Share News

ఆక్రమణలో కంబిరిగాం శ్మశాన భూములు

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:57 PM

కంబిరిగాం భూ వివాదం ఇంకా కొలిక్కి రాకముందే ఆ ప్రాంతంలో మరో వివాదం శ్మశానం రూపంలో చోటు చేసుకుంది. కంబిరిగాం భూ స్వాములకు చెందిన శ్మశానాలను ఆక్రమించి భారీ నిర్మాణాలకు పలాసకు చెందిన ఓ వ్యాపారి దృష్టి సారించడంతో ఆ గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఆక్రమణలో కంబిరిగాం శ్మశాన భూములు
చదునుగా మార్చిన చౌదరీల శ్మశానవాటిక స్థలం

  • చేతులు మారడంతో మౌనం దాల్చిన యంత్రాంగం

  • తాత్కాలికంగా పనులు అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

  • నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

పలాస, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కంబిరిగాం భూ వివాదం ఇంకా కొలిక్కి రాకముందే ఆ ప్రాంతంలో మరో వివాదం శ్మశానం రూపంలో చోటు చేసుకుంది. కంబిరిగాం భూ స్వాములకు చెందిన శ్మశానాలను ఆక్రమించి భారీ నిర్మాణాలకు పలాసకు చెందిన ఓ వ్యాపారి దృష్టి సారించడంతో ఆ గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈ ఏడాది జూన్‌ 23న కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసినా పనులు మాత్రం నిలుపుదల కాకపోవడం సర్వత్రా చర్చనీ యాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సర్వే నెంబరు 33/1లో 23 సెంట్ల స్థలాన్ని కంబిరిగాం గ్రామం లో భూ స్వాములుగా ఉన్న చౌదరీలు తమ కుటుంబం కోసం ప్రత్యేకంగా శ్మశానానికి ఈ స్థలాన్ని కేటా యించుకున్నారు. అక్కడే వారి తాత తండ్రుల సమా ధులు కూడా కట్టుకొని ఆ ప్రాంతాన్ని దేవాలయంగా కొలుచుకుంటున్నారు. అదే సర్వే నెంబరులో 12.73 ఎకరాల స్థలం వారికి ఉండేది. శ్మశానానికి కేటాయిం చిన భూమి అందులో మినహాయించగా 12.50 ఎక రాలు ప్రస్తుతం ఉంది. దీన్ని ఇద్దరు పలాసకు చెందిన వ్యాపారుల కు విక్రయించారు. ఈ క్రమంలో అందులో ఓ వ్యాపారి శ్మశానంలో ఉన్న సమాధులను జూ న్‌ 23వ తేదీ కూ ల్చివేస్తుండడంతో ఆ గ్రామ సర్పంచ్‌ బి.ధనుంజయ్‌, శివ కుమార్‌తోపాటు గ్రామస్థులు అడ్డుకుని కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పనులు అక్కడితో నిలిచిపోయాయి. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చౌదిరి కుటుంబ సభ్యులు ఆ భూమిలో తమకు చెందిన శ్మశానం అంటూ బోర్డు పెట్టడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది. అనంతరం ఏమి జరిగిందో తెలియదుగాని.. రెండు రోజుల నుంచి శ్మశానం ప్రాంతంలో మళ్లీ చదును చేసే కార్యక్రమాలు ప్రారంభం కావడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌదరి కుటుంబీ కులు కట్టుకున్న మొత్తం శ్మశానాన్ని పూర్తిగా చదును చేశారు. రోడ్డుకు మరోవైపు కొత్తగా శ్మశానం నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉన్నది పీకి కొత్తగా వేయడం ఏంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. శ్మశానం దిశ మార్చడం గ్రామానికి అరిష్టమని గ్రామస్థులు వారిస్తున్నా నిర్మాణం మాత్రం యథేచ్ఛగా సాగుతుండడం విశేషం. ఇదిలా ఉండగా వ్యాపారికి విక్రయించిన భూమిలో కొంతభూమి కొలతల్లో తక్కువ రావడం వల్ల శ్మశానాన్ని ఆక్రమిం చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణంపై సంబంధిత వ్యాపారులకు ఎవరు ప్రశ్నించినా అంతా సవ్యంగానే పనులు జరుగుతున్నాయని, తాము కొనుగోలు చేసిన స్థలంలో పనులు చేసు కుంటే తప్పేమి ఉందని ప్రశ్నిస్తుండడం కొసమెరుపు. ఈ వ్యవహారంపై స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించి పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని కోరడంతో వ్యాపారులు వెనక్కి తగ్గారు. దేవాల యంగా భావించే శ్మశానం, అందులో ఉన్న సమాధులు కూల్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:57 PM