Share News

సారా తయారీ కేంద్రాలపై ఉమ్మడి దాడులు

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:40 PM

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో సారా తయారీ కేంద్రాలు, విక్రయాలపై ఒడిశా, ఆంధ్ర ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

సారా తయారీ కేంద్రాలపై ఉమ్మడి దాడులు

పాతపట్నం, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో సారా తయారీ కేంద్రాలు, విక్రయాలపై ఒడిశా, ఆంధ్ర ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ డీసీ డి. శ్రీకాంత్‌ రెడ్డి, ఏసీ పి.రామచంద్రరావు, డిస్ట్రిక్ట్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్‌ తిరుపతినాయుడు, ఒడిశా రాష్ట్రం గంజాం ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌, గజపతి జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ ప్రదీప్‌కుమార్‌ సాహు మంగళవారం పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు మండలాల యొక్క ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌లో ఉన్న ఒడిశా గ్రామాలైన శిరడా, గురిసింగిగూడ, కొత్తగూడ, దిద్దినగూడ, తమిలగూడ తదితర గ్రామాల్లో దాడులు చేసి 7,700 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేసి, 1,520 లీటర్ల సారాని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసులు నమోదు చేసినట్లు పాత పట్నం ఎక్సైజ్‌ స్టేషన్‌, మొబైల్‌ పార్టీ సీఐ కోట కృష్ణారావు తెలిపారు.

పశువుల పట్టివేత

ఎచ్చెర్ల/కంచిలి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా అల మండ సంతకు రెండు వాహనాలతో అక్రమంగా తరలిస్తున్న పశువులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసు బృందం మంగళవారం కుశాలపురం బైపాస్‌ కూడలి లో పట్టుకున్నారు. నరసన్నపేట పరిసర గ్రామాల్లో కొనుగోలు చేసిన ఎనిమిది ఆవులు, జలుమూరు పరిసర గ్రామాల్లో కొనుగోలు చేసిన 19 దూడలను వాహనాలపై తరలిస్తుండగా పట్టుబడ్డారు. వీటిని కొత్తవలస గోశాలకు తరలించారు. ఈ మేరకు బాధ్యులైన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ తెలిపారు.

కంచిలిలో..

మండలంలో అక్రమంగా తరలిస్తున్న 11 పశువులను మంగళవారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు. కంచిలి ఫ్లైఓవర్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వ్యాన్‌లో తరలిస్తున్న పశువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దాకరాపల్లి గ్రామానికి చెందిన రాజా ప్రధాన్‌, బొట్టా కాళిదాసు, డొక్కరి పురుషోత్తం వీటిని రావివలస సంతకు తరలి స్తున్నట్టు గుర్తించామన్నారు. వాహనాపన్ని సీజ్‌ చేయడంతోపాటు వారిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

కంచిలి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): కంచిలి రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు మంగళవారం రైల్వే పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయసు 50 ఏళ్లు ఉండొచ్చని, నల్లరంగు చొక్కా, నీలం రంగు ఫ్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలిసినవారు పలాస జీఆర్‌పీలో సంప్రదించాలని రైల్వే పోలీసులు తెలిపారు.

రైలు నుంచి జారిపడి ఒకరికి గాయాలు

టెక్కలి, జూన్‌ 24 (ఆంధ్ర జ్యోతి): టెక్కలి నుంచి గుణుపూర్‌ వైపు వెళ్తున్న రైలు నుంచి లక్ష్మీపురం వద్ద టెక్కలి ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన ఎం.వెంకటరమణ మంగళవారం జారిపడి గాయ పడ్డాడు. స్థానికులు 108 వాహ నానికి సమాచారం ఇవ్వగా క్షతగాత్రుడ్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిం చారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

ద్విచక్ర వాహనాలు ఢీకొని గాయాలు

వజ్రపుకొత్తూరు, జూన్‌ 24(ఆంధ్ర జ్యోతి): పూండి రైల్వే అండర్‌ పాసేజ్‌ సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. గోవిందపురం గ్రామానికి చెందిన గుంట చంటి గ్రామం నుంచి పూండి బస్టాండ్‌కు బైక్‌ పై వెళుతుండగా ఎదురుగా మరో బైక్‌ పై వస్తున్న మెలియా పుట్టి మండలం కంజాలకు చెందిన శివ ఢీకొట్టడంతో చంటికి కుడిచేయి విరిగి పోయింది. కంటికి దెబ్బ తగిలి రక్తస్రావమైంది. శివ స్పల్పగాయాలతో బయట పడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా క్షత గాత్రుడిని టెక్కలి ఏరియా ఆసుపత్రికి తరలించించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్‌ఐ నిహార్‌ను వివరణ కోరగా సమాచారం అందిందని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:40 PM