Share News

బడికి వేళాయే

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:43 AM

జిల్లాలో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకా నున్నాయి. 50 రోజుల వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

బడికి వేళాయే

- నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

-సన్నబియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

రణస్థలం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకా నున్నాయి. 50 రోజుల వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది పాఠశాల విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల బదిలీలు, కొత్త పాఠశాలల ఏర్పాటు, సన్నాహాలు చేసింది. మరోవైపు విద్యాశాఖ అడకమిక్‌ క్యాలెండర్‌ ముందుగానే ప్రకటించింది. పాఠశాలల పనిదినాలు, సెలవులపై స్పష్టతనిచ్చింది. విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో కీలకమైన రెండు పథకాలకు శ్రీకారం చుట్టనుంది. మధ్యాహ్నభోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్ర కిట్ల పంపిణీ చేయనుంది. ఇప్పటికే వీటికి సంబంధించి సన్నాహాలు పూర్తిచేసింది. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1954, ప్రాథమికోన్నత పాఠశాలలు 268, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 416 ఉన్నాయి. మొత్తం 1,74,015 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్టు గణంకాలు చెబుతున్నాయి. వీరికి అవసరమైన 1,74,015 విద్యామిత్ర కిట్లు ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్నాయి.


సన్నబియ్యంతో పౌష్టికాహారం

జిల్లాలో అన్నిరకాల ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు 2,285 వరకూ ఉన్నాయి. సాంఘిక సంక్షేమ, బీసీ, ఇతర వసతిగృహాలు 281 వరకూ ఉన్నాయి. వీటన్నింటిలో గురువారం నుంచి సన్నబియ్యంతోనే భోజనాలు విద్యార్థులకు పెడతారు. ఇందుకుగాను నెలకు 620 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతాయి. గతంలో పౌరసరఫరాలశాఖ నుంచి డీలర్లకు.. అక్కడి నుంచి విద్యాసంస్థలకు అందించేవారు. అయితే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. ఇక నుంచి నేరుగా గోదాముల నుంచి విద్యాసంస్థలకు తరలించాలని నిర్ణయించారు. 25 బస్తాల బియ్యాన్ని క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న ట్యాగ్‌తో సరఫరా చేస్తారు. హెచ్‌ఎంలు స్కాన్‌ చేస్తే ఓటీపీ వస్తుంది. అప్పుడే ఈ బియ్యం విడుదలకు అనుమతిస్తుంది. దీంతో సన్నబియ్యం పక్కదారి పట్టే అవకాశమే ఉండదు.


ముందస్తు చర్యలు చేపట్టాం.

ఈ ఏడాది విద్యాశాఖపరంగా ముందస్తు చర్యలు చేపట్టాం. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ చేశాం. ఫోర్ట్‌ఫైడ్‌ బియ్యం కావడంతో పురుగు పట్టేందుకు అవకాశం లేదు. హెచ్‌ఎంలు సైతం శ్రద్ధ వహించాలి. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్ర కిట్లను సైతం విద్యార్థులకు విధిగా అందించాలి.

-తిరుమల చైతన్య, డీఈవో, శ్రీకాకుళం

Updated Date - Jun 12 , 2025 | 12:43 AM