Share News

IIIT: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు వేళాయే!

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:07 AM

IIIT admissions ఆరేళ్ల కోర్సు.. సీటు వచ్చిందంటే చాలు.. ఉజ్వల భవిత పొందవచ్చు. ఫ్లస్‌ 2(పీయూసీ రెండేళ్లు), ఇంజనీరింగ్‌ నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసి ఎంచక్కా అటు నుంచి అటే ఉద్యోగంలో చేరే అద్భుత అవకాశం. ఇదీ ట్రిపుల్‌ ఐటీ ప్రత్యేకత. అందుకే ఈ కోర్సులో చేరేందుకు చాలామంది విద్యార్థులు ఇష్టపడుతుంటారు. ఇటీవల పదో తరగతి ఫలితాలు వెల్లడైన వేళ.. ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు రంగం సిద్ధమైంది.

 IIIT: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు వేళాయే!
శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌

  • నాలుగు క్యాంపస్‌ల్లో 4,400 సీట్ల భర్తీకి సన్నాహాలు

  • రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

  • జూన్‌ 5న ఎంపిక జాబితా విడుదల

  • 11 నుంచి కౌన్సెలింగ్‌.. 30 నుంచి తరగతులు

  • ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల కోర్సు.. సీటు వచ్చిందంటే చాలు.. ఉజ్వల భవిత పొందవచ్చు. ఫ్లస్‌ 2(పీయూసీ రెండేళ్లు), ఇంజనీరింగ్‌ నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసి ఎంచక్కా అటు నుంచి అటే ఉద్యోగంలో చేరే అద్భుత అవకాశం. ఇదీ ట్రిపుల్‌ ఐటీ ప్రత్యేకత. అందుకే ఈ కోర్సులో చేరేందుకు చాలామంది విద్యార్థులు ఇష్టపడుతుంటారు. ఇటీవల పదో తరగతి ఫలితాలు వెల్లడైన వేళ.. ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. మన రాష్ట్రంలో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ) పరిధిలో శ్రీకాకుళం(ఎచ్చెర్లలోని ఎస్‌.ఎం.పురం), నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ(ఆర్‌కే వ్యాలీ)లో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ క్యాంపస్‌ల్లో అడ్మిషన్లకు ఆర్జీయూకేటీ ఈ నెల 24న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 27 నుంచి మే 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పదో తరగతిలో మార్కులు, రిజర్వేషన్‌ ప్రాతిపదికన మెరిట్‌ జాబితాను రూపొందించి.. కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లను కేటాయిస్తారు.

  • గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేకం

  • గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు. తొలుత నూజివీడు, ఇడుపులపాయలో ట్రిపుల్‌ ఐటీలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం, ఒంగోలులో 9ఏళ్ల కిందట ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు. ఇందులో సీటు పొందే ప్రతి విద్యార్థికి మంచి భవిష్యత్‌ ఉంటుందనడంలో సందేహంలేదు. క్యాంపస్‌ నుంచే బహుళ జాతి కంపెనీల్లోకి ఉద్యోగాల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

  • ఇవీ అర్హతలు

  • పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో 2024-25 విద్యా సంవత్సరంలో రెగ్యులర్‌ విద్యార్థులుగా తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఓసీ, ఈడబ్ల్యూఎస్‌, బీసీ విద్యార్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 దరఖాస్తు రుసుం చెల్లించాలి. మొత్తం సీట్లలో 85శాతం లోకల్‌ విద్యార్థులకు(ఆంధ్రప్రదేశ్‌), 15 శాతం ఓపెన్‌ సీట్లు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పదోతరగతి మార్కులకు 0.4 గ్రేస్‌ పాయింట్లను అదనంగా కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్లూడబ్ల్యూ డాట్‌ ఆర్జీయూకేటీ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

  • జూన్‌ 5న ఎంపిక జాబితా

  • ఆర్జీయూకేటీ పరిధిలో ట్రిపుల్‌ ఐటీలో సీటుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా జూన్‌ 5న ప్రకటిస్తారు. జూన్‌ 11 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. నూజివీడు క్యాంపస్‌లో పీహెచ్‌సీ, క్యాప్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, స్కౌట్స్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి సీట్లు, అదనంగా ఈడబ్ల్యూఎస్‌ కింద మరో 100 సీట్లు ఉంటాయి. మొత్తం ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు క్యాంపస్‌ల్లో 4,400 సీట్లను భర్తీ చేస్తారు. పీయూసీకి ఏడాదికి ట్యూషన్‌ ఫీజు రూ.45 వేలు, ఇంజనీరింగ్‌కు ఏడాదికి రూ.50 వేలుగా నిర్ణయించారు. తెలుగేతర రాష్ట్రాల వారికి 25 శాతం సూపర్‌ న్యూమరీ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ అభ్యర్థులు ఏడాదికి ట్యూషన్‌ ఫీజు రూ.1.50 లక్షలు చెల్లించాలి.

  • కోర్సులివే

    ట్రిపుల్‌ ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు ఉన్నాయి. నూజివీడు, ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌ల్లో వీటితోపాటు మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు అదనంగా ఉన్నాయి.

  • గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

  • పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నిర్ధేశించిన గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్ధేశించిన అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి దరఖాస్తు చేయాలి. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

    - డాక్టర్‌ కేవీజీడీ బాలాజీ, ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌, శ్రీకాకుళం క్యాంపస్‌

Updated Date - Apr 26 , 2025 | 12:07 AM