independence celebrations: స్వాతంత్య్ర, వజ్రోత్సవ సంబరం
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:01 AM
Glorious celebrations of the 15th of August ఓ వైపు స్వాతంత్య్ర వేడుకలు.. మరోవైపు జిల్లా ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలతో అంతటా సందడి నెలకొంది. జిల్లావాసుల్లో దేశభక్తి ఉప్పొంగింది. శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవం, జిల్లా వజ్రోత్సవ కార్యక్రమాలు అంబరాన్ని తాకాయి.
వైభవంగా పంద్రాగస్టు వేడుకలు
ఘనంగా జిల్లా ఆవిర్భావ దినోత్సవం
అంతటా ఉప్పొంగిన దేశభక్తి
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
శ్రీకాకుళం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఓ వైపు స్వాతంత్య్ర వేడుకలు.. మరోవైపు జిల్లా ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలతో అంతటా సందడి నెలకొంది. జిల్లావాసుల్లో దేశభక్తి ఉప్పొంగింది. శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవం, జిల్లా వజ్రోత్సవ కార్యక్రమాలు అంబరాన్ని తాకాయి. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. అలాగే శ్రీకాకుళం వజ్రోత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. జిల్లా ప్రజలందరికీ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి అచ్చెన్నాయుడు
‘పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఈ దిశగా ప్రజానీకానికి ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నాం. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామ’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘జిల్లాలో అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. 75 ఏళ్ల శ్రీకాకుళం జిల్లా ప్రస్థానం ఎంతో గొప్పది. సూపర్ సిక్స్ అమలులో భాగంగా జిల్లాలో 3,12,550 మందికి పింఛన్లు పెంచాం. పంద్రాగస్టు కానుకగా స్ర్తీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం. మెగా డీఎస్సీ ద్వారా జిల్లాలో 543 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాం. జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాల అభివృద్ధికి రూ.15.55 కోట్లు, పంట రుణాలుగా రూ.2,026 కోట్లను మంజూరు చేశాం. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.186 కోట్లను అందించాం. డీఆర్డీఏ నేతృత్వంలో డ్రోన్ నిర్వహణపై శిక్షణ ఇచ్చి.. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత అందుకునేలా అవకాశం కల్పించాం. ఈ ఏడాది 1650 స్వయంశక్తి సంఘాలకు రూ.91.06 కోట్ల లబ్ధి చేకూర్చాం. గత ఖరీఫ్‌లో 5,29,964 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రూ.1,218 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశాం. మత్స్యకారుల సేవలో పథకం కిందట జిల్లాలో 15,548 మంది మత్స్సకారులకు రూ.20వేల చొప్పున రూ. 31 కోట్లను చెల్లించాం. వన్ ప్రొడక్ట్-వన్ డ్రిస్టిక్ట్‌లో భాగంగా పలాస జీడిపప్పునకు కేంద్రం నుంచి గుర్తింపు దక్కడం ఆనందంగా ఉంది. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తాం. మూలపేట పోర్టు పనులు పూర్తికావచ్చాయ’ని మంత్రి తెలిపారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల విదార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. దేశభక్తి, జాతీయత ఉప్పొంగేలా రూపొందించిన గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి, తదనంతరం భారత సైన్యం సాధించిన విజయాలు, ఉగ్ర ముష్కరులను తుద ముట్టించిన ఉదంతంపై న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు చేపట్టిన ‘సమైక్య భారతం’ నృత్య ప్రదర్శనకు ప్రథమ బహుమతి లభించింది. శ్రీ చైతన్య టెక్నో స్కూలు విద్యార్థులు ప్రదర్శించిన ‘జయతు జయతు భారతం’ నృత్యానికి ద్వితీయ, గార కేజీబీవీ విద్యార్థినులు ప్రదర్శించిన ‘దేశం మనదే’ నృత్య గీతానికి తృతీయ బహుమతి లభించింది. వీరికి మంత్రి అచ్చెన్నాయుడు బహుమతి అందించి అభినందించారు. ఆర్‌సీఎం లయోలా విద్యార్థులు ప్రదర్శించిన ‘దేశ్ హమారా’, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కళారూపం ‘నారీ శక్తి’, గిరిజన విద్యార్థుల థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అరసవల్లికి చెందిన బాల సదనం చిన్నారులు యోగాపై చేసిన నృత్య ప్రదర్శనకు ఆహూతులు చప్పట్లతో అభినందించారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని చాటుతూ..
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చాటేలా వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. పౌరసరఫరాలు, విద్యా, వ్యవసాయ, డీఆర్డీఏ, జలవనరులు, వైద్యారోగ్యం, ఆర్‌డబ్లూఎస్, మున్సిపాలిటీ, పోలీసు, అగ్నిమాపక శాఖల శకటాలతో ఆయా శాఖలు అమలు చేస్తున్న పథకాలను ప్రదర్శించారు. వీటిలో విద్యాశాఖ శకటానికి ప్రథమ, వ్యవసాయ శాఖకు ద్వితీయ, వైద్యారోగ్య, గ్రామీణ నీటి సరఫరా శాఖ శకటాలు సంయుక్తంగాతృతీయ బహుమతులు పొందాయి.
స్టాల్స్ పరిశీలన
డీఆర్డీఏ, ఐటీడీఏ, బీసీ కార్పొరేషన్, ఐసీడీఎస్, విద్యాశాఖ, మత్స్యశాఖ, వ్యవసాయ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు 13 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. వీటిని మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. సుమారు రూ.4.35కోట్లు విలువైన వ్యవసాయ పనిముట్లు, డ్రోన్లు, స్ర్పింక్లర్లు, డ్రిప్ పరికరాలు, ఇతర పనిముట్లు, పరికరాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు.. 1400 మందికి పంపిణీ చేశారు. 20 గ్రూపులకు రూ.1.6కోట్లు విలువ చేసే డ్రోన్లను అందజేశారు. డీఆర్డీఏ ద్వారా రూ.19 లక్షలు, ఏపీఐఎంపీ ద్వారా రూ.30లక్షలు, మత్స్య శాఖ ద్వారా రూ.18లక్షల విలువగల ఉపకరణాలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, ఏఎస్పీ కేవీ రమణ, ఉప కలెక్టర్ బి.పద్మావతి, డ్వామా పీడీ సుధాకరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.