Share News

independence day celebrations: జెండా పండగకు వేళాయే

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:18 AM

Ready for the 15th of August celebrations శ్రీకాకుళంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానం వేదికగా.. శుక్రవారం స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభాప్రాంగణం, పోలీసుల పరేడ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రభుత్వ పనితీరు తెలిపే శకటాల ప్రదర్శన.. సందర్శకులు.. జిల్లా ప్రజలు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్షం కారణంగా కాస్త ఇబ్బందులు ఎదురైనా.. అధికారులు వాటిని అధిగమించారు.

independence day celebrations: జెండా పండగకు వేళాయే
శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమైన వేదిక

  • పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం

  • శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాట్లు

  • జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రి అచ్చెన్న

  • ఉత్తమ సేవలందించిన 169 మందికి ప్రశంసాపత్రాలు

  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభం

  • శ్రీకాకుళం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానం వేదికగా.. శుక్రవారం స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభాప్రాంగణం, పోలీసుల పరేడ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రభుత్వ పనితీరు తెలిపే శకటాల ప్రదర్శన.. సందర్శకులు.. జిల్లా ప్రజలు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్షం కారణంగా కాస్త ఇబ్బందులు ఎదురైనా.. అధికారులు వాటిని అధిగమించారు. ఇప్పటికే జిల్లా ఆవిర్భావం సందర్భంగా వజ్రోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆగస్టు 15 అంటేనే.. స్వాతంత్య్ర దినోత్సవం. అదేరోజున శ్రీకాకుళం జిల్లా కూడా ఆవిర్భవించడంతో ఏటా ఈ రోజున రెండు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. శుక్రవారం ఆర్ట్స్‌ కళాశాలల్లో జాతీయ జెండాను మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్ర పోరాట యోధుల కుటుంబాలను సన్మానించనున్నారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 169 మంది ఉద్యోగులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేస్తారు. 71 ప్రభుత్వ శాఖల నుంచి 163 మంది ఉద్యోగులను, 13 ఎన్జీవోల నుంచి ఆరుగురిని ఉత్తమ ప్రశంసా పత్రాలకు ఎంపిక చేశారు. అలాగే స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని నేడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

  • నేడు రామ్‌ మిర్యాల ఆధ్వర్యంలో మధురిమ..

  • జిల్లా వజ్రోత్సవాల్లో భాగంగా.. రెండోరోజు గురువారం ఎన్టీఆర్‌ మైదానంలో కర్రసాము, సంగిడి రాళ్లు ఎత్తివేత.. ఇతరత్రా క్రీడాపోటీలను నిర్వహించారు. డ్వామా పీడీ పోటీలను ప్రారంభించారు. ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వజ్రోత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రముఖ సినీగాయకుడు రామ్‌ మిర్యాల ఆధ్వర్యంలో పాటల మధురిమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం భారీగా నిర్వహించేలా ముమ్మర ప్రచారం చేశారు. అలాగే జిల్లాకేంద్రంలో విద్యుత్‌ దీపాల అలంకరణతో ప్రత్యేకత సంతరించుకుంది.

  • పరేడ్‌ను విజయవంతం చేయాలి: ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

  • స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా పోలీసు పరేడ్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సాయుధ బలగాలకు సూచించారు. శ్రీకాకుళంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో గురువారం ముందస్తు పరేడ్‌ నిర్వహించారు. ఏఆర్‌ డీఎస్పీ శేషాద్రి పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరిస్తూ.. పోలీసు కవాతు సాధన నిర్వహించారు. రిహార్సల్‌లో భాగంగా ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. మైదానంలో వీఐపీల వాహనాలు, ఇతరుల వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌ భద్రత బందోబస్తు ఏర్పాట్లుపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఏఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీలు సి.హెచ్‌. వివేకానంద, శేషాద్రి, సీఐ ఈశ్వరరావు, ఆర్‌ఐ కె.నరసింగరావు, శంకర్‌ ప్రసాద్‌, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:18 AM