‘కొత్త’ వేడుకలకు వేళాయే!
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:21 PM
నూతన సంవత్సర సందడి జిల్లాలో మొదలైంది. ముఖ్య పట్టణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.
- నేటి సాయంత్రం నుంచి నూతన సంవత్సర సంబరాలు
- హోటళ్లు, రిసార్ట్‌లలో ఈవెంట్లు
- కేక్‌లు, బొకేలు, రంగులకు డిమాండ్
-మద్యం షాపులకూ పండగే
నరసన్నపేట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర సందడి జిల్లాలో మొదలైంది. ముఖ్య పట్టణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, రణస్థలం, బారువ తదితర ప్రాంతాల్లోని రిసార్ట్‌లు, హాటళ్లు వేడుకలకు సిద్ధమయ్యాయి. విందులు, వినోదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో 2026 ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. హోటళ్లలో ఈవెంట్లు, ఫుడ్‌తో పాటు పార్టీలకు కూడా ప్యాకేజీలను ప్రకటించాయి. జంటతో వస్తే రూ.2వేలు, ఒంటరిగా వచ్చిన వారికి రూ.500 నుంచి రూ.1,200వరకు చార్జ్ చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. క్యాండిల్ లైట్ డిన్నర్, వినోద కార్యక్రమాలతో పాటు వివిధ షోలకు కూడా సిద్ధం చేస్తున్నారు.
రంగులకు డిమాండ్
కొత్త సంవత్సరం వచ్చిందంటే ముందు రోజు రాత్రి పల్లె నుంచి పట్టణం దాకా ఇళ్ల ముందర రంగవల్లికలు తీర్చిదిద్దడంలో మహిళలు బీజీబీజీగా గడుపుతారు. ఈ ఏడాది ముగ్గులు వేసేందుకు వినియోగించే రంగులకు భారీగా డిమాండ్ పెరిగింది. గత రెండు రోజులుగా వివిధ రంగులను కొనుగోలు చేసేవారితో షాపులు కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు నరసన్నపేట, కాశీబుగ్గ, టెక్కలి, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, సోంపేట, తదితర పట్టణాల్లో రంగుల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. పల్లెల్లో సైతం రంగులను విక్రయిస్తున్నారు.
మిఠాయిలు...బహుమతులు
కొత్త సంవత్సరం రోజున స్నేహితులకు బహుమతులు, పూలబొకేలు, పండ్లు, స్వీట్లు ఇవ్వడం ఆనవాయితీ. స్వీట్ షాపులు, గిఫ్ట్ షాపుల్లో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. నర్సరీల నిర్వాహకులు ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేసి పూలమొక్కలు, అలంకరణ మొక్కలు...పూలను అందుబాటులో ఉంచారు.
కేక్‌లు, బిర్యానీలకు డిమాండ్
నూతన సంవత్సర వేడుకలకు బిర్యానీ పాయింట్లు ఆఫర్లు ప్రకటించాయి. బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వీటి విక్రయాలు జోరుగా సాగనున్నాయి. దాబాలు, హోటల్స్ ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దాబాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. కేక్‌లు కిలో రూ.300 నుంచి రూ.1000 వరకు పలుకుతున్నాయి. ఇవి విభిన్న రంగులు, సైజుల్లో లభ్యమవుతున్నాయి.
మద్యానికి డిమాండ్
నూతన సంవత్సరంలో మద్యం విక్రయాలదీ ప్రధాన పాత్రే. 31వ తేదీ రాత్రి విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని మద్యం షాపులు, బార్‌లు అదనపు స్టాక్‌ని ముందుస్తుగానే తెచ్చి సిద్ధంగా ఉంచుకున్నాయి. మామూలు రోజుల కంటే ఈ రెండు రోజుల్లో మూడింతలు అధికంగా వ్యాపారాలు సాగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం మీద అన్ని రకాల వ్యాపారాలు భారీగా సాగే అవకాశాలు ఉన్నాయి.