Share News

Madanagopala Sagaram: ఆక్రమణలతో ‘మదన’పడుతోంది..

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:09 PM

Madanagopala Sagaram: మదనగోపాల సాగరం జలాశయం బక్కచిక్కింది. ఓ వైపు ఆక్రమణలు, మరోవైపు పూడికలు, ఇంకోవైపు లీకులైన సర్‌ప్లస్‌వైర్లు, బలహీనమైన గట్లతో అధ్వానంగా తయారైంది.

Madanagopala Sagaram: ఆక్రమణలతో ‘మదన’పడుతోంది..
చుక్కనీరు లేని మదనగోపాలసాగరం జలాశయం

-బక్కచిక్కిన మదనగోపాలసాగరం

- జలాశయంలో పేరుకుపోతున్న పూడిక

- సర్‌ప్లస్‌వైర్‌ నుంచి లీకులు

- బాగు చేయాలని రైతాంగం విన్నపం

టెక్కలి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): మదనగోపాల సాగరం జలాశయం బక్కచిక్కింది. ఓ వైపు ఆక్రమణలు, మరోవైపు పూడికలు, ఇంకోవైపు లీకులైన సర్‌ప్లస్‌వైర్లు, బలహీనమైన గట్లతో అధ్వానంగా తయారైంది. దీంతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఐదు దశాబ్దాల కిందట మదనగోపాల సాగరం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. వంశధార ప్రధాన ఎడమకాలువ వెంబడి వచ్చే నీటితో పాటు మాలపేట గెడ్డ, దుర్గ గెడ్డల నుంచి వచ్చే క్యాచ్‌మెంట్‌ వర్షపు నీరంతా నిల్వ ఉండేలా దీన్ని నిర్మించారు. గతంలో 285 ఎకరాల్లో నిర్మించిన ఈ జలాశయం ప్రస్తుతం బక్కచిక్కిపోయింది. కొంతవరకు ఆక్రమణలకు గురికావడంతో పాటు పూడికలు, కంపుచెట్లతో జలాశయం నిండిపోయింది. దీంతో 0.172టీఎంసీ నిల్వ సామర్థ్యం నుంచి 0.152టీఎంసీ సామర్థ్యానికి పడిపోయింది. ఫలితంగా దిగువ ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. ఇప్పటికైనా సాగరాన్ని బాగు చేయాలని రైతులు కోరుతున్నారు.


బాగు చేస్తేనే సాగునీరు..

మదనగోపాలసాగరాన్ని పూర్తిస్థాయిలో బాగు చేస్తేనే టెక్కలి, నందిగాం, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో సుమారు 34వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందనుంది. సుమారు రూ.10కోట్లు వెచ్చించి పూడికలు, పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు గట్లను పటిష్ఠం చేయాలి. అలాగే, సర్‌ప్లస్‌వైర్‌ లీకులు అరికడితే సాగునీరు వృథా కాకుండా ఉంటుంది. వంశధార ప్రధాన ఎడమకాలువ వెంబడి సుమారు 650 క్యూసెక్కులు, అధిక వర్షాలు పడే సమయంలో మాలపేటగెడ్డ, దుర్గగెడ్డ నుంచి 4,440 క్యూసెక్కుల నీరు క్యాచ్‌మెంట్‌ ఏరియా రూపంలో జలాశయంలోకి చేరుతుంది. ఈ పరిస్థితిలో గట్లు బలంగా ఉంచడం, పూడికలు తొలగించడం వంటివి చాలా అవసరం.


2019 ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మదనగోపాల సాగరంలో పూడికతీత పనులకు సుమారు రూ.1.60కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో అధికారులు రూ.70లక్షలు వరకు వెచ్చించి కొంతమేరకు పూడికతీత పనులు చేపట్టారు. మిగిలిన నిధులు వెచ్చించే సరికి ప్రభుత్వం మారిపోయంది. ఆ తరువాత కాంట్రాక్టర్లు పనులు చేపట్టకపోవడంతో సుమారు రూ.90లక్షల నిధులు వినియోగం లేక మురిగిపోయాయి. కాగా, ప్రస్తుతం ఈ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను టూరిజం హబ్‌గా మార్చేందుకు మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ఆదేశాలతో అధికారులు రూ.10కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జలాశయంలో వంద ఎకరాలను ప్రత్యేక కొలనుగా తయారుచేసి బోటు షికార్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.


పూడిక తొలగిస్తాం

మదనగోపాలసాగరం జలాశయంలో పూడికలు తొలగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. సర్‌ప్లస్‌వైర్ల లీకులను గుర్తించాం. గండ్లు పడకుండా ఉండేందుకు బండింగ్‌ పనులు కూడా చేపట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.

- బి.శేఖరరావు, ఈఈ, వంశధార ప్రధాన ఎడమ కాలువ

Updated Date - Jun 03 , 2025 | 11:09 PM