Share News

మరింత లోతుగా దర్యాప్తు

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:31 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో నరసన్నపేట సామాజిక ఆస్పత్రిలోని సదరంలో సకలాంగులకు దివ్యాంగులుగా పత్రాలు జారీ చేసిన కేసుపై స్థానిక పోలీసులు మమ్మురంగా దర్యాప్తు చేస్తున్నారు.

మరింత లోతుగా దర్యాప్తు
వైద్యఆరోగ్యశాఖ అధికారులను విచారణ చేస్తున్న సీఐ శ్రీనివాసరావు

  • సదరంలో అనర్హులకు ధ్రువపత్రాలు జారీపై పోలీసుల ఆరా

  • వైద్యులపై చట్టపరమైన చర్యలకు సిద్ధం

నరసన్నపేట, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో నరసన్నపేట సామాజిక ఆస్పత్రిలోని సదరంలో సకలాంగులకు దివ్యాంగులుగా పత్రాలు జారీ చేసిన కేసుపై స్థానిక పోలీసులు మమ్మురంగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పనిచేసిన డీసీహెచ్‌ రాజ్యలక్ష్మీ, ఆస్పత్రి సిబ్బందిని నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు సోమవారం విచారణ చేపట్టారు. అప్పట్లో నరసన్నపేట సామాజిక ఆసుపత్రిలో పొందూరు, ఆమదాలవలస, కోటబొమ్మాళి, నరసన్నపేట, జలుమూరు మండలాలకు చెందిన పలువురు సకలాంగులకు దివ్యాంగులుగా ధ్రువీకరణ పత్రాలు జారీచేశారు. ఆ పత్రాలు ద్వారా చాలామంది పింఛన్లు, ఇతర సౌకర్యాలతో లబ్ధి పొందారు. కొన్నాళ్ల తర్వాత ఈ వ్యవహారం బయటపడడంతో అప్పటి కలెక్టర్‌ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు డీసీహెచ్‌ రాజ్యలక్ష్మీ విచారణ చేపట్టి.. అనర్హులకు దివ్యాంగులుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్టు వాస్తవమేనని గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడు నెలలు కిందట వైద్యవిధాన పరిషత్‌ అధికారులు సంబంధిత వైద్యులు, సూపరెంటెండెంట్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేసి శాఖాపరంగా దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో వైద్యులు, సిబ్బంది పాత్రపై తాజాగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 12:31 AM