Share News

2,500 ఎకరాలకు సాగునీరందేనా?

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:30 AM

పోర్టు రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా రైతులకు సాగునీటి ముప్పు ఎదురవుతోంది. సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు కోసం నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

2,500 ఎకరాలకు సాగునీరందేనా?
టెక్కలి సమీపంలో కాలువ నిర్మాణ ప్రాంతాలను పరిశీలిస్తున్న వంశధార, పోర్టు అధికారులు(ఫైల్‌)

  • పోర్టురోడ్డు నిర్మాణంతో వంశధార కాలువలు కప్పేశారు

  • ఆందోళనలో 20 గ్రామాల రైతులు

టెక్కలి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): పోర్టు రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా రైతులకు సాగునీటి ముప్పు ఎదురవుతోంది. సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు కోసం నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మదనగోపాలసాగరం నుంచి మూలపేట వరకు 13.6 కిలోమీటర్లు.. వందమీటర్ల వెడల్పుతో విస్తరణ పనులు చేపడుతున్నారు. టెక్కలి, సంతబొమ్మాళి మండలాల్లోని 20 గ్రామాల్లో కాలువలు, చెరువులు కప్పేస్తున్నారు. వంశధార పరిధిలో 50ఏఆర్‌, 50ఆర్‌, 49ఆర్‌, 48ఆర్‌ కాలువల పైనుంచి రోడ్లు వేస్తున్నారు. దీంతో తమకు సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోర్టు రోడ్డు పనులు పర్యవేక్షిస్తున్న మారిటైం బోర్డు సివిల్‌ ఇంజనీర్లు, విశ్వసముద్ర సంస్థ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా సుమారు 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుందో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఈ ఏడాది జనవరి 9న వంశధార ప్రధాన ఎడమకాలువ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బి.శేఖరరావు, డీఈఈలు సుధాకర్‌, నవీన్‌, మారిటైం బోర్డు సివిల్‌ ఇంజనీర్లు, విశ్వసముద్ర ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి పోర్టు రోడ్డును పరిశీలించారు. వంశధార అధికారులు ప్రస్తుతం ఉన్న 30 కాలువలతో పాటు అదనంగా మరో 20 కాలువలు అవసరమని గుర్తించారు. వీటికి సంబంధించి సుమారు రూ.8కోట్లతో ప్రతిపాదనలను పోర్టు యంత్రాంగం ముందుంచారు. దీనిపై పోర్టు యంత్రాంగం అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్థానిక వంశధార ఈఈ.. సాగునీటి కాలువల కల్వర్టుల నిర్మాణ అంశాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా పోర్టు యంత్రాంగమే ఈ పనులు జరిపిస్తే రైతులకు సమస్యలు ఉండవని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. రోడ్ల నిర్మాణంలో భాగంగా పోర్టు అధికారులు అక్కడక్కడా పైపులైన్లు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. వంశధార అధికారులు మాత్రం బాక్సు కల్వర్టులు నిర్మించాలని కోరుతున్నారు. విష్ణుచక్రం, కస్పానౌపడా, కూర్మన్నపాలెం, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ, నౌపడా ఆర్‌ఎస్‌, ఇజ్జువరం, తలగాం, బిర్లంగిపేట, వేములవాడ, బన్నువాడ, మోదుగువలస, అయోధ్యపురం, పిఠాపురం, టెక్కలి ప్రాంతాల్లో బాక్సు కల్వర్టులు అవసరమని తెలిపారు. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తున్న వేళ జూలై 2న వంశధార ప్రధాన ఎడమకాలువ వెంబడి సాగునీరు విడిచిపెట్టనున్నారు. కాగా ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులతో కప్పబడిన కాలువల ద్వారా చెరువులు ఎలా నిండుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

నేడు మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం మధ్యాహ్నం టెక్కలిలో పర్యటించనున్నారు. పోర్టు రహదారుల నిర్మాణంలో భాగంగా పక్కనున్న భూములకు సాగునీటి సమస్యను గుర్తించేందుకు ఆయా గ్రామాల రైతులతో కలిసి పరిశీలించనున్నారని టీడీపీ నాయకులు తెలిపారు.

Updated Date - Jul 01 , 2025 | 12:30 AM