‘అదనం’ ధాన్యంపై ఆరా
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:19 AM
Inquiry into difficulties in purchasing grain ధాన్యం కొనుగోలులో అదనం పేరిట రైతులను ఇబ్బందులు పెడుతున్న వ్యవహారంపై సీఎంవో కార్యాలయం అధికారులు దృష్టి సారించారు. నరసన్నపేట మండలం కంబకాయి గ్రామానికి తంగి రవీంద్ర, సి.రాజారావు అనే రైతులు పంపించే ధాన్యాన్ని దేశవానిపేటలోని బాలాజీ రైస్ మిల్లర్ దించకుండా.. వారికి అదనంగా ఆరు కేజీల ధాన్యం లేదా నగదు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
సీఎంవో కార్యాలయ ఆదేశాలతో కంబకాయిలో నాణ్యత పరిశీలన
రైతుల వద్ద వివరాలు సేకరణ
జేసీకి నివేదిక
నరసన్నపేట, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలులో అదనం పేరిట రైతులను ఇబ్బందులు పెడుతున్న వ్యవహారంపై సీఎంవో కార్యాలయం అధికారులు దృష్టి సారించారు. నరసన్నపేట మండలం కంబకాయి గ్రామానికి తంగి రవీంద్ర, సి.రాజారావు అనే రైతులు పంపించే ధాన్యాన్ని దేశవానిపేటలోని బాలాజీ రైస్ మిల్లర్ దించకుండా.. వారికి అదనంగా ఆరు కేజీల ధాన్యం లేదా నగదు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం పత్రికల్లో కథనాలు రావడంతో సీఎంవో కార్యాలయ అధికారులు స్పందించి జిల్లా సివిల్‌సప్లయ్‌శాఖ అధికారులకు ఆరా తీశారు. దీంతో సివిల్‌సప్లయ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ అధికారి హరిశంకర్ ఆధ్వర్యంలో పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖ అధికారులు గురువారం కంబకాయిలో సుమారు 40 మంది రైతులతో మాట్లాడారు. మండలంలో కొందరు మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహారించి అదనంగా ధాన్యం వసూళ్లు చేస్తున్నారని రైతులు తెలిపారు. బాలజీ రైస్ మిల్లర్ వ్యవహారించిన తీరుపై రైతులు తంగి రవీంద్ర, సి.రాజారావు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం గ్రామంలో రైతులు పండించే ధాన్యం నాణ్యత, బియ్యం దిగుబడులను ఈలింగ్ యంత్రాల సహాయంతో పరిశీలించారు. దిగుబడి నాణ్యత బాగానే ఉన్నట్లు క్వాలిటీ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఈలింగ్ యంత్రాల్లో 20 పాయింట్లు వద్ద ఫిక్స్ చేసి ధాన్యం మరపెట్టి బియ్యం దిగుబడి అంచనా వేయాల్సి ఉండగా, కొందరు మిల్లర్లు మాత్రం 30 పాయింట్లు ఫిక్స్ చేసి ఈలింగ్ చేయడంతో ఈ సమస్య వచ్చిందని పేర్కొన్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారుల నివేదికను జాయింట్ కలెక్టర్‌కు అందజేయనున్నట్లు జిల్లా సివిల్‌సప్లయ్‌శాఖ డీఎం వేణుగోపాలరావు తెలిపారు. అంతకుముందు శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష కూడా సంబంధిత మిల్లును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.సత్యనారాయణ, సీఎస్‌డీటీ రామకృష్ణ పాల్గొన్నారు.