Lift Irrigation Scheme: కరువు నేలలో సిరులు
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:03 AM
The crops are growing well. ఒకప్పుడు వర్షం పడితేనే ఆ ప్రాంతంలో పంటలు పండేవి. లేదంటే పంట భూములు బీడుగా కనిపించేవి. గతంలో సాగునీరు అందక.. వర్షాలు పడక తీవ్ర కరువు ఏర్పడి రైతులు వలస బాట పట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వర్షాలతో సంబంధం లేకుండా మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం ద్వారా ఆ ప్రాంతానికి సాగునీరు పుష్కలంగా అందుతోంది.
మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం ద్వారా పుష్కలంగా సాగునీరు
గతంలో వర్షాలపైనే ఆధారపడి పంటల సాగు
టెక్కలి రూరల్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు వర్షం పడితేనే ఆ ప్రాంతంలో పంటలు పండేవి. లేదంటే పంట భూములు బీడుగా కనిపించేవి. గతంలో సాగునీరు అందక.. వర్షాలు పడక తీవ్ర కరువు ఏర్పడి రైతులు వలస బాట పట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వర్షాలతో సంబంధం లేకుండా మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం ద్వారా ఆ ప్రాంతానికి సాగునీరు పుష్కలంగా అందుతోంది. దీంతో కరువు నేలలో ప్రస్తుతం పంటలు బాగా పండుతున్నాయని టెక్కలి, నందిగాం మండలాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
టెక్కలి మండల పరిధిలోని 21 గ్రామాలకు, నందిగాం మండల పరిధిలోని ఐదు గ్రామాలకు గతంలో ఎలాంటి సాగునీటి వనరు ఉండేది కాదు. దీంతో రైతులు వర్షాధారంపైనే పంటలు పండించేవారు. కొన్నిసార్లు వర్షాలు పడక తీవ్ర ఇబ్బందులు పడేవారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రైతులకు సాగునీరు అందించటానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. రూ.34.38కోట్లు మంజూరు చేసి పనులు పూర్తిచేశారు. వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటిని మదనగోపాలసాగరం ఎత్తిపోతల ద్వారా రైతులకు అందించడంతో వారికి సాగునీటి కష్టాలు తీరాయి. ఈ పథకం ద్వారా గూడేం, నర్సింగపల్లి, మొఖలింగపురం, రాంపురం, బొడ్డపాడు, నౌగాం తదితర పంచాయతీల్లోని 3,300 ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. సుమారు 26 గ్రామాలకు చెందిన 3,340 మంది రైతులకు ప్రయోజనం కలుగుతోంది.
వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం..
గత వైసీపీ ప్రభుత్వం మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. ఈ పథకం నిర్వహణకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. దీంతో మోటర్లు మరమ్మతులకు గురయ్యాయి. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కూడా చోరీకి గురైంది. దీనివల్ల రైతులకు సాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. వర్షాలపైనే ఆధారపడి పంటలు పండించేవారు. వైసీపీ పాలనలో మూడేళ్లపాటు ఎత్తిపోతల పథకం పనిచేయక రైతులు పంటలు నష్టపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి జిల్లాలో 8 ఎత్తిపోతల పథకాలకు రూ.78లక్షలతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు అమర్చారు. మదనగోపాలసాగరం ఎత్తిపోతలకు రూ.36లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు పూర్తిచేసి, మంత్రి అచ్చెన్నాయుడు మళ్లీ ప్రారంభించారు. పుష్కలంగా సాగునీరు అందుతుండడంతో రైతులు వరినాట్లు వేశారు.
రైతులంతా కలసికట్టుగా..
ఎవరో వస్తారు... ఏదో చేస్తారని ఎదురుచూడకుండా రైతులంతా ఒక్కటయ్యారు. రూ.70వేలు ఖర్చు చేసి మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టారు. సాగునీటి సమస్యను పరిష్కరించుకున్నారు. ఇటీవల కిట్టాలపాడు సమీపంలో పైపులైన్ పాడవడంతో ఎగువ గ్రామాలకు రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడ్డారు. దీంతో రైతులంతా బాధ్యతగా ఒక్కటయ్యారు. ప్రభుత్వంపై భారం పడకుండా మరమ్మతుల కోసం రూ.70వేలు చందాలు వేసుకున్నారు. నర్శింగపల్లికి చెందిన టీడీపీ నాయకులు పి.షణ్ముఖరావు, దారపు పాపారావు, లచ్చుమయ్య, తిరుపతి ఆధ్వర్యంలో ఇటీవల రెండురోజులు మరమ్మతులు చేపట్టారు. సాగునీటి సమస్య పరిష్కారం కావడంతో ఎగువ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆ గ్రామాలకు కూడా..
ఎత్తిపోతల పథకం ద్వారా జగన్నాథపురం, కొల్లివలస, పాత్రపురం, పాలసింగి, గడిమెట్ట గ్రామాలకు సాగునీరు అందడం లేదు. దీనిపై రైతులు ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో జగన్నాథపురం వరకు పైపులైన్లు వేసి ఆ గ్రామాలకు సాగునీరు అందించేందుకు రూ.3.50కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
నాట్లు వేసుకుంటున్నాం
గతంలో వర్షాలు పడితే పంటలు పండేవి. లేకపోతే కరువుతో అల్లాడేవాళ్లం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మా ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు వర్షాలు లేకపోయినా మదనగోపాలసాగరం ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందుతోంది. దీంతో వరి నాట్లు వేశాం.
- దారపు, కామేష్, రైతు, నర్సింగపల్లి
ఆనందంగా ఉంది
నాడు బీడుగా కనిపించే మెట్టు భూముల్లో నేడు వరి పంటలు పండించుకొని బతుకుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. గతంలో అప్పులు చేసి వరినాట్లు వేసినా పండుతుందనే ఆశ ఉండేది కాదు. ఇప్పుడు ఆ భయం లేదు. ఎత్తిపోతల ద్వారా నీరు వస్తోంది.
- వెంకయ్య, రైతు