Share News

హాస్టళ్లపై పర్యవేక్షణేదీ?

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:12 AM

: జిల్లాలోని వసతి గృహాలకు పూర్తిస్థాయిలో వార్డెన్లు లేరు. సగానికిపైగా హాస్టళ్లను ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు.

 హాస్టళ్లపై పర్యవేక్షణేదీ?
ఇచ్ఛాపురం బీసీ హాస్టల్‌

81 వసతి గృహాలకు 44 మంది వార్డెన్లే

ఒక్కొక్కరికీ రెండు హాస్టళ్ల బాధ్యత

సక్రమంగా అమలు కాని మెనూ

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

ఇచ్ఛాపురం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వసతి గృహాలకు పూర్తిస్థాయిలో వార్డెన్లు లేరు. సగానికిపైగా హాస్టళ్లను ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో వాటిపై పర్యవేక్షణ లేక విద్యార్థులు గాడి తప్పుతున్నారు. వారికి మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 81 ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 6,500 మంది విద్యార్థులు వసతి పొందుతూ చదువుతున్నారు. అయితే, 81 హాస్టళ్లకు గాను కేవలం 44 మంది వార్డెన్లు మాత్రమే ఉన్నారు. 34 హాస్టళ్లకు సంబంధించి ఇన్‌చార్జిలే ఉండడంతో పరిస్థితి మరింత తీసికట్టుగా మారుతోంది. సగానికిపైగా వార్డెన్లు లేకపోవడంతో ఒక్కొక్కరు రెండు హాస్టళ్ల బాధ్యతలు చూస్తున్నారు. వాస్తవానికి ప్రతి హాస్టల్‌లో వార్డెన్‌, డిప్యూటీ వార్డెన్‌, కుక్‌, సహాయకులు, నైట్‌ వాచ్‌మన్‌ ఉండాలి. దగ్గరలో ఉన్న పీహెచ్‌సీ ఏఎన్‌ఎంలు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తుండాలి. కానీ, వార్డెన్లు అరకొరగా ఉండగా.. మిగతా సిబ్బంది కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన పని చేస్తున్నారు. రెండు మూడు హాస్టళ్ల బాధ్యతలను అప్పగించడంతో వార్డెన్లు పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించ లేకపోతున్నారు. దీంతో మెనూ అమలు, హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆహారం పరిమాణం, నాణ్యత తగ్గుతోంది. విద్యార్థులకు వసతి కూడా సక్రమంగా అందడంలేదు. కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత 20 ఏళ్లుగా వార్డెన్‌ల నియామకాలు జరగడం లేదు. చాలామంది పదవీ విరమణ పొందిన వారి స్థానంలో కొత్త వారు రాలేదు. దీంతో ఏడాదికేడాది వార్డెన్‌ పోస్టులు ఖాళీ అవుతున్నాయి.

పెరగని డైట్‌ చార్జీలు..

గత ఐదేళ్లుగా విద్యార్థుల డైట్‌ చార్జీలు పెరగడం లేదు. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచకపోవడంతో వసతిగృహ అధికారులు మెనూలో కోత విధిస్తున్నారు. వారానికి ఆరు రోజులు పెట్టాల్సిన కోడిగుడ్డును రెండు రోజులే పెడుతున్నారు. చికెన్‌ వారానికి ఒక రోజుకే పరిమితం చేస్తున్నారు. కూరల్లో నాణ్యత కొరవడుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో చివరి సారిగా మెస్‌ చార్జీలు పెరిగాయి. అప్పట్లో ఉన్న నిత్యావసర ధరలకు ఇప్పటి ధరలకు 100 నుంచి 150 శాతం తేడా ఉంది. ప్రభుత్వం చెల్లించే ధరకు బయట మార్కెట్‌లో ఉన్న ధరకు భారీ వ్యత్యాసం ఉండడంతో ఏం చేయాలో వార్డెన్లకు పాలుపోవడం లేదు. దీంతో మెనూ అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెస్‌ చార్జీలను పెంచాలని కోరుతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం

వసతి గృహాలకు వార్డెన్ల కొరత ఉన్నది వాస్తవమే. అయినా ఎక్కడా ఏ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నాం. జిల్లాలో 34 హాస్టళ్లకు సంబంధించి వార్డెన్ల కొరత ఉంది. కొందరికి అదనపు బాధ్యత పడుతోంది. ప్రభుత్వానికి నివేదించాం. జిల్లాలో వార్డెన్‌ పోస్టుల ఖాళీల వివరాలు డైరెక్టరేట్‌ ఇచ్చారు. ఏపీపీఎస్‌ లేదా డిస్ట్రిట్‌ సెలక్షన్‌ కమిటీ(డీఎస్‌సీ) ద్వారా పోస్టులు భర్తీ అవుతాయి.

-ఈ.అనూరాధ, బీసీ సంక్షేమ శాఖ అధికారి, శ్రీకాకుళం

Updated Date - Sep 04 , 2025 | 12:12 AM