చినుకు జాడేదీ?
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:16 AM
ఇప్పటికే పచ్చని పంటలతో ఖరీఫ్ కళకళలాడాల్సి ఉంది. ఎరువులు వేసుకోవడం, కలుపు నివారణ మందులు పిచికారీ చేయడంలో జిల్లా రైతులు బిజీగా ఉండాల్సింది.
- రెండు వారాలుగా ముఖంచాటేసిన వానలు
- కాలువల ద్వారా చుక్కనీరు రాని వైనం
- ఎండిపోతున్న వరి ఎదలు, ఉభాలు
-కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దమ్ములు కాలేదు
- మాడుతున్న నారు.. ఆందోళనలో రైతులు
ఇప్పటికే పచ్చని పంటలతో ఖరీఫ్ కళకళలాడాల్సి ఉంది. ఎరువులు వేసుకోవడం, కలుపు నివారణ మందులు పిచికారీ చేయడంలో జిల్లా రైతులు బిజీగా ఉండాల్సింది. కానీ, వర్షాలు లేక.. కాలువల ద్వారా సాగునీరు అందక ఆగస్టు మొదటి వారం గడుస్తున్నా ఇంకాచాలాచోట్ల నాట్లు పడలేదు. ప్రతిరోజూ మేఘాలు ఊరిస్తున్నాయే తప్ప వర్షాలు కురవడం లేదు. ఉభాలు సీజన్ కూడా దాటి పోవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అడపదడపా పడిన వానలకు రైతులు ఎదలు, నాట్లు వేశారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో అవి ఎండిపోతున్నాయి.

ఈ కౌలు రైతు పేరు యాళ్ల తవిటియ్య. నరసన్నపేట మండలం మాకివలస గ్రామానికి చెందిన తవిటయ్య 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ఎకరాకు రూ.15వేలు కౌలు చెల్లించాడు. మరో రూ.12వేలు పెట్టుబడితో దమ్ములు పెట్టి ఉభాలు చేశాడు. గత రెండు వారాలుగా వరుణుడు ముఖం చాటేశాడు. దీనికి తోడు కాలువల్లో చుక్కనీరు రాకపోవడంతో వరి నాట్లు ఎండిపోతున్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందా? అని మేఘం వైపు చూస్తూ ఇలా పొలంలోనే తవిటయ్య దీనంగా కూర్చున్నాడు.

ఈ రైతు పేరు పీస రామారావు. నరసన్నపేట మండలం కిళ్లాం గ్రామానికి చెందిన ఈయన మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి ఎదలు వేశాడు. మొదట్లో వర్షాలు అడపదడపా పడడంతో చేలు బాగుండేవి. గత రెండు వారాలుగా వర్షాలు లేక, ఎండలకు ఎదలు ఎండిపోతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న వరి ఎదలు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్నాడు. వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తున్నాడు.
నరసన్నపేట/కోటబొమ్మాళి/మెళియాపుట్టి/కొత్తూరు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచే రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకపక్క వర్షాలు లేక.. మరొపక్క కాలువల్లో సాగునీరు రాక.. ఇంకొకపక్క వేసవిని తలపించేలా ఎండలతో వరి నారు, ఎదలు, నాట్లు ఎండిపోతున్నాయి. ఇంజన్లు పెట్టి నీరు తోడుదామన్న చెరువుల్లో చుక్క నీరు కూడాలేదు. దీంతో జిల్లాలోని అనేక మండలాల్లో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి.
నరసన్నపేట మండలంలోని జమ్ము, తామరాపల్లి పంచాయతీల్లో గ్రామాల పక్కనుంచే ఎన్బీసీ కాలువ వెళ్లినా... సాగునీరు ఎడమ వైపునకు వెళ్లడం లేదు. దీనివల్ల ఆ పంచాయతీల్లో నీరందక ఎదలు ఎండిపోతున్నాయి. వంశధార నది చెంతన ఉన్న గోపాలపెంట, మాకివలస, కిళ్లాం, మబుగాం, పోతయ్యవలస, మడపాం, లుకలాం, కామేశ్వరిపేట తదితర గ్రామాల్లో సుమారు ఆరు వేల ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయి. 11 ఆర్ కిళ్లాం కాలువలో చుక్క నీరు రాకపోవడంతో మడపాం, దేవాది, కిళ్లాం రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్ము, టెక్కలిపాటు, తామరాపల్లి, గడ్డెయ్యపేట, శివరాంపురం, పొన్నానపేట గ్రామాలకు సాగునీరు అందించే టెక్కలిపాడు ఎత్తిపోథల పథకం నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా సాగునీరు అందడం లేదు. ఎత్తిపోథల పథకం నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, 11 ఆర్ కిళ్లాం కాలువ ద్వారా నీరు విడిచిపెట్టాలని, నదితీర ప్రాంతాలకు ఓపెన్ హెడ్ చానల్స్ అనుసంధానం చేసి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై వంశధార నరసన్నపేట డివిజన్ ఈఈ మురళీమోహన్ మాట్లాడుతూ.. ‘శివారు ప్రాంతాల కోసం వారం కిందట నీరు విడిచిపెట్టాం. సోమవారం నుంచి ఎన్‌బీసీ కాలువ ద్వారా సాగునీరు అందిస్తాం.’అని తెలిపారు.
కోటబొమ్మాళి మండలంలోని 38 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 10వేల హెక్టార్ల పంట భూములు ఉన్నాయి. ఇందులో వంశధార కాలువల కింద ఉన్న ఆరు వేల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారు. మరో రెండు వేల హెక్టార్లలో ఎత్తిపోతల పథకం, వర్షాధారం ద్వారా పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది రైతులు నానా ఇబ్బందులు పడి వరినాట్లు వేశారు. అయితే, రెండు నెలలుగా వర్షాలు కురవకపోవడంతో నీరు లేక వరినాట్లతో పాటు వేరుశెనగ, కూరగాయాల పంటలు ఎండిపోతున్నాయి. ఆయిల్ ఇంజన్ల పెట్టి నీరు తోడుదామన్న చెరువుల్లో చుక్కనీరు కూడాలేదు. దీంతో ఈ సీజన్‌లో పచ్చగా కనిపించాల్సిన పంట భూములు బీడుగా దర్శనమిస్తున్నాయి.
మెళియాపుట్టి మండలంలో గత రెండు వారాల నుంచి వర్షాలు లేక వరి నారు, ఎదలు ఎండిపోతున్నాయి. కొంతమంది రైతులు చెరువుల వద్ద ఇంజన్లు ఏర్పాటు చేసుకొని నారుమళ్లకు నీరు పెడుతున్నారు. గత ఏడాది ఆగస్టు మొదటి వారానికే మండలంలో దమ్ములు పూర్తయ్యాయి. కానీ, ఈ ఏడాది వర్షాలు లేక రైతులు దమ్ములు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
కొత్తూరు మండలంలో వర్షాలు ముఖం చాటేశాయి. గత రెండు వారాలుగా వానలు పడడం లేదు. పైగా ఎండల తీవ్రత కారణంగా వరి ఎదలు ఎండిపోతున్నాయి. తడిలేక నారు కూడా మాడిపోతుంది. గత ఎడాది ఆగస్టు నాటికి ఉభాలు పూర్తయ్యాయని, ఈ ఏడాది మాత్రం వర్షాలు లేక నాట్లు వేయలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.