Share News

కలివింద కిలో రూ.400

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:37 PM

Kalivinda fish కలివింద చేపలు.. మత్స్యకారులకు సిరులు కురిపిస్తున్నాయి. వీటిని ఆక్టోపస్‌ అని కూడా పిలుస్తారు. ఇవి రుచికరంగా ఉండడడంతో మాంసప్రియులు ఇష్టంగా తింటారు.

కలివింద కిలో రూ.400
కలివింద చేప

మత్స్యకారులకు సిరులు కురిపిస్తున్న చేపలు

వజ్రపుకొత్తూరు, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కలివింద చేపలు.. మత్స్యకారులకు సిరులు కురిపిస్తున్నాయి. వీటిని ఆక్టోపస్‌ అని కూడా పిలుస్తారు. ఇవి రుచికరంగా ఉండడడంతో మాంసప్రియులు ఇష్టంగా తింటారు. చైనా, జపాన్‌ దేశాలతోపాటు కేరళ, గుజరాత్‌, ముంబై ప్రాంతాల్లో వీటికి డిమాండ్‌ ఎక్కువ. గతంలో కిలో చేపలు రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.400 పలుకుతోంది. సముద్రంలో చేపలవేటకు వెళ్తున్న మత్స్యకారులకు కొన్ని రోజులుగా కలివింద చేపలు ఎక్కువగా లభిస్తుండడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలోనే అధికంగా కలివింద చేపలు వలలకు చిక్కుతాయి. సాధారణంగా నవంబరు, డిసెంబరు నెలలోనే ఈ చేపలు లభ్యమవుతాయి. ఒక్కొక్కటి సుమారు కిలో బరువు ఉంటుంది. వీటి ముళ్లు ఉండవు. రుచికరంగా ఉంటాయి. దీంతో స్థానికులు, వ్యాపారులు వీటిని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు తీర ప్రాంతంలో ఐదేళ్ల తర్వాత కలివింద చేపలు అధికంగా లభిస్తున్నాయని మత్స్యకారులు తెలిపారు. ఇటీవల వరుస తుఫాన్‌ల కారణంగా చేపలవేట సక్రమంగా సాగక ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. కలివింద చేపలు ధర ఆశాజనకంగా ఉండడం సంతోషదాయకమని తెలిపారు.

ఐదేళ్ల తర్వాత డిమాండ్‌

కలివింద చేపలకు ఐదేళ్ల తరువాత మంచి డిమాండ్‌ వచ్చింది. ప్రస్తుతం వ్యాపారులు కిలో చేపలు రూ.380 నుంచి 400 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్‌లోనే ఈ చేపలు ఎక్కువగా లభ్యమవుతాయి. నెలరోజులపాటు ఇదే విధంగా వలలకు చేపలు చిక్కి.. ధర నిలకడగా ఉంటే మత్స్యకారుల కష్టాలు కొంతవరకు తీరే అవకాశం ఉంది. ఈ ఏడాది తుఫాన్‌లు కారణంగా కొన్నిరోజులుగా చేపలు వలలకు చిక్కకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. కలివింద ధర ఆశాజనకంగా ఉండడం సంతోషంగా ఉంది.

- గోవిందు పాపారావు, మత్స్యకార నాయకుడు, కొత్తపేట

Updated Date - Dec 14 , 2025 | 11:37 PM