PM Janman Scheme: నిధులున్నా పనులు చేయట్లే!
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:13 AM
PM Janman Scheme: జిల్లాలో పీఎం జన్‌మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి.
- జిల్లాలో ‘నత్తనడకన’ పీఎం జన్‌మన్
- పూర్తికాని గిరిజనుల గృహాలు
- తొమ్మిది శాతం కూడా దాటని ప్రగతి
- చాలాచోట్ల పునాది స్థాయిలోనే..
శ్రీకాకుళం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎం జన్‌మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధులున్నా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. చాలాచోట్ల పునాది దశ కూడా దాటలేదు. దీంతో గిరిజనుల సొంతింటి కల నెరవేరని పరిస్థితి ఏర్పడింది. తాజాగా వెల్లడైన అధికారిక నివేదికే ఇందుకు సాక్ష్యం.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్‌మన్) పథకం కింద గిరిజనులకు 1,565 ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి రూ.37.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ, ఇప్పటివరకు కేవలం 129 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. ఈ పథకం ప్రారంభమై ఇన్నాళ్లవుతున్నా కనీసం 9 శాతం ఇళ్లు కూడా పూర్తి కాలేదంటే యంత్రాంగం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 770 ఇళ్లు (సుమారు యాభై శాతం) ఇంకా ప్రారంభ దశలోనే (నాట్ స్టార్టడ్-ఎన్‌ఎస్) ఉన్నాయి. పలాస నియోజకవర్గంలో 195 ఇళ్లు మంజూరైతే ఇప్పటివరకు పూర్తయింది కేవలం రెండు గృహాలు మాత్రమే. అంటే 1 శాతం ప్రగతి కూడా లేదు. టెక్కలి నియోజకవర్గంలో పరిస్థితి మరీ ఘోరం. 48 ఇళ్లు మంజూరైతే ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. పాతపట్నం నియోజకవర్గంలో 989 ఇళ్లకు గాను 110 పూర్తయ్యాయి. ఇంకా 453 గృహాల పనులు ప్రారంభమే కాలేదు. 426 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మందస మండలంలో 136 ఇళ్లకు ఒక్కటి కూడా పూర్తికాలేదు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ. 37.40 కోట్లు. ఇప్పటివరకు ఖర్చు చేసింది రూ.9.87 కోట్ల (26 శాతం) నిధులు మాత్రమే. మిగిలిన నిధులు ఎప్పుడు ఖర్చు చేస్తారు..? ఇళ్లు ఎప్పుడు పూర్తి చేస్తారు? అన్నదానికి అధికారుల నుంచి సమాధానం లేదు. నిధుల కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిని గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. దీనికి కారణం అధికారుల పర్యవేక్షణ లోపమా? లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పీఎం జన్‌మన్ పనులను పరుగులు పెట్టిస్తారో లేదో చూడాలి.