Share News

రుణాలు చెల్లిస్తున్నా గృహాలు ఇవ్వట్లే!

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:11 AM

సొంతింటి కోసం వారు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. రుణాలు చెల్లిస్తున్నా వారికి ఇంకా గృహాలు ఇవ్వడం లేదు.

రుణాలు చెల్లిస్తున్నా గృహాలు ఇవ్వట్లే!
పలాసలోని టిడ్కో గృహాలు

-ఎనిమిదేళ్లుగా టిడ్కో ఇళ్ల కోసం ఎదురుచూపు

- లబ్ధిదారులకు తప్పని ఇబ్బందులు

పలాస, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సొంతింటి కోసం వారు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. రుణాలు చెల్లిస్తున్నా వారికి ఇంకా గృహాలు ఇవ్వడం లేదు. సొంత గూడు లేక అద్దెళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. ఒకపక్క రుణభారం..మరోపక్క అద్దె భారంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పలాసలోని టిడ్కో గృహ లబ్ధిదారుల పరిస్థితి. 2014-2019లో టీడీపీ ప్రభుత్వం పట్టణంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ముందుగానే లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి బ్యాంకుల నుంచి రుణం ఇప్పించింది. అనంతరం ఆ డబ్బులను ప్రభుత్వం తీసుకుని గృహ నిర్మాణాలు ప్రారంభించింది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీకి సంబంధించి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో మొత్తం 50 ఎకరాలు సేకరించి, అందులో 1,980 గృహాలు నిర్మించడానికి చర్యలు తీసుకుంది. అందులో 980 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసింది. రివర్స్‌ టెండర్ల పేరుతో గృహ నిర్మాణాలను ఆపేసింది. అప్పటికే లబ్ధిదారులను గుర్తించడం, వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం జరిగిపోయింది. లబ్ధిదారులు గతంలో చెల్లించిన డీడీలను తిరిగి ఇచ్చేస్తామని, వారికి ఉచితంగా గృహ నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తామని వైసీపీ నేతలు నమ్మబలికారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ తతంగమే నడిచింది. అప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలకు నీలం రంగు పూయడం తప్ప ఆ ప్రభుత్వం చేసిందేమీ లేదు. తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం టిడ్కో గృహ నిర్మాణాలు తామే ప్రారంభించామని, తామే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామని ప్రకటించింది. దీంతో లబ్ధిదారులంతా ఆనందంలో మునిగితేలారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా టిడ్కో ఇళ్ల నిర్మాణం ఊసే లేదు. వచ్చే ఏడాది జూన్‌లో గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామని అసెంబ్లీలో మంత్రి నారాయణ చేసిన ప్రకటన తప్ప దీనిపై స్పష్టమైన హామీ ఏదీ దొరక్కపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టిడ్కో గృహ నిర్మాణ ప్రాంతం అడవిని తలపిస్తోంది. ప్రధాన మార్గాల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. గోడలకు తీగ చెట్లు అల్లుకుపోయాయి. పాత భవనాలు మాదిరిగా దర్శనమిస్తున్నాయి. పక్కా రహదారి ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు. విద్యుత్‌, తాగునీరు సదుపాయాలు లేవు. మురుగుకాలువలు పూర్తిగా నిర్మాణానికి నోచుకోలేదు. మొత్తం పనులు పూర్తి చేయాలంటే కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడున్న నిర్మాణం పరిస్థితిని చూసి లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. బ్యాంకులకు ప్రతినెలా వడ్డీలతో సహా రుణం చెల్లిస్తున్నా టిడ్కో గృహాలు సొంతంకాకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా టిడ్కో గృహాలను పూర్తి చేసి తమకు అందించాలని కోరుతున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 12:11 AM