ఏఎన్‌ఎంల పదోన్నతుల్లో అవకతవకలు?
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:34 PM
Corruption in the DMHO office సచివాలయ ఏఎన్‌ఎంల పదోన్నతుల జాబితా తయారీలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 154 మందితో తయారుచేసిన జాబితాలో రోస్టర్ పాటించలేదని, ఎస్టీ, ఎస్సీలకు చెందాల్సిన పోస్టులను కూడా బీసీలకు కేటాయించారని కొందరు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు.
ఎస్టీ, ఎస్సీలకు మొండిచే యి
అడ్డగోలుగా జాబితా తయారీ
డీఎంహెచ్‌వో కార్యాలయంలో అవినీతిపై ఆరోపణలు
అరసవల్లి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): సచివాలయ ఏఎన్‌ఎంల పదోన్నతుల జాబితా తయారీలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 154 మందితో తయారుచేసిన జాబితాలో రోస్టర్ పాటించలేదని, ఎస్టీ, ఎస్సీలకు చెందాల్సిన పోస్టులను కూడా బీసీలకు కేటాయించారని కొందరు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. మొత్తం 154 పోస్టులకుగాను 6శాతం ఎస్టీ అభ్యర్థులకు అంటే సుమారు 9 పోస్టులు, అలాగే 15శాతం ఎస్సీ అభ్యర్థులకు అనగా 22 పోస్టులు కేటాయించాలి. కానీ అలా కేటాయించలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కొంతమంది అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏఎన్‌ఎంల పదోన్నతుల జాబితా తయారు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం జాబితా తయారుచేసి, డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నోటీసుబోర్డులో పెట్టిన తరువాత అభ్యంతరాలను స్వీకరించాలి. అనంతరం తుది జాబితాను తయారు చేయాలి. కానీ నిబంధనలు పాటించకుండా ఏ ప్రాతిపదికన జాబితా తయారు చేశారో వారికే తెలియాలన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లగా.. వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే 154 గ్రేడ్-3 ఏఎన్‌ఎంల పదోన్నతుల విషయంలో దళిత, ఆదివాసీ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దీనిపై కలెక్టర్ కూడా ఒక కమిటీ వేసి విచారణ చేయిస్తున్నారు.
అంతా అవినీతిమయం
డీఎంహెచ్‌వో కార్యాలయం అవినీతికి నిలయంగా మారిపోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఏ పని పూర్తి కావాలన్నా దానికో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఎర్న్‌డ్ లీవ్ మంజూరు చేయాలన్నా, వైద్యుల ఎస్‌ఆర్ ప్రారంభం కావాలన్నా, నర్సింగ్‌హోమ్‌కు అనుమతులు, రెన్యువల్స్, అద్దె వాహనాల బిల్లులు, సినిమాహాళ్ల అనుమతులు, పెట్రోల్ బంక్‌లు ఇలా ప్రతి దానికీ ఒక రేటు నిర్ణయించి, వసూళ్లకు పాల్పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారానికి కార్యాలయానికి వచ్చే ఉద్యోగుల విషయంలోను తీవ్ర జాప్యం జరుగుతోందని, వీటిని జిల్లా అధికారి దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా వారు ఇబ్బంది పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఓ ఉద్యోగి అనధికార సీసీగా వ్యవహరిస్తుండడం వల్లనే ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించాలని, డీఎంహెచ్‌వో కార్యాలయంలో అవినీతిని ప్రక్షాళన చేయాలని పలువురు కోరుతున్నారు.
నిబద్ధతతోనే జాబితా
ఏఎన్‌ఎంల పదోన్నతుల జాబితాను పూర్తి నిబద్ధతతో తయారు చేశాం. ప్రస్తుతం ఈ జాబితా కలెక్టర్ నియమించిన కమిటీ పరిశీలనలో ఉంది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా కలెక్టర్ అనుమతితో త్వరలో తుది జాబితా విడుదల అవుతుంది. కార్యాలయంలో ఎవరైనా ఎటువంటి అవినీతికి పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ అనిత, డీఎంహెచ్‌వో