Share News

టాప్‌-3లో జేసీ

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:28 AM

'E-Office' statistics revealed ప్రజల వినతులు.. పరిపాలనా పరమైన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను వేగంగా పరిష్కరించడంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్‌ సాధించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, మంత్రి అచ్చెన్నాయుడు 15వ స్థానంలో నిలిచారు.

టాప్‌-3లో జేసీ

కలెక్టర్‌, మంత్రి అచ్చెన్నకు 15వ ర్యాంకు

‘ఈ-ఆఫీస్‌’ గణాంకాల వెల్లడి

శ్రీకాకుళం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రజల వినతులు.. పరిపాలనా పరమైన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను వేగంగా పరిష్కరించడంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్‌ సాధించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, మంత్రి అచ్చెన్నాయుడు 15వ స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శుల స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఫైళ్ల కదలికపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు బుధవారం అమరావతిలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ‘ఈ-ఆఫీస్‌ ఫైల్స్‌ డిస్పోజల్‌’ నివేదికను విడుదల చేసింది. ఇందులో గత మూడు నెలల(సెప్టెంబరు 9 నుంచి డిసెంబరు 9 వరకు) అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు ప్రకటించింది.

జాయింట్‌ కలెక్టర్ల పనితీరులో ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జేసీల జాబితాలో ఆయన 3వ స్థానంలో నిలిచి జిల్లాకు గుర్తింపు తెచ్చారు. జేసీ లాగిన్‌కు వచ్చిన ఫైలు సగటున కేవలం 1 రోజు 3 గంటల 34 నిమిషాల్లోనే పరిష్కారమవుతోంది. గత మూడు నెలల్లో జేసీకి 944 ఫైళ్లు రాగా.. ఆయన పాతవాటితో కలిపి ఏకంగా 1005 ఫైళ్లను పరిష్కరించడం విశేషం. అలాగే జూలై 2024 నుంచి ఇప్పటివరకూ ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. జేసీ మొత్తం 4,591 ఫైళ్లను పరిష్కరించి రాష్ట్రంలో 4వ స్థానంలో కొనసాగుతున్నారు.

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పనితీరు రాష్ట్ర సగటుతో పోలిస్తే పర్వాలేదనిపించేలా ఉంది. కలెక్టర్ల జాబితాలో ఆయన 15వ స్థానంలో నిలిచారు. కలెక్టర్‌ లాగిన్‌కు వచ్చిన ఫైలు పరిష్కారానికి సగటున 2 రోజుల 7 గంటల 19 నిమిషాల సమయం పడుతోంది. గత మూడు నెలల కాలంలో కలెక్టర్‌ కార్యాలయానికి 931 ఫైళ్లు రాగా.. అందులో 703 ఫైళ్లను పరిష్కరించారు.

మంత్రుల పనితీరు జాబితాలో జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 15వ స్థానంలో ఉన్నారు. జూలై 2024 నుంచి ఆయనకు 2,715 ఫైళ్లు రాగా.. 2,846 ఫైళ్లను(పాత వాటితో కలిపి) పరిష్కరించారు. మంత్రి అచ్చెన్న సగటున ఒక ఫైలుకు 5 రోజుల 22 గంటల సమయం కేటాయిస్తున్నారు.

జిల్లా యంత్రాంగానికి కొత్త ఉత్సాహం..

పరిపాలనలో జాయింట్‌ కలెక్టర్‌ వేగం జిల్లా యంత్రాంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, భూ సమస్యల ఫైళ్లు జేసీ పరిధిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమాన్యులకు ఇది శుభపరిణామం. అదే సమయంలో కలెక్టర్‌ కార్యాలయం కూడా ఫైళ్ల పరిష్కార వేగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

Updated Date - Dec 12 , 2025 | 12:28 AM