Share News

సాగునీరేదీ?

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:58 PM

ఎచ్చెర్ల నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం. కనీస స్థాయిలో కూడా సాగునీటి వనరులు లేవు.

సాగునీరేదీ?
చుక్క నీరులేని తోటపల్లి కాలువ

- ప్రధాన కాలువకే పరిమితమైన ‘తోటపల్లి’

- పిల్ల కాలువలు లేక అందని నీరు

- మూడు మండలాల రైతులకు తప్పని వెతలు

రణస్థలం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం. కనీస స్థాయిలో కూడా సాగునీటి వనరులు లేవు. ఈ పరిస్థితుల్లో గత టీడీపీ ప్రభుత్వం తోటపల్లి కాలువను జి.సిగడాం, లావేరు మీదుగా రణస్థలం మండలానికి విస్తరించింది. ఈ మూడు మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ కాలువ విస్తరణ జరిగింది. దీంతో కొంతవరకు సాగునీటి అవసరాలు తీరాయి. కానీ, పిల్ల కాలువల అనుసంధానం పనులు జరగకపోవడంతో పంట పొలాలకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తోటపల్లి కాలువపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగింది. శివారు ఆయకట్టుగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి నీరు వచ్చిందా? లేదా? అని గత పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారు. తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా తోటపల్లి పిల్లకాలువలపై దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ఈ ఖరీఫ్‌కు కూడా పూర్తిస్థాయి సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. వచ్చే ఖరీఫ్‌ నాటికైనా పిల్ల కాలువల పనులు పూర్తి చేయడంపై ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు దృష్టిపెట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

ముందుకు కదలని పనులు

తోటపల్లి కాలువకు సంబంధించి రణస్థలం మండలంలో 21,590 ఎకరాలు, లావేరులో 11,008, జి.సిగడాం మండలంలో 6,373 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. కానీ, అందులో సగం కూడా నీరు అందించలేని స్థితిలో కాలువ ఉంది. పిల్ల కాలువల నిర్మాణానికి ముందుగా భూసేకరణ చేయాలి. రణస్థలం మండలంలో 60 కిలోమీటర్ల పిల్ల కాలువల నిర్మాణానికి 52 ఎకరాలను సేకరించాల్సి ఉంది. లావేరు మండలంలో 6.7 కిలోమీటర్ల పిల్లకాలువలకుగాను 6.41 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. పరిహారం చెల్లించేందుకు రూ.19 కోట్లు సిద్ధంగా ఉంది. కానీ, ఎందుకో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. లావేరు, గురుగుబిల్లి, బెజ్జిపురం, శిగిరికొత్తపల్లి తదితర గ్రామాల్లో పిల్ల కాలువలు తవ్వినప్పటికీ చుక్క నీరు పారడం లేదు. దీంతో కాలువల్లో పిచ్చిమొక్కలు పేరుకుపోయాయి. తోటపల్లి భూసేకరణ అధికారుల మధ్య సమన్వయలోపమే జాప్యానికి కారణంగా తెలుస్తోంది. గత ఏడాది తోటపల్లి కాలువ పక్కనే ఉన్న వేల్పురాయి, దేవరాపల్లి, కమ్మసిగడాం, అర్జునవలస, పున్ననపాలెం తదితర గ్రామాలకు చుక్కనీరు అందలేదు. పైడిభీమవరం, దేరసాం పిసిని, నారువ తదితర గ్రామాలకు పిల్ల కాలువలు తవ్వలేదు. దీంతో నీరు అందక అవస్థలు తప్పలేదు.

ఇబ్బందులు తప్పడం లేదు

పేరుకే తోటపల్లి కాలువ ఉంది. కానీ, నిత్యం సాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధాన కాలువ ఉన్నా పిల్ల కాలువలు లేవు. దీంతో నీరు అందడం లేదు. వర్షాకాలంలో మాత్రమే..అది కూడా భారీ వరదలు వచ్చే సమయంలోనే కాలువలో నీరు పారుతోంది. లేకుంటే మాత్రం నీరు లేకుండా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం స్పందించి కాలువను ఆధునీకరించాలి. శివారు ఆయకట్టుకు సాగునీరు అందించాలి.

-మీసాల రామారావు, రైతు, రణస్థలం మండలం

పిల్ల కాలువలు నిర్మించాలి

ఎచ్చెర్ల నియోజకవర్గానికి తోటపల్లి కాలువ రావడంతో సంబరపడిపోయాం. కానీ, ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్లక్ష్యం కొనసాగింది. పిల్ల కాలువలను నిర్మించడంలో జగన్‌ సర్కారు విఫలమైంది. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం. కనీసం వచ్చే ఏడాదైనా పిల్ల కాలువల నిర్మాణం పూర్తిచేయాలి.

-బాడిత రాంబాబు రైతు, గురుగుబిల్లి, లావేరు మండలం

Updated Date - Jul 30 , 2025 | 11:58 PM