Share News

తల్లిదండ్రులతో ఆత్మీయంగా!

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:13 AM

Mega Parents Teachers Meeting today ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించనున్నారు.

తల్లిదండ్రులతో ఆత్మీయంగా!
శాసనాం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల

నేడు మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌

పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహణకు ఏర్పాట్లు

ఇచ్ఛాపురం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 2014, ప్రాథమికోన్నత 148, ఉన్నత పాఠశాలలు 450 ఉన్నాయి. వీటిలో 1,63,115 మంది చదువుతున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సుమారు 39 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు స్వాగతోపాన్యాసంతో కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకూ కొనసాగుతుంది. విద్యార్థి ఎలా చదువుతున్నారు? మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు బోధనలో ఎటువంటి మార్పులు చేయాలి?.. ఇలా వివిధ అంశాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారి అభిప్రాయాలను పంచుకుంటారు. పరీక్షల్లో సాధిస్తున్న మార్కులు, ఆరోగ్య సమాచారంతో కూడిన ప్రొగ్రెస్‌ రిపోర్టు కూడా అందిస్తారు. పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ తీరును సైతం చర్చిస్తారు. సబ్జెక్టుల వారీగా ప్రమాణ స్థాయి, వెనుకబడిన వారి విషయంలో తీసుకుంటున్న చర్యలు, దృష్టిపెట్టాల్సిన అంశాల గురించి అందులో వివరిస్తారు.

Updated Date - Dec 05 , 2025 | 12:13 AM