అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ముందుకు రావట్లే!
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:05 AM
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్)ను ప్రవేశపెట్టింది.
- ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియోగించుకోని యజమానులు
- భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుందని వెనకడుగు
- అవగాహన కల్పిస్తున్న అధికారులు
పలాస, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్)ను ప్రవేశపెట్టింది. జీవో నెంబర్ 134 ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకొని సంబంధిత భూములను క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఇచ్చింది. అయితే, ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా అక్రమ లేఅవుట్లను క్రమబద్దీకరించుకోవడానికి సంబంధిత యజమానులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వానికి భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందన్న అనుమానంతో వెనకడుగు వేస్తున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా వారు ఆసకి ్త కనపరచడం లేదు. జిల్లాలో పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మునిసిపాలిటీలతో పాటు శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఉంది. వీటి పరిధిలో మొత్తం 120కు పైగా అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. వీటి ద్వారా రూ.50 కోట్లకు పైగా ఆదాయం వస్తుందనే ఆశతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఉన్నారు. అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియోగించుకోవడానికి అక్రమ లేఅవుట్ల యజమానులు ముందుకురాకపోవడంతో జోనల్ కార్యాలయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఈ బాధ్యతలను టౌన్‌ప్లానింగ్ అధికారులకు అప్పగించారు. పర్యవేక్షులుగా మున్సిపల్ కమిషనర్లను నియమించారు. ప్రస్తుతం అన్ని లేఅవుట్ల వద్దకు అధికారులు వెళ్లి కొలతలు వేయడంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న రాయతీలు, లాభాలపై సంబంధిత యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. కొద్ది రోజులే సంబంధిత వెబ్‌సైట్ నిర్వహిస్తుండడంతో అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నారు.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో మొత్తం 22 అనధికార లేఅవుట్లు ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించడం వల్ల మున్సిపాలిటీకి రూ.6 కోట్ల మేర ఆదాయం రానుంది. కానీ, ఇప్పటి వరకూ ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఇప్పటికే సంబంధిత లేఅవుట్లులో ఇళ్ల నిర్మాణం కూడా జరిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. అందరికి ముందుగా నోటీసులు అందించి ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి రావాలని అధికారులు కోరుతున్నారు. 2025 జూన్ 30 లోపు స్థలానికి సేల్‌డీడ్ ఉండాలి. నియమాలు వచ్చిన 90 రోజుల్లోగా ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో సంబంధిత డాక్యుమెంట్లతో వివరాలు నమోదు చేసుకుంటే ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి సంబంధిత లేఅవుట్ల వస్తాయి. అందులో నిర్మాణం చేసిన భవనాలకు అనుమతులు సులభంగా వస్తాయి. దీంతో పాటుగా నిబంధనల ప్రకారం గడువులోగా దరఖాస్తు చేసుకుంటే 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జిలతో 50 శాతం రాయతీ వస్తుందని నిబంధనలు చెబుతున్నాయి. క్రమబద్ధీకరించుకోపోతే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు. దీంతో పాటుగా విద్యుత్, మంచినీటి సరఫరా, రోడ్లు, కాలువల నిర్మాణాలు కూడా చేపట్టరు. బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తాయి.
వినియోగించుకోండి
ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రతి అక్రమ లేఅవుటుదారుడూ వినియోగించుకోవాలి. అదనపు చార్జీలు లేకుండా క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. పలాస-కాశీబుగ్గలో 22 లేఅవుట్లు గుర్తించాం. మొత్తం అన్నీ వీటి పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్ సిబ్బంది సంబంధిత యజమానులతో మాట్లాడుతున్నారు. నిర్మాణందారులు, అమ్మకందారులకు ఎంతో ఉపయోగపడే ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియోగించుకోండి.
-ఎన్.రామారావు, కమిషనర్, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ