Share News

Inter study: జేఈఈ, నీట్‌ కోచింగ్‌

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:41 PM

Training for competitive exams in government junior colleges ఇంటర్‌ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రక్షాళనకు దిగింది. జాతీయ స్థాయిలో మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ సిలబస్‌తో విద్యార్థులకు బోధన అందిస్తోంది.

Inter study: జేఈఈ, నీట్‌ కోచింగ్‌
పూండి గోవిందపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇటీవల ఎంసెట్‌, నీట్‌పై అవగాహన పరీక్ష రాస్తున్న విద్యార్థులు

  • ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పోటీ పరీక్షలకు శిక్షణ

  • ఇందుకోసం అధ్యాపకులకు ప్రత్యేక తరగతులు

  • వారంలో మూడు రోజులపాటు విధిగా తరగతులు

  • సమూలమార్పులు తీసుకు వచ్చిన ప్రభుత్వం

  • విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు

  • కాశీబుగ్గ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రక్షాళనకు దిగింది. జాతీయ స్థాయిలో మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ సిలబస్‌తో విద్యార్థులకు బోధన అందిస్తోంది. ఆపై కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా నీట్‌, ఐఐటీ, జేఈఈ, ఏఈపీసెట్‌ తదితర పోటీ పరీక్షలకు సైతం విద్యార్థులకు శిక్షణ అందించి వారిని సిద్ధం చేస్తోంది. దీనిపై రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, అతిథి అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కొనసాగుతోంది. ఒకవైపు అధ్యాపకుల శిక్షణ, ఇంకో వైపు విద్యార్థులకు బోధన సమాంతరంగా నడుస్తోంది. దీంతో ఈ ఏడాది ఇంటర్‌లో ఉత్తీర్ణతతో పాటు పోటీ పరీక్షల్లో సైతం ఇంటర్‌ విద్యార్థులు సత్తాచాటే అవకాశం ఉంది.

  • ముందస్తుగానే పుస్తకాలు సరఫరా..

  • వైసీపీ ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు అరకొరగానే పాఠ్య పుస్తకాలను అందించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం ముందస్తుగానే అన్ని పుస్తకాలను పంపిణీ చేసింది. పాఠ్య పుస్తకాలతోపాటు ఐఐటీ, నీట్‌, జేఈఈ, ఎంసెట్‌ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను సరఫరా చేసింది. కార్పొరేట్‌ స్థాయిలో బోధనా సౌకర్యాలు కల్పించడంతో ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ఐఐటీ, నీట్‌, జేఈ, ఎంసెట్‌లో ప్రభుత్వ విద్యార్థులు మంచి ర్యాంకులు పొందితే మాత్రం వచ్చే ఏడాది ప్రవేశాలు మరింత పెరిగే అవకాశముంది.

  • అధ్యాపకులకు శిక్షణ.. విద్యార్థులకు బోధన

  • ఐఐటీ, జేఈఈ, నీట్స్‌, ఎంసెట్‌ వంటి పోటీ పరీక్షలకు సంబంధించి బోధనకుగాను అధ్యాపకులకు శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజీలో ఆగస్టు నుంచి శిక్షణ ప్రారంభమైంది. విడతల వారీగా అన్ని జూనియర్‌ కాలేజీలకు చెందిన మ్యాథ్స్‌, వృక్ష, జంతు, భౌతిక, రసాయన అధ్యాపకులకు అధికారులు శిక్షణ అందిస్తున్నారు. బిట్స్‌ అనేవి ఎలా చెప్పితే విద్యార్థులకు అర్థం అవుతుందో ఈ శిక్షణలో వివరిస్తున్నారు. ఐఐటీ, జేఈఈ, నీట్స్‌, ఎంసెట్‌కు ఎలా తర్ఫీదునివ్వాలో చెబుతున్నారు. డిసెంబరు వరకు ఈ శిక్షణ కొనసాగనుంది. శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా వారంలో మూడు రోజులు అధ్యాపకులు విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రతి శనివారం ఇంటర్‌ బోర్డు ఆన్‌లైన్‌ ద్వారా పోటీ పరీక్ష పేపర్‌ పంపిస్తుంది. దీనిపై విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, వారి మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

  • వసతులు మెరుగు..

  • ఒకవైపు బోధనాపరంగా.. మరోవైపు వసతులుపరంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను తీర్చిదిద్దారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నారు. సన్నబియ్యంతో కూడిన మంచి ఆహారం విద్యార్థులకు అందిస్తోంది. తల్లికివందనం పథకం అమలు చేస్తుంది. ఒకవైపు ఇంటర్‌ విద్యను సంస్కరించడం, ఇంకోవైపు బోధన మెరుగుపరచడం, మరోవైపు జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా తీర్చిదిద్దడంతో సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

  • జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు: 38

  • ఆదర్శ పాఠశాలలు : 13

  • కస్తూర్బా విద్యాలయాలు : 25

  • హైస్కూల్‌ ప్లస్‌ : 6

  • గురుకుల విద్యాలయాలు : 9

  • ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు : 12 వేల మందికిపైగా

  • అధ్యాపకులు శ్రద్ధ చూపాలి

  • విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బోధనపై ప్రతి అధ్యాపకుడు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో ఈ ఏడాది నుంచి ఎంసెట్‌, నీట్‌, జేఈఈకి సంబంధించి తరగతులు, అవగాహన పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో ప్రస్తుతం 26 కళాశాలలకు వెళ్లి బోధన తీరును పరిశీలించాం. ప్రభుత్వ ఆలోచనతో విద్యార్థుల్లో పోటీపరీక్షలపై మరింత ఆసక్తి కనిపిస్తోంది.

  • - ఆర్‌.సురేష్‌కుమార్‌, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి

  • శుభ పరిణామం

  • ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టింది. ఐఐటీ, జేఈఈ, నీట్‌,ఎంసెట్‌ వంటి పోటీ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం శుభ పరిణామం. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను నిలపాలన్న ప్రయత్నం ఆహ్వానించదగ్గది.

  • - ఫల్గుణరావు, రసాయనశాస్త్ర అధ్యాపకుడు, బాలుర ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ

  • సిలబస్‌లో మార్పు

  • ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సిలబస్‌ మారింది. కేవలం పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొనే ఇంటర్‌ బోర్డు ఈ మార్పు తెచ్చింది. సెకెండ్‌ లాంగ్వేజ్‌గా ఎంపీసీలో ఒక గ్రూప్‌, బైపీసీలో ఒక గ్రూప్‌గా ఎంపిక వెనుక అదే ఆలోచన. పాఠ్యపుస్తకాలు కూడా ముందస్తుగా అందించడం, అధ్యాపకులకు శిక్షణనివ్వడంతో బోధన ప్రారంభమైంది. కచ్చితంగా అనుకున్న లక్ష్యాలను జూనియర్‌ కాలేజీలు చేరువవుతాయి.

    - వెంకటేశ్వరరావు, భౌతికశాస్త్ర అధ్యాపకుడు, బాలుర ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ

  • అర్థమయ్యేలా బోధిస్తున్నారు..

  • సిలబస్‌ కష్టంగా ఉన్నా అధ్యాపకులు అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు. ముఖ్యంగా నీట్‌, ఐఐటీ, జేఈఈ, ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షార్ట్‌కట్‌ విధానంలో బోధన చేస్తున్నారు. తప్పకుండా పోటీ పరీక్షల్లో రాణిస్తాం అనే నమ్మకం కలిగిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

    - జాస్మిని, విద్యార్థిని, పూండి

Updated Date - Sep 16 , 2025 | 11:41 PM