బార్‌ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:28 AM
జిల్లాలో 17 బార్‌ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 17 బార్‌ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘2025-28 నూతన బార్ పాలసీ విధానంలో అనేక సంస్కరణలు చేశాం. శ్రీకాకుళం నగరంలో 11, పలాస కాశీబుగ్గలో 2, ఆమదాలవ లసలో 2, ఇచ్ఛాపురంలో 2 బార్లకు సంబంధించి ఈ నెల 26 సాయంత్రం వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 28న సాయంత్రం శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో లాటరీ తీసి బార్లను కేటాయిస్తాం. ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా, ఎన్ని దరఖాస్తులైనా సమర్పించుకోవచ్చు. ఒక బారుకు కనీసం నాలుగు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో బార్ లైసెన్స్ రుసుం ఒకే వాయిదాలో ముందుగానే చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఒక బ్యాంకు గ్యారెంటీతో ఆరు సమాన వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాం. లైసెన్స్ పొందిన 15 రోజుల్లోపు బార్లలో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్త పాలసీ విధానం ద్వారా ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంచుకోవచ్చు.’ అని తెలిపారు.