నర్శింగ్ కళాశాలకు మోక్షమేదీ?
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:11 AM
nursing college works incomplete ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. నర్శింగ్ కళాశాలకు మోక్షం కలగడం లేదు. పదేళ్ల కిందట అప్పటి టీడీపీ ప్రభుత్వం జిల్లా కేంద్రానికి సమీపాన సింగుపురంలో రూ.12.5కోట్ల వ్యయంతో ప్రభుత్వ నర్శింగ్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
పదేళ్లుగా అసంపూర్తిగా నిర్మాణ పనులు
టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన
పట్టించుకోని గత ప్రభుత్వం
అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా భవనం
శ్రీకాకుళం రూరల్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. నర్శింగ్ కళాశాలకు మోక్షం కలగడం లేదు. పదేళ్ల కిందట అప్పటి టీడీపీ ప్రభుత్వం జిల్లా కేంద్రానికి సమీపాన సింగుపురంలో రూ.12.5కోట్ల వ్యయంతో ప్రభుత్వ నర్శింగ్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2015 ఆగస్టు 17న అప్పటి వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొన్నాళ్లపాటు భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగాయి. కానీ 2019లో ప్రభుత్వం మారడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ కళాశాల నిర్మాణ పనులు అసంపూర్తిగా వదిలేశారు. టీడీపీ హయాంలో పురోగతిలో ఉన్న ఏ ఒక్క ప్రభుత్వ భవనాన్నీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈక్రమంలో నర్శింగ్ కళాశాల భవనాన్ని కనీసం ఒక్కసారి కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. దీంతో భవనం అసంపూర్తిగానే ఉండి.. అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. మందుబాబులు.. చుట్టుపక్కల వారు దర్జాగా ఆ భవనాన్ని వినియోగించుకుంటున్నారు. భవనం చుట్టూ పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి.. వర్షపునీరు నిలిచిపోతుంది.
పాడవుతున్న భవనం..
నర్శింగ్ కళాశాల నిర్వహణకు.. పరిపాలనకు గాను భవనం నిర్మాణం సమగ్రంగా చేయాల్సి ఉంది. ఇదంతా భవన నిర్మాణ ప్లాన్‌లో ఉంది. ప్రస్తుతం భవనం నిర్మాణం పూర్తయింది. కిటికీలకు తలుపులు అమర్చలేదు. దీంతో రాత్రివేళ.. కొందరు ఆ భవనంలోకి ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. స్థానికులు కొందరు ఆయా కిటికీలకు ఇటీవల తాళ్లు కట్టి.. ముళ్లకంచెలు వేసి.. తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. ఇదిలా ఉండగా.. పూర్తిస్థాయిలో బిల్లుల చెల్లింపూ జరగకపోవడంతో కొన్ని పనులు మధ్యలో వదిలేశారు. నర్శింగ్ కళాశాలకు సంబంధించి మరో భవనం నిర్మాణం కోసం పిల్లర్లు వేసి అంతటితోనే నిలిపివేశారు. ఈ భవనం.. జాతీయ రహదారికి అనుకుని పక్కనే ఉంది. నేటికి పదేళ్లు పూర్తయినా పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారిస్తే నర్శింగ్ కళాశాల వినియోగంలోకి వచ్చే అవకాశముంది. లేదంటే కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనం .. ప్రారంభానికి ముందే శిఽథిలమయ్యే పరిస్థితి ఏర్పడనుంది.
ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించా:
శ్రీకాకుళం నియోజకవర్గంలో నర్శింగ్ కళాశాల అసంపూర్తిగా ఉండిపోయింది. దీనికి నిధులు అవసరమని రెండుసార్లు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లాను. నిధులు మంజూరుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నా. అతి త్వరలో నర్శింగ్ కళాశాల పనులు ప్రారంభమయ్యే అవకాశముంది.
- గొండు శంకర్, ఎమ్మెల్యే, శ్రీకాకుళం