Share News

Srikurmam: డోలోత్సవం చూతమురారండి

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:13 AM

Traditional celebration జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. గార మండలం శ్రీకూర్మంలో బుధవారం నుంచి డోలోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడురోజులపాటు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు.

Srikurmam: డోలోత్సవం చూతమురారండి

  • శ్రీకూర్మనాథుని సన్నిధిలో నేటి నుంచి.. మూడు రోజులపాటు వేడుకలు

  • గార, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. గార మండలం శ్రీకూర్మంలో బుధవారం నుంచి డోలోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడురోజులపాటు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. తొలిరోజు బుధవారం కామదహనోత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. గురువారం స్వామి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం గ్రామసమీపంలో కామదహన మండపం వద్ద అశేష భక్తజనుల మధ్య అర్చకస్వాములు కామదహనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎండిన కొబ్బరికొమ్మను నిలబెట్టి దానికి పూజలు చేసిన అనంతరం హోమం నిర్వహించి.. ఆ కొబ్బరికొమ్మకు నిప్పంటిస్తారు. శ్రీమహావిష్ణువు తన కోర్కెలు దహింపజేసుకోవడానికి గుర్తుగా ఈ కామదహనోత్సవాన్ని నిర్వహిస్తారు. 14న డోలోత్సవంలో భాగంగా శ్రీదేవి, భూదేవి, గోవిందరాజు స్వామి ఉత్సవమూర్తులకు తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం వాటిని డోలో మండపంలోని ఊయలలో ఉంచుతారు. అక్కడ స్వామిని ఉత్తరాభిముఖంగా భక్తులు దర్శిస్తారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైన విజయనగరం పూసపాటి గజపతుల గోత్రనామాలతో స్వామి బుక్కా భర్గుండతో పూజలు చేస్తారు. ఈ డోలోత్సవాలను తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.

  • పురాణగాథల్లో ఇలా..

  • శ్రీకూర్మం.. శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో స్వయంభువుగా వెలసిన దివ్యక్షేత్రం. రెండు ధ్వజస్తంభాలు, 108 నల్లరాతి స్తంభాలతో పశ్చిమాభిముఖుడైన శ్రీకూర్మం రూపంలో మహావిష్ణువు ఇక్కడ అవతరించారు. సాక్షాత్తూ బ్రహ్మాదేవుడే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణగాఽథల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం ఎప్పుడు నిర్మితమైందన్న దానికి చారిత్రక ఆధారాలు లేవు. కాగా.. నాలుగో శతాబ్దం నుంచి 14, 16 శతాబ్దాల వరకు అప్పటి రాజులు ఆలయ అభివృద్ధికి ఎంతెంత విరాళాలు ఇచ్చారన్నది స్తంభాలపై ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. 1135లో అనంతపద్మ చోళగంగదేవుడు దండయాత్ర చేస్తూ పశ్చిమోత్తర దేశాన్ని జయించినట్లు ఒక శాసనంలో ఉంది. 12వ శతాబ్దానికి పూర్వం దీనికి శైవక్షేత్రంగా వ్యవహరించేవారని ఒక వాదన ఉంది. ఈ ఆలయంపై భాగం అష్టదళ పద్మాకారాంలో ఉండటం విశేషం.

Updated Date - Mar 12 , 2025 | 12:13 AM