vinayaka chavithi : గణపతి పూజకు వేళాయె
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:04 AM
Today is Ganeshachaturdhi వినాయకచవితి వేడుకలకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఊరూరా.. వీధివీధినా గణనాథుడి విగ్రహాలను కొలువుదీర్చేందుకు ఉత్సవ కమిటీలు మండపాలు సిద్ధం చేశాయి.
నేడు వినాయకచవితి
నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన మండపాలు
కిటకిటలాడిన మార్కెట్‌లు
వర్షం కారణంగా తప్పని ఇబ్బందులు
శ్రీకాకుళం కల్చరల్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): వినాయకచవితి వేడుకలకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఊరూరా.. వీధివీధినా గణనాథుడి విగ్రహాలను కొలువుదీర్చేందుకు ఉత్సవ కమిటీలు మండపాలు సిద్ధం చేశాయి. ఎక్కడ చూసినా విద్యుత్ దీపాలు వెలుగులు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కొన్ని సూచనలు చేశారు. మండపాల వద్ద రాత్రి 10 గంటల వరకే మైకులకు అనుమతి ఇచ్చారు. ఉత్సవాల్లో మద్యం, నిషేధిత వస్తువులు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జనం రోజున విగ్రహానికి తగ్గట్టు వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలని, చెరువులు, నదుల వద్ద పిల్లలు, మైనర్లను దూరంగా ఉంచాలని చెప్పారు.
వర్షమైనా.. మార్కెట్ రద్దీ
వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళంలోని పొట్టిశ్రీరాముల మార్కెట్, రైతుబజారు మంగళవారం రద్దీగా కనిపించాయి. ఓ వైపు వర్షం కురుస్తున్నా, పూజాసామగ్రి కొనుగోలు కోసం ప్రజలు మార్కెట్‌కు తరలివచ్చారు. వినాయక విగ్రహాలతో పాటు వివిధ రకాల పండ్లు, పూలు, పూజాసామగ్రి విరివిగా కొనుగోలు చేశారు. వర్షం కారణంగా ఎక్కడికక్కడ రహదారులపై నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. రైతుబజార్ వద్ద, పెద్ద మార్కెట్ కూడలిలో మోకాళ్లలోతు వరకు నీరు నిలిచిపోయి.. మురుగునీరు కూడా రోడ్డుపై ప్రవహించడంతో అవస్థలు పడ్డారు.