతెనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నిధులు మంజూరు చేయడంతోపాటు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించింది.
కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్ పనులు
తీరిన నిధుల కొరత, నిర్వాసితుల సమస్య
వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
కాశీబుగ్గ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వంతెనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నిధులు మంజూరు చేయడంతోపాటు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించింది. దీంతో ఎలాంటి అడ్డంకి లేకపోవడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
ఇదీ పరిస్థితి..
పలాస రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో కాశీబుగ్గ లెవల్ క్రాసింగ్ గేటు ఉంటుంది. ప్రతిరోజూ ఈ గేటు మీదుగా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. జంట పట్టణాలతో పాటు ఒడిశా, శ్రీకాకుళం, విశాఖకు వెళ్లే మార్గం కావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎల్‌సీ గేటుతో పాటు బెండిగేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలను ప్రారంభించింది. అయితే బెండిగేటు వద్ద సకాలంలో వంతెన నిర్మాణం పూర్తయ్యింది. కాశీబుగ్గ లెవల్ క్రాషింగ్ వద్ద మాత్రం షాపులు, నివాసాలు తొలగించాల్సి ఉండడంతో వంతెన పనుల్లో జాప్యం జరిగింది. ఈ వంతెన నిర్మాణానికి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.28 కోట్లు, రైల్వేశాఖ రూ.28 కోట్లు విడుదల చేశాయి. రైల్వే పరంగా ట్రాక్‌పై భాగంలో వంతెన నిర్మాణం పూర్తయింది. మిగతా పనులు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొంతవరకూ పనులు చేయగలిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది తప్ప వంతెన నిర్మాణం పూర్తిచేయలేకపోయింది. వంతెనను పూర్తిచేసి దానిపైనే 2024 ఎన్నికల ప్రచారానికి వెళతామని వైసీపీ నాయకులు గొప్పలు చెప్పారు. కానీ, ఐదేళ్లూ కనీసం పట్టించుకోలేదు. కాంట్రాక్టర్‌కు రూ.6 కోట్ల వరకూ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశాడు. అటు నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష.. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరి, అశ్వనీ వైష్ణవ్‌ను కలిసి వంతెన సమస్యను వివరించారు. దీంతో వంతెన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.46 కోట్లు మంజూరు చేశాయి. 89 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పాటు రూ.23లక్షల పరిహారం అందించారు. దీంతో కొద్ది రోజుల కిందట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీష వంతెన పునర్మిర్మాణ పనులను ప్రారంభించారు. వచ్చే మార్చి నాటికి వంతెనను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. దీనిపై జంట పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మాది చేతల ప్రభుత్వం
వంతెన పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మార్చి నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. పనుల ప్రగతిపై ప్రతిరోజూ అధికారులతో మాట్లాడుతున్నా. గత వైసీపీ ప్రభుత్వం మాటలు తప్ప పనులు చేపట్టలేదు. మాది చేతల ప్రభుత్వం. పలాస నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా. అభివృద్ధి ప్రణాళిక తయారు చేశా. మంత్రులతో కలిసి పలాసను అభివృద్ధి చేస్తా.
- గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస