Share News

నెలలో సాధ్యమేనా?

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:38 AM

Construction of medical and health department buildings జిల్లాలో వైద్య సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన భవన నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి పనులు నత్తనడకన సాగుతున్నాయి.

నెలలో సాధ్యమేనా?
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ భవనం

నత్తనడకన వైద్యఆరోగ్యశాఖ భవనాల నిర్మాణం

నిధులున్నా పనుల్లో జాప్యం

మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

శ్రీకాకుళం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైద్య సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన భవన నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) తాజా నివేదిక పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నివేదికలో ఎక్కడ చూసినా ‘పనులు పురోగతిలో ఉన్నాయి.. నెమ్మదిగా జరుగుతున్నాయి’ అనే మాటలే కనిపిస్తున్నాయి. అధికారులు చాలా పనులకు ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి పూర్తిచేయాలని గడువు విధించారు. కానీ శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌)తోపాటు ఆమదాలవలస, నరసన్నపేట, రాజాం, ఆమదాలవలస తదితర ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో ఇప్పటివరకు సగం పనులు కూడా పూర్తికాలేదు. మెడికల్‌ కాలేజీ మరమ్మతులు, మరుగుదొడ్ల రిపేర్లు, ఓపీ బ్లాక్‌ రినోవేషను.. ఇలా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెల రోజుల్లో వాటిని ఎలా పూర్తిచేస్తారన్నది ప్రశ్నార్థకమవుతోంది.

పనులన్నీ పూర్తయ్యేదెప్పుడో..?

శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి(రిమ్స్‌)లో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌(సీసీబీ) పనులు 20 శాతమే పూర్తయ్యాయి. పీఎం అభిమ్‌ నిధులు రూ.23.75 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ పనుల గడువు ఈ ఏడాది డిసెంబరు 31తో ముగుస్తుంది. కానీ ఇప్పటివరకు ఖర్చు చేసింది కేవలం రూ.4.31 కోట్లు మాత్రమే. ఇంకా సుమారు రూ.19 కోట్ల విలువైన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నెల రోజుల్లో ఈ భారీ నిర్మాణం ఎలా పూర్తవుతుందో అధికారులే సెలవియ్యాలి.

నరసన్నపేటలో వంద పడకల ఆసుపత్రి కోసం రూ.12.60 కోట్లు కేటాయిస్తే.. ఇప్పటికి ఖర్చు చేసింది రూ.6.35కోట్లు మాత్రమే. ఇప్పటివరకు సగం పనులే అయ్యాయి. ఇక విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నా... ఈ డివిజన్‌ కిందకు వచ్చే రాజాం ఏరియా ఆసుపత్రిలో రూ.6.80 కోట్ల పనులకుగాను ఖర్చు చేసింది రూ.3.18 కోట్లు మాత్రమే.

మందస, కొత్తూరు, కోటబొమ్మాళి సీహెచ్‌సీల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆమదాలవలస సీహెచ్‌సీ (30 పడకలు) అభివృద్ధి పనులు ప్రస్తుతం జరగడమే లేదు. రూ.2.45కోట్లు మంజూరైతే కేవలం రూ.91 లక్షలు ఖర్చు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇక్కడ పనులు నిలిచిపోయినా గడువు మాత్రం డిసెంబరు 31 అని రాసుకోవడం విడ్డూరం.

15సార్లు టెండర్లు పిలిచినా..

కవిటి సీహెచ్‌సీ మరమ్మతుల కోసం రూ.20లక్షలు మంజూరయ్యాయి. దీనికోసం ఇప్పటికి ఏకంగా 15సార్లు టెండర్లు పిలిచారు. అయినా ఒక్క కాంట్రాక్టర్‌ కూడా ముందుకు రాలేదు. ఈ ఏడాది సెప్టెంబరు 19 నాటికే చివరి గడువు ముగిసినా ఎవరూ టెండర్‌ వేయలేదు. ఇంత దారుణంగా వ్యవస్థ ఉంటే ప్రజలకు వైద్యం ఎలా అందుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. డిసెంబరు 31 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం విధించిన అధికారులు.. క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌, ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

గడువులోగా కష్టమే

గడువులోగా ఈ నెలాఖరు నాటికి కొన్ని భవనాలు పూర్తవ్వడం కష్టమే. నాబార్డు ద్వారా చేపడుతున్న పనులను నాగార్జున కనస్ట్రక్షన్స్‌ చూస్తోంది. ఇవి సుమారు ఐదేళ్ల నుంచి పనులు జరుగుతున్నాయి. బిల్లుల సమస్య లేకపోయినా నెమ్మదిగా పనులు సాగుతున్నాయి. నర్శింగ్‌ కళాశాల హాస్టల్‌ భవనాల పనులు ప్రారంభించాం. రిమ్స్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌, సెకెండరీ హెల్త్‌ డైరెక్టర్‌ మెయింటెన్స్‌ గ్రాంట్‌ కింద మంజూరైన పనులు పూర్తిచేయిస్తాం. ఇక కవిటికి మాత్రం టెండర్‌ వేసేందుకు ఎవరూ రావడం లేదు.

- సిమ్మ సిమ్మన్న, ఈఈ(ఎఫ్‌ఏసీ), ఏపీఎంఎస్‌ఐడీసీ.

Updated Date - Dec 01 , 2025 | 12:38 AM