Drainage issue: ఏటా ముంపే
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:45 PM
Flood threat Silt accumulation వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇచ్ఛాపురం మండలంలోని పదుల సంఖ్యలో గ్రామాల రైతులు ముంపు భయంతో వణికిపోతారు. వర్షాల సమయంలో భీమసముద్రం గెడ్డ పొంగి పొలాల మీద వరద నీరు ప్రవహిస్తుంది. కొన్నేళ్లుగా నిర్వహణ లేక గెడ్డలో పూడిక, చెత్త పేరుకుపోయింది. ఫలితంగా ఏటా వర్షాకాలంలో ముంపు సమస్య ఏర్పడి.. వరి పంటకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భీమసముద్రం గెడ్డతో తప్పని ముప్పు
అస్తవ్యస్తంగా కాలువలు
పేరుకుపోయిన పూడికలు
పొలాల్లో నీరు నిలిచి రైతులకు ఇబ్బందులు
ఇచ్ఛాపురం, జూలై 24(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇచ్ఛాపురం మండలంలోని పదుల సంఖ్యలో గ్రామాల రైతులు ముంపు భయంతో వణికిపోతారు. వర్షాల సమయంలో భీమసముద్రం గెడ్డ పొంగి పొలాల మీద వరద నీరు ప్రవహిస్తుంది. కొన్నేళ్లుగా నిర్వహణ లేక గెడ్డలో పూడిక, చెత్త పేరుకుపోయింది. ఫలితంగా ఏటా వర్షాకాలంలో ముంపు సమస్య ఏర్పడి.. వరి పంటకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమసముద్రం గెడ్డ... ఒడిశా రాష్ట్రం కొండల నుంచి ఇచ్ఛాపురం మండలంలోని ముచ్చింద్ర, కేదారిపురం, బెన్నుగానిపేట, బాలకృష్ణాపురం, మునిభద్ర, మండపల్లి, రత్తకన్న గ్రామాల మీదుగా ప్రవహిస్తోంది. ఆపై బాహుదా నదిలో కలిసి సముద్రంలో చేరుతుంది. వర్షాకాలంలో ఒడిశా కొండపై నీరు, పై ప్రాంతాల్లో నీరు కలిసి ఈ గెడ్డలో ప్రవహిస్తుంది. కానీ గెడ్డ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నీటి ప్రవాహ గమనం మారుతోంది. పొలాలపై సాగునీరు ప్రవహించి పంటకు నష్టం వాటిల్లుతోంది. ఇచ్ఛాపురం మండలంలోని ఆ ఏడుగ్రామాల్లో దాదాపు 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గెడ్డలో సాధారణ స్థాయిలో నీటి ప్రవాహం ఉంటే ఫర్వాలేదు. కానీ వర్షాకాలం, వరదల సమయంలో మాత్రం పొలాల్లో నీరు చేరి వరి పంట ముంపునకు గురవుతోంది.
కాలువలు సరిగ్గా లేక..
గెడ్డ పరీవాహక ప్రాంతాల్లో చెరువులకు వెళ్లే కాలువలు సరిగ్గా లేవు. కేదారిపురం నుంచి రత్తకన్న వరకూ దాదాపు 12 చెరువులు ఉంటాయి. ఈ కాలువలను బాగుచేస్తే భీమసముద్రం గెడ్డ ద్వారా వచ్చేనీటిని చెరువులకు మళ్లించవచ్చు. ఖరీఫ్‌లో సాగునీటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. తేలుకుంచి, రత్తకన్న, మండపల్లి గ్రామాల్లో పొలాలను ముంపుబారి నుంచి తప్పించవచ్చు. అలాగే బాలకృష్ణాపుం, మునిభద్ర, డెప్పూరు తదితర గ్రామాల్లో భూగర్భజలాలను పెంపొందించవచ్చు. ఏటా ఈ గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటుంది. అదే సమయంలో ఖరీఫ్‌లో సాగునీటికి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో భీమసముద్రం గెడ్డ విషయమై స్థానిక ఎమ్మెల్యే, విప్ బెందాళం అశోక్ చొరవచూపాలని రైతులు కోరుతున్నారు. ముంపు సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏటా అవే ఇబ్బందులు
ఏటా భీమసముద్రం గెడ్డతో మాకు ఇబ్బందులు తప్పవు. గెడ్డ నిర్వహణ లేక పూర్తిగా పాడైంది. అందుకే నీటి ప్రవాహం సరిగ్గా ఉండదు. వర్షాల సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు పొలాలపై పడి.. వందలాది ఎకరాలను ముంచేస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలి.
- బుగత జగన్, రైతు, రత్తకన్న
అధికారులకు విన్నవించినా..
గెడ్డ ఉందన్న మాటే కానీ.. నీరు మాత్రం పొలాల మీదుగా పారుతోంది. గతంలో చాలాసార్లు అధికారులకు విన్నవించాం. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. గెడ్డను ఆధునికీకరించాలి. గెడ్డలో ఉన్న పూడికను తొలగించాలి.
- లోహిదాస్, రైతు, బాలకృష్ణాపురం
ప్రతిపాదనలు పంపించాం
భీమసముద్రం గెడ్డ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వానికి సుమారు రూ.10లక్షలతో ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదలైన వెంటనే పనులు చేయిస్తాం. ఖరీఫ్‌లో సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తాం.
- మధుసూదన పాణిగ్రహి, ఇరిగేషన్ ఏఈ, ఇచ్ఛాపురం