Share News

survey numbers Irregular: అంతా గజిబిజి

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:47 PM

Invalid survey numbers వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీలోని భూముల్లో సర్వేనెంబర్లు గజిబిజిగా ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పంచాయతీ పరిధిలో ఎం.గడూరు, అనకాపల్లి, డెప్పూరు, కొండపల్లి, సంతోష్‌నగర్‌, సందిపురం గ్రామాలు ఉన్నాయి.

survey numbers Irregular: అంతా గజిబిజి
చీపురుపల్లి పంచాయతీ భూములు

  • ‘చీపురుపల్లి’లో సక్రమంగా లేని భూముల సర్వేనెంబర్లు

  • అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం

  • ఆందోళనలో రైతులు..

  • సమస్య పరిష్కరించాలని వేడుకోలు

  • వజ్రపుకొత్తూరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీలోని భూముల్లో సర్వేనెంబర్లు గజిబిజిగా ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పంచాయతీ పరిధిలో ఎం.గడూరు, అనకాపల్లి, డెప్పూరు, కొండపల్లి, సంతోష్‌నగర్‌, సందిపురం గ్రామాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ పంచాయతీలో భూములకు ఎలాంటి సర్వే చేయలేదు. కొన్ని సర్వే నెంబర్లకు అడంగల్‌లు రాలేదు. ఒక సర్వే నెంబర్‌ భూమిలో మరొకరి పేరు ఉంది. భూమి ఆధీనంలో ఉన్నా విస్తీర్ణం తక్కువగా చూపిస్తోంది. ఇలా పలు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని చీపురుపల్లి పంచాయతీలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోతోందని వాపోతున్నారు. కొన్ని భూముల సర్వే నెంబర్లు పూర్వీకుల పేరుపై ఉన్నాయని, వాటిని వారసుల పేర్లకు మార్పు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. దీంతో అన్నదాత సుఖీభవ పఽథకానికి దూరమవుతున్నామని వాపోతున్నారు. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా.. సర్వే నెంబర్లు గజిబిజి వలన భూములను విక్రయించుకోలేకపోతున్నామని పేర్కొంటున్నారు.

  • గతంలో చీపురుపల్లి పంచాయతీ భూముల రిజిస్ర్టేషన్లు ఏడాదిపాటు నిలిచిపోయాయి. దీంతో అత్యవసరమైనా భూములు విక్రయించుకోలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఖర్చులకు డబ్బులు లేక.. పెళ్లిళ్లు సైతం వాయిదా వేసుకున్నారు. దీనిపై గతంలో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురించగా అధికారులు స్పందించి.. భూముల రిజిస్ర్టేషన్‌ కొనసాగించారు. తాజాగా ఈ పంచాయతీ భూముల్లో సర్వే నెంబర్లు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

  • ఇదిలా ఉండగా జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికిగానూ అధికారులు చీపురుపల్లి పంచాయతీ ప్రాంతంలో కూడా భూములను పరిశీలిస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు తుదిరూపం వస్తే భూముల సర్వేనెంబర్లు గజిబిజి వలన ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూడా తమకు దక్కే అవకాశం ఉండదని కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వే నెంబర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. తమ భూముల్లో సర్వే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

  • చీపురుపల్లి పంచాయతీ భూముల్లో సర్వేనెంబర్ల సమస్యను పరిష్కరించాలని అధికారులు దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. సర్వే నెంబర్లు గజిబిజి వలన ప్రభుత్వ పథకాలు రైతులకు అందడం లేదు. పంచాయతీలో పూర్తిస్థాయి సర్వే చేసి.. సర్వేనెంబర్లలో గందరగోళం తొలగించాలి.

    - సాతుపల్లి కామేశ్వర్రావు, గ్రామకమిటీ ప్రతినిధి, ఎం.గడూరు

  • సమస్యను పరిష్కరిస్తాం

  • ఫిర్యాదులు వచ్చిన భూములకు సంబంధించి రీ సర్వే చేస్తున్నాం. చీపురుపల్లి పంచాయతీలో రీ సర్వే జరగలేదు. చలానా చెల్లించిన భూములకు సచివాలయం సర్వే బృందంతో మండల సర్వే బృందం కలిసి సమస్యకు పరిష్కారం చూపుతున్నాం.

    - కె.తిరుపతిరావు, మండల సర్వేయర్‌, వజ్రపుకొత్తూరు

  • రీ సర్వే చేస్తాం

  • చీపురుపల్లి పంచాయతీల్లో భూములకు త్వరలోనే రీ సర్వే ప్రారంభిస్తాం. ఈ ప్రక్రియలో సర్వే నెంబర్లు సరిచేసే అవకాశం ఉంది. రైతులు సమస్యలను రీ సర్వేలో చెప్పుకోవచ్చు.

    - ప్రసాద్‌, వీఆర్వో, చీపురుపల్లి

Updated Date - Aug 13 , 2025 | 11:47 PM