Share News

‘స్ర్తీ శక్తి’కి ఆదరణ

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:50 PM

women passengers in RTC buses ‘స్ర్తీ శక్తి’ పథకానికి ఆదరణ పెరుగుతోంది. ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ నెల 15న ప్రారంభించింది. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. దీంతో పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు.. మహిళలు, యువతులు, విద్యార్థినులతో కిటకిటలాడుతున్నాయి.

‘స్ర్తీ శక్తి’కి ఆదరణ
ఆర్టీసీ బస్సులో అధికంగా ప్రయాణిస్తున్న మహిళలు

ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న మహిళా ప్రయాణికులు

వారం రోజుల్లో 2.85 లక్షల మందికి సద్వినియోగం

ప్రైవేటు బస్సుల్లో తగ్గిన తాకిడి

టెక్కలి ఆర్టీసీ డిపో పరిధిలో 57 బస్సులు ఉన్నాయి. ఈ నెల 15న సాయంత్రం స్ర్తీ శక్తి పథకం ప్రారంభించగా.. తొలిరోజే సుమారు వెయ్యి మంది మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం చేశారు. తర్వాత రోజుకు 7 వేల మంది వరకూ మహిళలు బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. గురువారం 10వేల మందికిపైగా మహిళలు ‘స్ర్తీ శక్తి’ పథకం కిందట బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని అధికారులు తెలిపారు.

టెక్కలి రూరల్‌, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి):‘స్ర్తీ శక్తి’ పథకానికి ఆదరణ పెరుగుతోంది. ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ నెల 15న ప్రారంభించింది. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. దీంతో పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు.. మహిళలు, యువతులు, విద్యార్థినులతో కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరుగుతోంది. బస్సుల్లో 80శాతం మహిళలే కనిపిస్తున్నారు. జిల్లాలోని శ్రీకాకుళం డిపో-1 పరిధిలో 97, డిపో-2లో 82, టెక్కలి డిపో పరిధిలో 57, పలాస డిపో పరిధిలో 74 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. పథకం ప్రారంభం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 2.85 లక్షల మంది మహిళలు ‘స్ర్తీ శక్తి’ పథకం కింద బస్సుల్లో రాకపోకలు సాగించారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. జిల్లాలో రోజుకు సుమారు 62వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నార’ని జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్‌ అప్పలనారాయణ వెల్లడించారు. ‘విశాఖపట్నం, విజయనగరం, బత్తిలి, పాలకొండ, ఇచ్ఛాపురం మార్గాల్లో మహిళలు అధికంగా ప్రయాణిస్తున్నారు. గతంలో జిల్లాకు ఆక్యుపెన్సీ రేటు 72శాతం మాత్రమే ఉండగా ఇప్పుడు 93 శాతానికి పెరిగింద’ని తెలిపారు.

వెలవెలబోతున్న ప్రైవేటు బస్సులు

జిల్లాలో సుమారు 70 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. పలాస నుంచి మెళియాపుట్టి మీదుగా సుమారు 15 ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగా స్ర్తీ శక్తి పథకంతో ఆర్టీసీ బస్సులన్నీ రద్దీగా ఉండగా.. ప్రైవేటు బస్సులు మాత్రం వెలవెలబోతున్నాయి. ఆర్టీసీ బస్సులు వెళ్లని రూట్లలో మాత్రమే ప్రైవేటు బస్సుల్లో కాస్త రద్దీ కనిపిస్తోంది. అధికంగా బరంపురం నుంచి పర్లాఖిమిండికి మాత్రమే ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.

సరిహద్దుల్లో కష్టాలు

జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గంలో మూడు మండలాలు ఒడిశా రాష్ట్రం సరిహద్దున ఉన్నాయి. పలాస నుంచి మాతల, కొత్తూరు వరకు కొన్నేళ్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే ఒడిశా రాష్ట్రం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికంగా శ్రీకాకుళం నుంచి పాతపట్నం మీదుగా రాయఘడ, పర్లాఖిమిండి తదితర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడుపుతున్నారు. వీటిలో సైతం మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం లేక ఆందోళన చెందుతున్నారు. దీంతో కొంతమంది మహిళలు ఆంధ్రా సరిహద్దు వరకు ఉచితంగా ప్రయాణించి.. అక్కడి నుంచి టికెట్‌ డబ్బులు చెల్లించి ప్రయాణం సాగిస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో రద్దీ నేపథ్యంలో కొన్నిసార్లు సీట్ల కోసం మహిళల మధ్య స్వల్ప తగాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అలాగే మహిళల ఉచిత ప్రయాణానికి ఆధార్‌ జిరాక్స్‌ కాపీలను కూడా అనుమతించాలని ఇటీవల ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు స్పష్టం చేశారు. కానీ, చాలామంది కండక్టర్లు ఆధార్‌కార్డులు ఒరిజినల్‌ ఉండాలని పట్టుబడుతున్నారు. జిరాక్స్‌లను చూపిస్తే.. అంగీకరించడం లేదు. ఈ క్రమంలో కండక్టర్‌, మహిళా ప్రయాణికుల మధ్య వాదనలు జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలను పరిష్కరించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఈ విషయమై టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. ‘ఆర్టీసీ బస్సుల్లో రోజురోజుకీ మహిళా ప్రయాణికులు పెరుగుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికంగా ప్రయాణికులు వెళ్లే రూట్లను గుర్తించి బస్సులను నడుపుతున్నామ’ని తెలిపారు.

Updated Date - Aug 22 , 2025 | 11:50 PM