వడ్డీలేని రుణం.. వీధి వ్యాపారులకు వరం
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:57 PM
6,964 traders identified కుటుంబ పోషణ కోసం రోడ్డుపక్కన, వీధుల్లో చిరు వ్యాపారం చేసేవారికి వడ్డీలేని రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చాలా మంది వీధి వ్యాపారులు అధిక వడ్డీకి రుణాలు తెచ్చి పెట్టుబడి పెట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు.
కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో ప్రారంభమైన రుణమేళా
జిల్లాలో 6,964 మంది వ్యాపారుల గుర్తింపు
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): కుటుంబ పోషణ కోసం రోడ్డుపక్కన, వీధుల్లో చిరు వ్యాపారం చేసేవారికి వడ్డీలేని రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చాలా మంది వీధి వ్యాపారులు అధిక వడ్డీకి రుణాలు తెచ్చి పెట్టుబడి పెట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు. వారి కష్టంలో అధికశాతం వడ్డీలు చెల్లించేందుకే సరిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌కళ్యాణ్ మేళా పీఎం స్వనిధి 2.0 పథకం ద్వారా వీధి వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 25 నుంచి జిల్లాలోని శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో ప్రత్యేక రుణమేళాలను నిర్వహిస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారుల పేర్లను నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 6,964 మంది వీధి వ్యాపారులు రిజిస్టర్ అయ్యారు. వీరంతా కార్పొరేషన్, మునిసిపాలిటీ కార్యాలయాల్లో వడ్డీ లేని రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. దాదాపు అందరికీ రుణాలు మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
గతంలో రుణాలు తీసుకుని చెల్లించిన వారికి మరింత అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు రుణ పరిమితిని పెంచారు. గతంలో రూ.10వేలు తీసుకున్న వారికి రూ.50వేల వరకు రుణం ఇవ్వనున్నారు. అలాగే ప్రాథమిక రుణం గతంలో రూ.10వేలు ఉండేది. దీనిని ఇప్పుడు రూ.15వేలకు పెంచారు. మునిసిపాలిటీల వారీగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాల్లో మెప్మా అధికారులతోపాటు బ్యాంకు అధికారులు కూడా పాల్గొని రుణాలను మంజూరు చేస్తారు.
గతేడాది కన్నా అధికంగా..
గత ఏడాది జిల్లాలో 2,674 మంది వీధి వ్యాపారులకు రూ.6,26,90,000 రుణాలను అందజేశారు. అనంతరం మునిసిపాలిటీల్లో వీధి వ్యాపారులకు మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది అదనంగా మరో 4,290 మంది వీధి వ్యాపారులను రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం మొత్తం 6,964 మంది వీధి వ్యాపారులు ఉండగా.. సుమారు రూ.16కోట్లకుపైగా రుణాలను పంపిణీ చేయనున్నారు.
ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా..
పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా వీధి వ్యాపారులను ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా రుణాలు అందజేస్తున్నాం. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం సర్వే చేపట్టి 4,290 మందిని అదనంగా రిజిస్టర్ చేయించాం. ఈ ఏడాది వారికి సుమారు రూ.16కోట్ల రుణాలు అందజేస్తాం. గతంలో తిరస్కరణకు గురైన వారిని కూడా పిలిచి రుణ సదుపాయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.
- ఎస్.వెంకటరావు, మెప్మా పీడీ
జిల్లాలో వీధివ్యాపారులు
------------------------------
శ్రీకాకుళం కార్పొరేషన్ - 2,997
పలాస - 1,902
ఇచ్ఛాపురం - 1,315
ఆమదాలవలస - 750
------------------------------
మొత్తం - 6,964
--------------------------
ఫోటోః జోగారావు 9402 : శ్రీకాకుళంలో వీధి వ్యాపారులు
1111111111111