No Rural development: ఆ నాలుగు గ్రామాలు.. అంతేనా?
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:59 PM
Village neglect.. no Government schemes సరిగ్గా 34ఏళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వం రణస్థలం మండలం కొవ్వాడలో అణు విద్యుత్ పరిశ్రమకు శ్రీకారం చుట్టింది. కొవ్వాడ పంచాయతీ పరిధిలోని కొవ్వాడ, చిన్నకొవ్వాడ, రామదాసుపేట, గూడెం గ్రామ ప్రజలను నిర్వాసితులుగా గుర్తించింది. అయితే వారికి పునరావాసం కల్పించకుండానే ఆ నాలుగు గ్రామాలు తొలగించబడ్డాయని రికార్డుల్లో పేర్కొనడంతో ప్రభుత్వ నిధులు రావడం లేదు.
‘అణు విద్యుత్’ నిర్వాసితులకు పునరావాసం కరువు
కొవ్వాడ, చిన్నకొవ్వాడ, రామదాసుపేట, గూడెంలో నిలిచిన అభివృద్ధి
రికార్డుల్లో తొలగింపుతో విడుదలకాని ప్రభుత్వ నిధులు
కనీస మౌలిక వసతులు లేక ప్రజల ఇబ్బందులు
అణువిద్యుత్ పరిశ్రమ నిర్మించతలపెట్టిన.. ఆ నాలుగు గ్రామాలకు ఎటువంటి నిధులు లేవు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు కావడం లేదు. మౌలిక వసతుల కల్పన ఊసేలేదు. పారిశుధ్య పనులు చేపట్టడం లేదు. సమస్యలను పరిష్కరించడం లేదు. దీనిపై అధికారులను అడిగితే.. ఇక్కడ గ్రామాలే లేనప్పుడు ఎలా నిధులు విడుదల చేస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాలుగా అదే మాట వినిపిస్తోంది. దీంతో ఆ నాలుగు గ్రామాల ప్రజల్లో తీరని వ్యథ కనిపిస్తోంది. పునరావాసాలు కల్పించకుండానే తమ గ్రామాలు తొలగించినట్టు పేర్కొనడంతో ప్రభుత్వ పరంగా ఎటువంటి నిధులు రావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
రణస్థలం, జూలై 11(ఆంధ్రజ్యోతి): సరిగ్గా 34ఏళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వం రణస్థలం మండలం కొవ్వాడలో అణు విద్యుత్ పరిశ్రమకు శ్రీకారం చుట్టింది. కొవ్వాడ పంచాయతీ పరిధిలోని కొవ్వాడ, చిన్నకొవ్వాడ, రామదాసుపేట, గూడెం గ్రామ ప్రజలను నిర్వాసితులుగా గుర్తించింది. అయితే వారికి పునరావాసం కల్పించకుండానే ఆ నాలుగు గ్రామాలు తొలగించబడ్డాయని రికార్డుల్లో పేర్కొనడంతో ప్రభుత్వ నిధులు రావడం లేదు. అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. నిధులు లేక పంచాయతీ పాలకవర్గంలో నిస్సహాయత కనిపిస్తోంది. కనీస వసతులు లేక ఆ నాలుగు గ్రామాలు తీవ్ర వ్యథను అనుభవిస్తున్నాయి. 1991లో కొవ్వాడ పరిసర ప్రాంతాల్లో అణువిద్యుత్ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను మత్స్యకారులు, ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల్లో భయాందోళనలు, అపోహలు నివృత్తి చేసి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో మత్స్యకారులు భూసేకరణకు అంగీకరించారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో 1208 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు రియాక్టర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. భూసేకరణతో పాటు పరిహారం చెల్లించారు. కానీ దశాబ్దాలు గడుస్తున్నా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. అటు పునరావాస కాలనీ నిర్మించి నిర్వాసితులకు అప్పగించలేదు. పరిశ్రమ ఏర్పాటుకాకపోవడంతో స్థానికంగా ఉండేందుకు అభ్యంతరాలు లేకపోయినా.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు ఈ గ్రామాలకు రావడం లేదు. ఉపాధిహామీ పథకం పనులు పూర్తిస్థాయిలో కల్పించలేదు. దీంతో సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పంచాయతీ వద్ద నిధులు అంతంతమాత్రమే కావడంతో కనీస వసతులు లేక ఆయా గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.
పునరావాసంలోనూ నిర్లక్ష్యం
అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం కొవ్వాడ, చిన్నకొవ్వాడ, రామదాసుపేట, గూడెం పరిధిలో సుమారు 2,079 ఎకరాల భూమిని సేకరించారు. ఈ నాలుగు గ్రామాల్లో 3వేల వరకూ ఇళ్లు ఉన్నాయి. సుమారు 4,500 మంది జనాభా ఉన్నారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐఎల్) పర్యవేక్షణలో ఇళ్లు కోల్పోయిన వారికి స్వయంగా కట్టిస్తామని చెప్పారు. అందుకు అనేక ప్రాంతాలను పరిశీలించారు. తర్జనభర్జన నడుమ చివరకు ఎచ్చెర్ల మండలం ధర్మవరంలో నిర్వాసిత కాలనీ ఏర్పాటుకు నిర్ణయించారు. 190 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. కానీ ఒక్క ఇటుక కూడా అక్కడ వేయలేదు. పునరావాసం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలెన్నో
కొవ్వాడ పంచాయతీలో నాలుగు గ్రామాల్లో ముఖ్యంగా తాగునీటి సమస్య వేధిస్తోంది. బోర్లలో ఉప్పునీరు వస్తోంది. దీంతో మహిళలు సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. అప్పట్లో ఎన్‌పీసీఐఎల్ రక్షిత మంచినీరు అందిస్తామని చెప్పింది. అది కూడా లేకుండా పోయింది. దశాబ్దాల నాటి కాలువలు కావడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో ప్రభుత్వ భవనాలకు రక్షణ లేదు. కనీస మరమ్మతులు లేక భవనాలు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. పాఠశాలల చుట్టూ రక్షణ గోడలు లేక వరద నీరు చొచ్చుకొస్తోంది. కుక్కలు, పందులు, విష జంతువులు సైతం స్వైరవిహారం చేస్తున్నాయి. ఇన్ని ఇబ్బందులు నడుమ జీవనం సాగించాల్సి వస్తోందని ఆ నాలుగు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పునరావాసం కల్పించకపోయినా రికార్డుల్లో మాత్రం తమ గ్రామాలను తొలగించినట్టు చూపడంతో అధికారులు కూడా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వం దృష్టిపెట్టాలి..
అప్పుడెప్పుడో అణు విద్యుత్ పరిశ్రమ కోసం భూములు సేకరించారు. నష్ట పరిహారం చెల్లించారు. కానీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. పునరావాసం కల్పించలేదు. ఇప్పుడు గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేవు. ఎందుకంటే ఈ గ్రామాలు వేరే ప్రాంతానికి తరలిపోయాయని రికార్డుల్లో పేర్కొన్నారు. కొత్తగా వసతులు లేవు. ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
- ఉప్పాడ లక్ష్మీ, కొవ్వాడ, రణస్థలం
అంతా అస్తవ్యస్తం
గ్రామంలో తాగునీరు లేదు. బోర్ల నుంచి ఉప్పునీరు వస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి మహిళలు నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. పాఠశాల చుట్టూ అస్తవ్యస్తంగా ఉంది. వరద, మురుగు నీరు వస్తోంది. ఇలా ప్రతిదీ సమస్యే. అణు విద్యుత్ పరిశ్రమ విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలి. లేదంటే భూములు వెనక్కి ఇచ్చి.. గ్రామాలు ఇక్కడే ఉంటాయని ప్రకటించాలి.
మైలపల్లి అప్పారావు, చిన్నకొవ్వాడ, రణస్థలం