రవాణాశాఖ అధికారులు.. కళ్లు తెరిచారు
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:23 AM
private buses Inspections ఇన్నాళ్లూ స్తబ్దత పాటించిన రవాణాశాఖ అధికారులు.. ఎట్టకేలకు కళ్లు తెరిచారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో ఇష్టానుసారంగా దందాలు జరుగుతున్నా.. ఏనాడూ అధికారులు కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాగా.. కర్నూలు సమీపంలో గురువారం అర్ధరాత్రి దాటాక ఓ ప్రైవేటు బస్సు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో రవాణాశాఖ అధికారులు శనివారం జిల్లాలో ప్రైవేటు బస్సులను తనిఖీలు చేశారు. కానీ ఏ ఒక్కరిపైనా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
ఇన్నాళ్లూ స్తబ్దతగా.. కర్నూలు ఘటనతో తనిఖీలు
ప్రైవేటు ట్రావెల్స్‌లో ఇష్టానుసారంగా పార్శిల్స్ రవాణా
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం
ఉన్నతస్థాయిలో దృష్టి సారిస్తేనే ఫలితం
శ్రీకాకుళం, అక్టోబర్ 25(ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ స్తబ్దత పాటించిన రవాణాశాఖ అధికారులు.. ఎట్టకేలకు కళ్లు తెరిచారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో ఇష్టానుసారంగా దందాలు జరుగుతున్నా.. ఏనాడూ అధికారులు కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాగా.. కర్నూలు సమీపంలో గురువారం అర్ధరాత్రి దాటాక ఓ ప్రైవేటు బస్సు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో రవాణాశాఖ అధికారులు శనివారం జిల్లాలో ప్రైవేటు బస్సులను తనిఖీలు చేశారు. కానీ ఏ ఒక్కరిపైనా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
ఇష్టానుసారంగా పార్శిల్స్ తరలింపు
జిల్లాలోని శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, పాతపట్నం, కొత్తూరు, నరసన్నపేట తదితర ప్రాంతాల నుంచి ప్రైవేటు ట్రావెల్స్ ఆధ్వర్యంలో బస్సులు నడుపుతున్నారు. ప్రతిరోజూ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, అమలాపురం వంటి ప్రాంతాలకు ఈ బస్సుల్లో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పాతపట్నం నుంచి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి బస్సులు వెళ్తుంటాయి. శ్రీకాకుళంలో బలగ నుంచి సుమారు 80 నుంచి 100 వరకు బస్సు సర్వీసులు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్నాయి. చాలా బస్సులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రయాణికుల వస్తువులు మినహా.. ప్రయాణంతో సంబంధంలేని పెద్దపెద్ద మూటలు.. ఇతరత్రా పార్శిల్స్ తరలించకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రైవేటు ట్రావెల్స్ పార్శిల్ సైతం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. శ్రీకాకుళంలో ట్రావెల్స్ కార్యాలయాలు.. అన్నీ పార్శిల్స్‌ను స్వీకరిస్తున్నాయి. ఎలక్ర్టికల్ వస్తువులు, లారీ సామగ్రి, ఫర్నీచర్‌తోపాటు.. ఇనుప వస్తువులను సైతం ట్రావెల్స్ బస్సుల్లో రవాణా చేస్తున్నాయి. రకరకాల అట్టపెట్టెలు, బస్తాల్లో ఈ సామగ్రిని ప్యాకింగ్ చేసి దూరప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే.. బస్సుల్లో ప్రయాణికులకు ఇబ్బందికరంగాను.. ప్రాణాలపైకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కర్నూలు బస్సు ఘటనలో ఒక్కసారిగా ఫోన్లు కూడా పేలిపోయాయి. అన్ని ఫోన్లు ఎక్కడ నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. జిల్లాలో పార్శిల్స్ తరలింపు ప్రక్రియను ఇంతవరకూ అధికారులు అడ్డుకున్న దాఖలాలు లేవు. తెరవెనుక అధికారుల సహకారంతోనే ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికులతోపాటు పెద్దమొత్తంలో పార్శిల్స్ తరలింపు జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
తనిఖీలు ముమ్మరం.. కేసులు లేవాయె..
శనివారం జిల్లాలో పలు ప్రైవేటు బస్సులను రవాణాశాఖ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో అన్ని డాక్యుమెంట్స్ సరిపోయాయా.. బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు, ఎమర్జెన్సీ డోర్.. ఫిట్‌నెస్ ఉన్నాయో లేవో అని పరిశీలించారు. టెక్కలిలో ఎంవీఐ డి.సంజీవరావు నేతృత్వంలో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలను నిలుపుదల చేసి ఎమర్జెన్సీ డోరు, అలారం సౌకర్యం, గ్లాసులు బ్రేక్ చేసేందుకు అవసరమైన హేమర్ వంటి సామగ్రి, డ్రైవర్ లైసెన్స్‌లు, వాహన ఫిట్‌నెస్ ధ్రువపత్రాలు పరిశీలించారు. ఎమర్జెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రాత్రి ఏడు గంటల సమయానికి 15 బస్సులను తనిఖీ చేసినట్లు సమాచారం. అయితే ఏ ఒక్కదానిపైనా కేసులు నమోదు కాలేదు. అంటే సర్వం సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించినట్లే. పార్శిల్ సర్వీసులు.. భారీ బరువులతో ప్రైవేటు బస్సులలో తరలిస్తే.. అనుకోని విధంగా ప్రమాదం సంభవిస్తే దూరం ప్రయాణిస్తున్న వారి గతేమవుతుందో అన్నది అధికారులు ఇప్పటికైనా ఆలోచిస్తే బాగుండేది. ప్రైవేటు బస్సుల్లో ఈ తరహా దందాను అరికట్టాల్సి ఉంది. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేటు బస్సులో సరుకుల రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నిబంధనలు పాటించనివాటిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ప్రయాణికుల బస్సుల్లో పార్శిల్స్ సర్వీసు కుదరదు
ప్రయాణికులతో వెళ్లే బస్సుల్లో పార్శిల్స్ పేరిట సరుకుల రవాణా చేయకూడదు. ఇవన్నీ తనిఖీ చేస్తున్నాం. శనివారం జిల్లా వ్యాప్తంగా 15 వాహనాలను తనిఖీ చేశాం. ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి కేసులు నమోదు కాలేదు.
- విజయసారధి, డీటీసీ, శ్రీకాకుళం