Share News

ఐటీడీఏలో అక్రమాలపై విచారణ

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:02 AM

Investigation against three officers సీతంపేట ఐటీడీఏలో ముగ్గురు అధికారుల అవినీతి, అక్రమాలపై విచారణకు రంగం సిద్ధమైంది. ఐటీడీఏ పరిధిలో జరిగిన అక్రమాలపై దళిత సంఘాల జేఏసీ ఫిర్యాదు మేరకు ఈ నెల 26న విచారణ చేపట్టాలని గిరిజన సంక్షేమ డైరెక్టర్‌ ఆదేశించారు.

ఐటీడీఏలో అక్రమాలపై విచారణ

  • అవకతవకలపై విజిలెన్స్‌కు దళితసంఘాల ఫిర్యాదు

  • రేపు ముగ్గురు అధికారులపై దర్యాప్తు

  • గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఆదేశం

  • టెక్కలి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏలో ముగ్గురు అధికారుల అవినీతి, అక్రమాలపై విచారణకు రంగం సిద్ధమైంది. ఐటీడీఏ పరిధిలో జరిగిన అక్రమాలపై దళిత సంఘాల జేఏసీ ఫిర్యాదు మేరకు ఈ నెల 26న విచారణ చేపట్టాలని గిరిజన సంక్షేమ డైరెక్టర్‌ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ట్రైకార్‌ ఎండీ సీఏ మణికుమార్‌ను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ పరిధిలోని సీఆర్టీల రెగ్యులైజేషన్‌లో అవకతవకలు జరిగాయి. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని బ్రేక్‌ సర్వీస్‌ ఉన్న వారికి కూడా రెగ్యులరైజ్‌ చేశారు.

  • జువైనెల్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా అక్రమ బదిలీలు, డిప్యుటేషన్లు చేపట్టారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన బదిలీల్లో అధికారులకు అనుకూలంగా ఉన్నవారికి కోరుకున్నచోట స్థానాలు ఇచ్చారు. టెక్కలి ఆశ్రమ పాఠశాలలో సీనియర్‌ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడికి స్థానం ఇవ్వకుండా, 64వ స్థానంలో ఉన్నవారికి అవకాశం ఇచ్చారు. బాలికల పాఠశాలలకు పురుష టీచర్లను నియమించారు. బదిలీల తర్వాత అనేకమందికి అక్రమ డిప్యుటేషన్లు కూడా వేశారు. బందపల్లి బాలికల పాఠశాల నుంచి మహిళా టీచర్‌ను టెక్కలి బాయ్స్‌ స్కూల్‌కి, టెక్కలిలో ఉన్న ఉపాధ్యాయుడిని బందపల్లి గర్ల్స్‌ స్కూల్‌కి డిప్యుటేషన్‌ వేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా మెళియాపుట్టి ఏటీడబ్లూవోను, స్కూల్‌ అసిస్టెంట్లను, డిప్యూటీ వార్డెన్లను నియమించారు.

  • గత ప్రాజెక్ట్‌ అధికారి కాలంలో టెండర్లు లేకుండా మెస్‌లు, గ్యాస్‌స్టౌవ్‌లు తదితర సామగ్రి కొనుగోలు చేశారు. పాఠశాలల్లో మెస్‌లు బిగించడానికి ప్రధానోపాధ్యాయులకు వేలాది రూపాయలు ఖర్చయ్యాయి. వాటిని ఐటీడీఏ అధికారులు ఇవ్వలేదు. నిధులు దుర్వినియోగం చేశారని దళిత సంఘాల జేఏసీ సభ్యులు ఆరోపించారు. వీటిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇటీవల విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

  • ఈ మేరకు ఐటీడీఏలోని ఏపీవో జి.చిన్నబాబు, డిప్యూటీ డైరెక్టర్‌ అన్నదొర, సూపరింటెండెంట్‌ కె.దేస్‌పై ఉన్నతాధికారులు బుధవారం విచారణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఫైళ్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బుధవారం ఉదయం 11గంటలకు దర్యాప్తు జరుగుతుందని ఐటీడీఏ పీవో స్వప్నిల్‌ పవార్‌ జగన్నాథ్‌ తెలిపారు.

Updated Date - Nov 25 , 2025 | 12:02 AM