పలాస రోడ్డు పనుల్లో అవకతవకలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:29 AM
Retired officers cut in pension పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలోని రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలకు పాల్పడినట్లు రుజువు కావడంతో అప్పటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.భాస్కరరావుపై, అప్పటి మునిసిపల్ కమిషనర్ (ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగి) ఎంవీడీ ఫణిరామ్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
రిటైర్డ్ డీఈఈ పెన్షన్‌లో ఐదు శాతం కోత
పూర్వ కమిషనర్ పెన్షన్‌లోనూ 8 శాతం కటింగ్
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
శ్రీకాకుళం, నవంబర్ 27(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలోని రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలకు పాల్పడినట్లు రుజువు కావడంతో అప్పటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.భాస్కరరావుపై, అప్పటి మునిసిపల్ కమిషనర్ (ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగి) ఎంవీడీ ఫణిరామ్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పూర్వ కమిషనర్ పెన్షన్‌లో 8 శాతం, రిటైర్డ్ డీఈఈ పెన్షన్‌లో 5 శాతం చొప్పున శాశ్వతంగా కోత విధిస్తూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
అసలేం జరిగిందంటే..
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని అంతరకుడ్డ నుంచి చినబాడాం వరకు చేపట్టిన రోడ్డు పనుల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ జరిపి 2013లో నివేదిక సమర్పించింది. అప్పటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. భాస్కరరావుతోపాటు మరో ముగ్గురి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫారస్సు చేసింది. ప్రభుత్వం నియమించిన విచారణ అధికారి(అప్పటి సూపరిండెంట్ ఇంజనీర్-జీవీఎంసీ) బీహెచ్ శ్రీనివాసరావు జరిపిన పూర్తిస్థాయి విచారణలో కె.భాస్కరరావుపై అభియోగాలు నిజమేనని తేలింది. అయితే తాను 2019లోనే ఉద్యోగ విరమణ చేశానని.. తనపై తలపెట్టిన శిక్షను రద్దు చేయాలని భాస్కరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఇచ్చిన వివరణలో సహేతుకమైన కారణాలు లేవని భావించిన ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని తిరిస్కరించింది. ప్రస్తుతం రిటైర్ట్ ఉద్యోగిగా ఉన్న కె.భాస్కరరావు పెన్షన్ నుంచి శాశ్వతంగా ఐదు శాతం మొత్తాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీచేసింది. తక్షణమే ఉత్తర్వులను అమలు చేయాలని ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశించింది.
బిల్లుల చెల్లింపుపై ఆరోపణలు
అంతరకుడ్డ - చినబాడాం రహదారి పనులకు సంబంధించి ముఖ్యంగా కాంట్రాక్టర్‌కు గడువు పొడిగింపు ఇవ్వకుండానే నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించారన్న ఆరోపణలు అప్పట్లో కమిషనర్‌గా ఉన్న ఫణిరామ్‌పై వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ప్రభుత్వం ఆరోపణలు నిజమేనని నిర్ధారించింది. ఈ వ్యవహారంపై తొలుత ఆగస్టు 2024లో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఫణిరామ్‌కు రెండు వార్షిక ఇంక్రిమెంట్లు నిలిపివేయాలని నిర్ణయించారు. అయితే ఆయన 2025 జూన్ 30న రిటైర్డ్ అయ్యారు. మొదటి ఇంక్రిమెంట్ 2024 డిసెంబరులో నిలిపివేసినా రెండో ఇంక్రిమెంట్ 2025 డిసెంబరు నాటికి ఆయన సర్వీసులో ఉండరు కనుక పాత శిక్షను అమలు చేయడం సాధ్యం కాలేదు. దీంతో ప్రభుత్వం పాత ఉత్తర్వులను రద్దు చేసి రిటైర్ట్ అయిన అధికారికి వర్తించేలా ప్రత్యామ్నాయ శిక్షను ఖరారు చేసింది.
ఎనిమిది శాతం పెన్షన్ కోత..
ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980లోని రూల్ 9 ప్రకారం ఫణిరామ్ పెన్షన్‌లో ఎనిమిది శాతాన్ని శాశ్వతంగా కోత విధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు షోకాజ్ నోటీసు ఇచ్చినప్పుడు ఫణిరామ్ తన వివరణ ఇస్తూ.. ఇది తనకు తీరని ఆర్థిక నష్టమని.. శిక్షణ తగ్గించాలని కోరారు. అయితే ఆయన వివరణలో పసలేదని భావించిన ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్పిస్తూ తుది ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ప్రిన్స్‌పాల్ సెక్రటరీ సురేష్‌కుమార్ జీఓ ఆర్టీ నంబర్ 1343 ద్వారా ఆదేశాలు జారీచేశారు.