Share News

సాగునీరు అందట్లే!

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:07 AM

పలాస నియోజకవర్గంలోని పలు సాగునీటి కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయి.

సాగునీరు అందట్లే!
ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండిన సంకుజోడి కాలువ

- ఆక్రమణలు, పిచ్చిమొక్కలతో అధ్వానంగా కాలువలు

- బీడుగా మారుతున్న శివారు భూములు

- ఆయకట్టు రైతుల ఆందోళన

- రబీకైనా బాగు చేయాలని విన్నపం

హరిపురం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలోని పలు సాగునీటి కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయి. దీనికి తోడు కాలువలు ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయి అధ్వానంగా మారుతున్నాయి. దీంతో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందస మండలంలో డబార్సింగి, కళింగదళ్‌, దామోదరసాగర్‌ రిజర్వాయర్లతోపాటు సంకుజోడి, నక్కాసాయి, గోపాలసాగరం వంటి పెద్ద చెరువులు, సునాముది, మహేంద్రతనయ కాలువలు ఉన్నాయి. పలాసలో వరహాల గెడ్డ, లొత్తూరు రిజర్వాయర్‌, వజ్రపుకొత్తూరులో బెండిగెడ్డ, వంశధార కాలువలు ఉన్నాయి. అయితే, గత రెండేళ్లుగా ఈ కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. ప్రాజెక్టులు నిండినా సంగం ఆయకట్టుకు కూడా నీరు చేరడం లేదు. రూ.వేలకు వేలు భూమి శిస్తులు చెల్లిస్తున్నా పిడికిలి పంట కూడా చేతికందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా కాలువలు ఆక్రమదారుల చెరలో చిక్కి శల్యమవుతున్నాయి. కొందరు రైతులు కాలువల గట్లను ఆక్రమించి పొలాల్లో కలిపేస్తున్నారు. ఫలితంగా శివారు భూములకు నీరందడం లేదు. పలు రిజర్వాయర్‌ల ఆయకట్టులో నిర్మించిన సిమెంటు కట్టడాలు సైతం కూలిపోయి నీరు ముందుకు పారడం లేదు. కనీసం రబీకైనా ఆక్రమణలు తొలగించి, కాలువలను బాగు చేసి సక్రమంగా సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

భూముల బీడు వారుతున్నాయి..

సంకుజోడి రిజర్వాయర్‌ నిర్మాణం కలగా మారింది. వందల ఎకరాల సంకుజోడి చెరువు, కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయి. పూడిక పేరుకుపోయి నీటి నిలువ సామర్థ్యం లేక సగం భూములకు కూడా నీరండం లేదు. కొందరు కాలువలు, గెడ్డలను ఆక్రమించి పొలాల్లో కలిపేస్తున్నారు. మరికొందరు జీడితోటలు సాగుచేస్తున్నారు. దీంతో వందలాది ఆయకట్టు భూములకు నీరందక బీడు వారుతున్నాయి. ఇప్పటికైనా ఆక్రమణలు తొలగించి కాలువలను బాగు చేయాలి.

-గెడ్డవలస భీమారావు, కుంటికోట, ఆయకట్టు రైతు

నివేదికలు తయారు చేశాం..

రిజర్వాయర్‌లకు పూర్వవైభవం కల్పించడం ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. కాలువల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం ఇప్పటికే నివేదికలు తయారు చేశాం. గతంలో నీరుచెట్టు పథకం కింద ప్రధాన నిర్మాణాలు చేపట్టాం. ప్రభుత్వ పథకాలు, ఉపాధి హామీని జతచేసి పూర్తిస్థాయిలో పనులు చేపట్టి, ఆక్రమణలు తొలగించి రైతుల కష్టాలు తీరుస్తాం.

-పి.శ్రీనివాసరావు, ఏఈఈ, జలవనరుల శాఖ, మందస

Updated Date - Dec 11 , 2025 | 12:07 AM