Share News

ఓబీసీ గుర్తింపేదీ?

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:09 AM

suffering of the KVT caste people వజ్రపుకొత్తూరు మండలంలోని నువ్వలరేవు.. జిల్లాలోనే ప్రత్యేకమైన గ్రామం. శ్రీరామనవమి ఉత్సవాలు, సామూహిక వివాహాలు వైభవంగా జరుగుతుంటాయి. ఆచార సంప్రదాయాలు, కుల కట్టుబాట్లు, పెద్దల తీర్పును శిరసావహించే కేవీటీ కులస్థులు రాష్ట్రంలో ఈ ఒక్క గ్రామంలోనే 95 శాతం మంది ఉన్నారు.

ఓబీసీ గుర్తింపేదీ?
నువ్వలరేవు గ్రామం

ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం

నువ్వలరేవు కేవీటీ కులస్థుల ఆవేదన

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుపై ఆశలు

వజ్రపుకొత్తూరు, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలంలోని నువ్వలరేవు.. జిల్లాలోనే ప్రత్యేకమైన గ్రామం. శ్రీరామనవమి ఉత్సవాలు, సామూహిక వివాహాలు వైభవంగా జరుగుతుంటాయి. ఆచార సంప్రదాయాలు, కుల కట్టుబాట్లు, పెద్దల తీర్పును శిరసావహించే కేవీటీ కులస్థులు రాష్ట్రంలో ఈ ఒక్క గ్రామంలోనే 95 శాతం మంది ఉన్నారు. పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో కేవీటీలను ఎస్సీలుగా గుర్తించారు. మన రాష్ట్రంలో మాత్రం బీసీ-ఏగా కొనసాగుతున్నారు. సముద్రంలో చేపలు పట్టడం, విక్రయించడం వారి వృత్తి. సుమారు 300 ఏళ్ల కిందట ఒడిశా నుంచి ఉపాధి కోసం చాలామంది నువ్వలరేవు వచ్చి.. ఇక్కడ స్థిరపడ్డారు. తొలుత వీరు ఓసీగానే కొనసాగినా 14 ఏళ్ల కిందట బీసీ-ఏ జాబితాలో చేర్చారు. వీరంతా ఓబీసీ గుర్తింపు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఓబీసీ గుర్తింపు లేక ఉన్నత చదువులకు దూరమవుతున్నామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేఈఈ మెయిన్స్‌, నీట్‌ లాంటి ఉన్న చదువుల్లో రిజర్వేషన్‌ పొందలేక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఓబీసీగా గుర్తింపు కోసం అధికారులు, నాయకుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోతోందని ఆవేదన చెందుతున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అయినా స్పందించి తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని నువ్వలరేవుకు చెందిన కేవీటీ కులస్థులు కోరుతున్నారు.

ఉన్నత చదువులకు దూరం

మా కుమారుడు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేవీటీ కులాన్ని బీసీ-ఏ జాబితాలో చేర్చింది. ప్రస్తుతం మా కుమారుడు ఇంటర్మీడియట్‌ చదువుతూ.. ఐఐటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఓబీసీ లేకపోవడం వల్ల ఓసీ కోటాలోనే పోటీ పడాల్సి వస్తోంది. రిజర్వేషన్‌ కోల్పోతున్నాం. మా గ్రామంలో చాలామంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారు.

- బైనపల్లి భీమారావు, నువ్వలరేవు

న్యాయం చేయాలి

కేవీటీ కులాన్ని ఓబీసీగా గుర్తిస్తే.. అనేకమంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. గ్రామంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఈ దిశగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవ చూపాలి.

- ఏజ్రా, మాజీ సర్పంచ్‌, నువ్వలరేవు

నాయకుల దృష్టికి తీసుకెళ్లాం

కేవీటీలకు ఓబీసీ గుర్తింపు విషయమై నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే గౌతు శిరీష సహాకారంతో కేంద్రమంత్రి రామ్మోహనాయడును కలుస్తాం. విద్యార్థులు నష్టపోకుండా ఈబీసీ ధ్రువపత్రాలతో కొంతవరకు రిజర్వేషన్‌ పొందవచ్చు.

- పూర్ణ, సర్పంచ్‌, నువ్వలరేవు

Updated Date - Nov 09 , 2025 | 12:09 AM