తూనికలు, కొలతలు అధికారుల తనిఖీ
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:18 AM
నరసన్నపేట పట్టణంలో పలు రైస్, కిరాణా దుకాణాలపై తూనికల కొలతలు శాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు.
నరసన్నపేట, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో పలు రైస్, కిరాణా దుకాణాలపై తూనికల కొలతలు శాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఈనెల 26న ‘కల్తీ.. తూకంలో దగా’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురి తమైన కథనం పై ఆ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ చిన్నమ్మి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రైస్ దుకాణాలు, కిరాణా షాపుల్లో బియ్యం బస్తాలను పరిశీలించారు. బ్రాండెడ్ కంపెనీల బియ్యం మినహా మిగతా కంపెనీల పేరుతో ఉన్న ప్యాకెట్లు 25 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. బస్తాపై మాత్రం 26 కిలోల ముద్ర ఉండగా.. తూకం వేయగా 25 కిలోలు ఉన్నట్టు గుర్తించడంతో వ్యాపారిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు వ్యాపారులు తమ దుకాణాలను మూ సివేశారు. ఈ దాడుల్లో ఆ శాఖ సీఐ ఎ.బాలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.