సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలి
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:11 AM
వర్షాభావ పరిస్థితులు వలన సాగునీరు కొరతగా ఉందని, రైతులు సహకరించి పొదుపుగా వాడుకొని శివారు భూములకు అందేలా సహకరించాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష అన్నారు.
జలుమూరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితులు వలన సాగునీరు కొరతగా ఉందని, రైతులు సహకరించి పొదుపుగా వాడుకొని శివారు భూములకు అందేలా సహకరించాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష అన్నారు. పెద్దదూగాం వద్ద వంశధార ప్రధాన ఎడమ కాలువపై గల 24 నరసన్నపేట బ్రాంచి కాలువను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వంశధార ప్రధాన ఎడమ కాలువలో నీటి ప్రవాహం తగ్గి పలాస ప్రాంతం శివారు భూములకు సాగు నీరు అందలేదన్నారు. శివారు భూములకు సాగునీరు అందించేందుకు బ్రాంచి కాలువలకు నీటి ప్రవాహం తగ్గించాలని వంశధార అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్ వ్యవసాయ పనులు ప్రారంభం అయిన తరువాత వర్షాలు పడకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు వచ్చాయన్నారు. రైతులు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనడానికి సాగు నీటిని వృథా చేయకుండా అవసరం మేరకు వాడుకొని మిగతా రైతులకు సాగునీరందేలా సహకరించాలన్నారు. ఈ పరిశీలనలో జలుమూరు, నరసన్నపేట తహసీల్దార్లు జె.రామారావు, సత్యన్నారాయణ, వంశధార జేఈ ఎస్.హరీష్, రైతులు పాల్గొన్నారు.