Share News

పీహెచ్‌సీ వైద్యాధికారులకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:24 AM

పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారుల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని ఆ అసోసియేషన్‌ జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పీహెచ్‌సీ వైద్యాధికారులకు న్యాయం చేయాలి
ధర్నా చేస్తున్న పీహెచ్‌సీ వైద్యులు

-డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నా

అరసవల్లి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారుల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని ఆ అసోసియేషన్‌ జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా వారు స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల జంక్షన్‌ వరకు నల్ల బెలూన్లు చేతబూని, నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 ఏళ్లకు పైగా పీహెచ్‌సీ వైద్యులు ఎటువంటి పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారని, ఇది అన్యాయమని పేర్కొన్నారు. నాలుగేళ్లు సర్వీసు దాటిన వారికి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇన్‌ సర్వీస్‌ పీజీ కోటాను 30 శాతానికి పెంచాలని, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా 30 శాతం కోటా అమల్లో ఉందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు 50శాతం మూలవేతనం భత్యంగా ఇవ్వాలని, అన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీ వైద్యులందరూ ఎమర్జెన్సీ విధులను కూడా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రతిష్ఠ, మౌని, సుధీర్‌, పావని, నవీన్‌, సుమ, శ్రీనాథ్‌, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు:డీఎంహెచ్‌వో

పీహెచ్‌సీ వైద్యుల సమ్మె నేపథ్యంలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కె.అనిత తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 71 పీహెచ్‌సీలో పనిచేస్తున్న వైద్యులు సమ్మెలో ఉన్నారని, వారి స్థానంలో డీసీహెచ్‌ఎస్‌ నుంచి 33 మంది వైద్యులను, రిమ్స్‌ నుంచి 40 మందిని సేవలకు కేటాయించినట్లు తెలిపారు. వైద్యసేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

Updated Date - Oct 02 , 2025 | 12:24 AM