బోధనలో కొత్తదనం
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:56 PM
విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఉపాధ్యాయులకు కరదీపిక (టీచర్ హ్యాండ్ బుక్స్)లను అందిస్తుంది.
- ఉపాధ్యాయులకు కరదీపికలు పంపిణీ
- విద్యాప్రమాణాల పెంపునకు ప్రభుత్వం కృషి
- సింగిల్ టీచర్లపై పెరిగిన భారం
నరసన్నపేట, జూలై 30 (ఆంధ్రజ్యోతి): విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఉపాధ్యాయులకు కరదీపిక (టీచర్ హ్యాండ్ బుక్స్)లను అందిస్తుంది. ఎస్‌సీఈఆర్టీ సహకారంతో సమగ్రశిక్ష ద్వారా సామర్థ్య ఆధారిత బోధన, అభ్యాసన ఉపాధ్యాయ వనరుల పేరుతో వీటిని రూపొందించింది. బోధనలో కొత్తదనాన్ని ప్రోత్సహించేలా, విద్యాప్రమాణాలు పెంచేలా ఇవి రూపుదిద్దుకున్నాయి. జిల్లాలోని అన్ని పాఠశాలలకు కరదీపికలను అధికారులు పంపిణీ చేశారు.
అకడమిక్ క్యాలెండర్‌తో అనుసంధానం..
కరదీపికలను అకడమిక్ క్యాలెండర్‌లోని పనిదినాలతో విద్యాశాఖ అధికారులు అనుసంధానం చేశారు. ఏ రోజు.. ఏ పాఠం, ఏ అంశం ఎలా చెప్పాలో తేదీలతో సహా అందులో పొందుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకే రోజు ఒకే పాఠం బోధనలో ఉంటుంది. పాఠం పూర్తయిన తరువాత ప్రతి పీరియడ్‌లో బోధనా సమయం, ఉపయోగించిన టీఎల్‌ఎం, అభ్యసన కృత్యాలు, రిమార్కులను ఉపాధ్యాయులు కరదీపికలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆయా తరగతుల్లో సబ్జెక్టుకు సంబంధించిన ఓ పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకాలను తొలుత ఉపాధ్యాయులు క్షుణ్నంగా చదవాల్సి ఉంటుంది. దీని ద్వారా పిల్లలకు సులభతరంగా బోధన అందించేందుకు నోట్స్, ప్రశ్న పత్రాలను తయారు చేసుకునేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.
ఏకోపాధ్యాయులపై భారం
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఏకోపాధ్యా యులపై కరదీపికలు మరింత భారం కానున్నాయి. ఐదు తరగతులకుమొత్తం 18 కరదీపికలను అధికారులు పంపిణీ చేశారు. అయితే, కరదీపికలో సూచించిన మాడ్యూల్ విధానంలో ఒకే రోజు ఐదు తరగతులకు బోధించడం తమవల్ల సాధ్యంకాదని ఏకోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన తరువాత విద్యార్థుల హాజరు, ఎండీఎం భోజనాల ఫొటోలను యాప్‌ల్లో అప్‌లోడ్ చేయాలని, ఎమ్మార్సీ నుంచి వచ్చే మార్గదర్శకాలను పాటించాలని, మరోక వైపు బోధన చేపట్టాల్సి ఉంటుందని వారు అంటున్నారు. ఇప్పుడు కరదీపికలో సూచించిన మాడ్యూల్ విధానంలో బోధన అంటే తమపై మరింత భారం పడుతుందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 800 పైగా సింగిల్ ఉపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.