upadhi: ఉపాధి వేతనదారులకు బీమా
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:33 PM
Insurance scheme ఉపాధి హామీ పథకం వేతనదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వం ఉపాధిహామీ వేతనదారులను వైఎస్‌ఆర్ బీమాలో చేర్చాలని ప్రయత్నించినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. వేతనదారులు ప్రమాదాలకు గురైనా, పనిచేసే చోట ప్రాణాలు కోల్పోయినా పెద్దగా ఆర్థికసాయం అందలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి వేతనదారులందరికీ బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.
పీఎం సురక్ష, రాష్ట్రీయ స్వస్థ యోజనకు శ్రీకారం
తక్కువ ప్రీమియంతో అధిక లబ్ధికి కృషి
మెళియాపుట్టి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి):
గత ఏడాది మెళియాపుట్టి మండలం గొప్పిలి గ్రామానికి చెందిన పొందర పార్వతి ఉపాధి పనులు చేస్తూ కుప్పకూలి మృతి చెందింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉపాధి వేతనదారులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో పార్వతి కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. కేంద్ర ప్రభుత్వం రూ.50వేలు మాత్రమే ఇచ్చింది. అదే ఇప్పుడు జరిగి ఉంటే ఆ కుటుంబానికి రూ.2 లక్షల వరకు బీమా వచ్చేది.
.....................
ఈ నెల 8న మెళియాపుట్టి మండలం పట్టుపురం గ్రామానికి చెందిన తులసమ్మ ఉపాధి పనులు చేస్తూ పడిపోవడంతో ఆమె చేయి విరిగిపోయింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతో వైద్యానికి సుమారు రూ.50వేలు ఖర్చయింది. ప్రస్తుతం ప్రభుత్వం బీమా సదుపాయం కల్పించడంతో ఆమెకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది.
.....................
ఈ నెల 11న ఉపాధి పనులు చేస్తున్న నరసన్నపేట మండలం కోమర్తి గ్రామానికి చెందిన పి.తులసమ్మకు పాము కాటేసింది. ఆసుపత్రిలో చేరడంతో సుమారు రూ.30వేలు వరకు వైద్య ఖర్చులయ్యాయి. ఈమెకు బీమా లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. దీంతో ఇబ్బందులు పడుతోంది.
.....................
ఈ నెల 22న మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన రాజపు గున్నమ్మ ఉపాధి పనులకు వెళ్లి మట్టి మోస్తుండగా పడిపోవడంతో చేయి విరిగిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఉపాధి వేతనదారులకు ప్రభుత్వం బీమా వర్తింపు చేస్తుండడంతో గున్నమ్మకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది.
..............
ఉపాధి హామీ పథకం వేతనదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వం ఉపాధిహామీ వేతనదారులను వైఎస్‌ఆర్ బీమాలో చేర్చాలని ప్రయత్నించినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. వేతనదారులు ప్రమాదాలకు గురైనా, పనిచేసే చోట ప్రాణాలు కోల్పోయినా పెద్దగా ఆర్థికసాయం అందలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి వేతనదారులందరికీ బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. తక్కువ ప్రీమియంతో వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతోంది. పీఎం సురక్ష, రాష్ట్రీయ స్వస్థ యోజనను వర్తింజేసేందుకు శ్రీకారం చుట్టింది. పీఎం సురక్ష బీమాలో చేరిన వేతనదారులు మృతిచెందితే రూ.2లక్షలు, రాష్ట్రీయ స్వస్థ యోజన అయితే రూ.4లక్షల బీమా అందనుంది.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో ఈ ఏడాది 4,78,724 జాబ్‌కార్డులు మంజూరు చేయగా 1,76,88,000 పని దినాలు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అధికంగా మహిళలు 3,07,582 మంది పనికి వస్తున్నారు. ఉపాధి వేతనదారుల్లో ఎక్కువమంది పేదలు కావడంతో వారు ప్రైవేట్ సంస్థల్లో బీమా చేయలేని పరిస్థితి. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వేతనదారులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నారు. వేతనదారులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, సాధారణగా మృతి చెందినా ప్రధానమంత్రి సురక్ష యోజన, రాష్ట్రీయ స్వస్థ యోజన ద్వారా బీమా వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. మే ఒకటో తేదీ నాటికి జిల్లాలో ఉన్న శ్రామికుల నుంచి బీమా దరఖాస్తులు తీసుకోవాలని కమిషనర్ కృష్ణతేజకు ఆదేశించారు. ఈ దరఖాస్తులను బ్యాంకులకు అందించి బీమా నమోదు చేయించాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతలను ఫీల్డ్‌అసిస్టెంట్లకు అప్పగించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఏడాదికి రూ.20ప్రీమియం చెల్లిస్తే చాలు ఆ వ్యక్తి ప్రమాదంలో చనిపోయినప్పుడు రూ.2 లక్షల బీమా వర్తిస్తుంది. రాష్ట్రీయ స్వస్థ యోజన కింద రూ.450 ప్రీమియం చెల్లిస్తే ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందినా, సాధారణంగా మృతి చెందినా రూ.4లక్షల వరకు బీమా అందుతుంది.
ఎంతో మేలు
ప్రభుత్వం తీసుకువచ్చిన బీమాతో మాలాంటి పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇంతవరకు నాకు బీమా లేదు. ఈ ఏడాది బీమా సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నాను.
- రాములు, ఉపాధి వేతనదారుడు, పెద్దపద్మాపురం, మెళియాపుట్టి
...................
ఉపయోగపడుతుంది
ఉపాధి వేతనదారులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, సాధారణంగా మృతి చెందినా రూ.4లక్షల వరకు బీమా వర్తింపజేయడం ఆనందంగా ఉంది. మాలాంటి పేదలకు తక్కువ ప్రీమియంలో వర్తింపజేస్తున్న ఈ బీమా ఎంతో ఉపయోగపడుతుంది.
- పి.రామారావు, ఉపాధి వేతనదారుడు, పెద్దపద్మాపురం, మెళియాపుట్టి
..................
సంతోషంగా ఉంది
ప్రైవేట్ సంస్థలో బీమా పొందాలంటే అధిక మొత్తం ప్రీమియం చెల్లించాలి. ప్రతి ఏడాది రూ.2వేలకు తక్కువ లేకుండా కడితే రూ.4లక్షల బీమా వస్తుంది. ప్రభుత్వం మాలాంటి పేదలు ఏడాదికి రూ.450 ప్రీమియం చెల్లిస్తే రూ.4లక్షల వరకు ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది.
- ధనలక్ష్మి, ఉపాధి వేతనదారురాలు, పెద్దపద్మాపురం, మెళియాపుట్టి
.............
దరఖాస్తులు తీసుకుంటున్నాం
ఇంతవరకు బీమా లేని వారిని గుర్తించి వారి నుంచి దరఖాస్తులను తీసుకుంటున్నాం. రూ.20, రూ450 రెండు రకాల ప్రీమియంలు ఉన్నాయి. శ్రామికులు ఏది కావాలో నిర్ణయం తీసుకోవాలి. దరఖాస్తులు బ్యాంకుకు అందజేస్తే వేతనాల సమయంలో ఆటోమేటిక్‌గా వారి ఖాతా నుంచి ప్రీమియం డబ్బులు కట్ అవుతాయి. దీనిని అందరూ వినియోగించుకోవాలి.
- టి.రవి, ఏపీవో, మెళియాపుట్టి