Share News

ఇంకా వారమే!

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:00 AM

Deadline for house construction applications జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. వాస్తవానికి గత నెల 30తోనే దరఖాస్తుల స్వీకరణ ప్రకియ ముగిసినా.. ప్రభుత్వం ఈ నెల 14 వరకూ గడువు పెంచింది.

ఇంకా వారమే!
సర్వే చేసి వివరాలు నమోదు చేస్తున్న సచివాలయ ఉద్యోగి

ఇళ్ల నిర్మాణ దరఖాస్తులకు ముగియనున్న గడువు

జిల్లాలో చురుగ్గా పీఎం ఆవాస్‌ యోజన సర్వే

ఇప్పటివరకూ 56వేల మంది పేర్లు నమోదు

ఇచ్ఛాపురం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. వాస్తవానికి గత నెల 30తోనే దరఖాస్తుల స్వీకరణ ప్రకియ ముగిసినా.. ప్రభుత్వం ఈ నెల 14 వరకూ గడువు పెంచింది. ఈ పథకం కింద పక్కా ఇంటిని నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.59 లక్షలు మంజూరు చేస్తుంది. ఇంటి నిర్మాణానికి రూ.1.20 లక్షలు, స్వచ్ఛభారత్‌ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు, ఉపాధి హామీ పథకం కింద మరో రూ.27వేలు అందిస్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరికొంత మొత్తాన్ని అందజేయనుంది. కొద్దిరోజులుగా సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి దరఖాస్తులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఇళ్ల కోసం 56వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో 9,671 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో 4,708 దరఖాస్తులు అందాయి. ఆమదాలవలసలో 7,979, పాతపట్నంలో 7,437, టెక్కలిలో 6,061, ఇచ్ఛాపురంలో 6,133, నరసన్నపేటలో 8,331, పలాస నియోజకవర్గంలో 5,695 దరఖాస్తులు వచ్చాయి. ఇంకా వారం రోజులపాటు గడువు ఉండడంతో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ లేఅవుట్ల పేరిట నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. దీంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టేందుకు ముందుకు రాలేదు. అందుకే ఈసారి అర్హత, ఆసక్తి ఉన్న వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేయనున్నారు.

దరఖాస్తుల తిరస్కరణ..

గత ప్రభుత్వాల హయాంలో గృహాలు మంజూరైన వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇటువంటి వారు జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేసింది. 2018 వరకూ బిల్లులు బాగానే చెల్లించినా.. తరువాత కేవలం ఖాతాలో రూ.1 మాత్రమే పడింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటి గురించి పట్టించుకోలేదు. వైసీపీ హయాంలో సైతం చాలామందికి లబ్ధిదారుల ఖాతాల్లో మాత్రం నిధులు జమకాలేదు. బిల్లులు రాకపోగా.. తాజాగా దరఖాస్తులు చేసుకుంటే తిరస్కరణకు గురవుతున్నాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జగనన్నకాలనీల పేరుతో లబ్ధిదారులకు సెంటు స్థలం ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ చాలామందికి పట్టాలిచ్చి ఆ స్థలాలు ఎక్కడున్నాయో చూపలేదు. అటువంటి వారి దరఖాస్తులు సైతం తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో వారికి ఆందోళన తప్పడం లేదు.

చురుగ్గా దరఖాస్తు ప్రక్రియ

జిల్లాలో ఇళ్ల దరఖాస్తులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. గత నెల 30తో దరఖాస్తు గడువు ముగిసింది. కానీ ప్రభుత్వం గడువు పెంచింది. ఈ నెల 14 వరకూ అవకాశం ఇచ్చింది. ప్రతి దరఖాస్తునూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించాం.

- బి.రమాకాంతరావు, గృహనిర్మాణ శాఖ అధికారి, శ్రీకాకుళం

Updated Date - Dec 08 , 2025 | 12:00 AM