Share News

వంచించి.. కాటేసి!

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:04 AM

Sexual assault on children జిల్లాలో బాలికలు, యువతులపై అఘాయిత్యాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కామాంధుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. చాక్లెట్లు ఇస్తాననిచెప్పి పక్కింటి వృద్ధుడు లోబర్చుకోవడం.. కొంతమంది పాఠాలు బోధించే రూపంలో ప్రైవేటు పార్టుల దగ్గర చేయవేయడం.. ఇంకొంతమంది బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.

వంచించి.. కాటేసి!

  • జిల్లాలో అధికమవుతున్న అఘాయిత్యాలు

  • అప్రమత్తతే శ్రీరామరక్ష అంటున్న నిపుణులు

  • బ్యాడ్‌టచ్‌.. గుడ్‌టచ్‌పై అవగాహన తప్పనిసరి

  • శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి):

  • గత ఏడాది పలాసలో ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. పుట్టినరోజు వేడుకలని పిలిచి మాయమాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి ఇచ్చారు. మత్తులో జారుకున్న ఆ బాలికపై అత్యాచారం చేశారు. కొద్దిసేపటి తర్వాత జరిగిన అఘాయిత్యం గుర్తించి బాధిత బాలిక తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

  • ఈ ఏడాది మార్చిలో శ్రీకాకుళంలోని బాకర్‌ సాహెబ్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన 17ఏళ్ల బాలిక అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆ ఇంటి ఎదురుగా ఉన్న యువకుడు బాలికపై కన్నేశాడు. మాయ మాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడి చేయడంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గ్రహించి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిపై సీఐ ఈశ్వరరావు పోక్సో కేసు నమోదు చేశారు.

  • గత వారం విజయనగరం కంటోన్మెంట్‌ జంక్షన్‌కు చెందిన 14ఏళ్ల బాలికను శ్రీకాకుళం వాంబేకాలనీకి చెందిన ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి శ్రీకాకుళం నాగావళి రివర్‌వ్యూ పార్క్‌కు రప్పించి ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ దీనిని గమనించి ఆ ముగ్గురు యువకులను మందలించింది. బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించింది. వారు శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేసి తర్వాత కేసులు వరకు వెళితే తమ పరువు పోతుందని ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.

  • ఇలా జిల్లాలో బాలికలు, యువతులపై అఘాయిత్యాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కామాంధుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. చాక్లెట్లు ఇస్తాననిచెప్పి పక్కింటి వృద్ధుడు లోబర్చుకోవడం.. కొంతమంది పాఠాలు బోధించే రూపంలో ప్రైవేటు పార్టుల దగ్గర చేయవేయడం.. ఇంకొంతమంది బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలికలకు రక్షణ కరువవుతోంది. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి బాధ్యులను శిక్షించేందుకు పోక్సో చట్టం ఉన్నా ఆశించినస్థాయిలో అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మానవమృగాలు పేట్రేగిపోతున్నారు.

  • ఏటా పెరుగుతున్న కేసులు

  • జిల్లాలో అత్యాచారాలు, కిడ్నాపింగ్‌ కేసులు ఏటా పెరుగుతున్నాయి. 2023లో బాలికలు, మహిళలపై అత్యాచార ఘటనలకు సంబంధించి 39 కేసులు నమోదయ్యాయి. 2024లో 44 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో 8 నెలల కాలంలోనే 37 కేసులు నమోదు కావడం గమనార్హం. కేవలం ఇవి పోలీసుల వద్ద నమోదైన కేసులు మాత్రమే. వెలుగులోకి రాని ఘటనలు చాలా వరకు ఉన్నాయి. పరువు పోతుందని కొందరు, కేసులుబారిన పడతామని మరికొందరు ఇటువంటి కేసులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు.

  • పోక్సో చట్టం ఉన్నా..

  • బాలికలు, యువతులకు రక్షణగా పోక్సో చట్టాన్ని 2012లో ప్రవేశపెట్టారు. ఈ కేసు నమోదై రుజువైతే 20ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. సామాన్యుల కంటే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఇటువంటి తప్పు చేస్తే ఎక్కువ కాలం శిక్ష పడేలా దీనిని రూపొందించారు. కానీ నేరారోపణ, కేసులు నమోదు, ఆధారాలు సమర్పించడం వంటి వాటిలో వైఫల్యం ఎక్కువగా కనిపిస్తుంది. దీనితో చాలావరకు కేసులు నీరుగారిపోతున్నాయన్న విమర్శలున్నాయి. బాలికలు వేధింపులకు గురైతే పోక్సో.. 18 ఏళ్లు పైబడిన యువతులు బాధితులైతే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తుంటారు. వీటి విషయంలో పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.

  • అప్రమత్తత అవసరం...

  • పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా అమ్రపత్తంగా ఉండాలి. ఎదిగే వయసులో కొన్ని విషయాలు ఖచ్చితంగా నేర్పించాలి. ముఖ్యంగా గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌ గురించి వివరించాలి. ఏ స్పర్శ ఎలాంటిది, ఎవరు ఎక్కడ తాకితే అభ్యంతరం చెప్పాలనేది పిల్లలకు వివరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు రెండు లేదా మూడేళ్ల వయసు నుంచే గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌ గురించి వివరించాలని స్పష్టం చేస్తున్నారు. శరీర అవయవాలను ఎక్కడ తాకితే తప్పు అనే విషయాన్ని బొమ్మల ద్వారా వివరిస్తే చిన్నారులకు త్వరగా అర్థమవుతుందని చెబుతున్నారు. ఇలా చెప్పడం వల్ల పిల్లలు ఎప్పుడైనా అసౌకర్యానికి గురైనప్పుడు వెంటనే అక్కడ నుంచి బయటపడడానికి చూస్తారు. తద్వారా ఏం జరిగిందన్నది తల్లిదండ్రులకు తెలుస్తుందని పేర్కొంటున్నారు. ‘పిల్లలకు ఎలా ధైర్యంగా ఉండాలో కూడా తల్లిదండ్రులు నేర్పించాలి. పాఠశాలలు, కళాశాలలు, బయట జరుగుతున్న అన్ని విషయాలు పిల్లలు చెప్పుకునేలా తల్లిదండ్రులు స్వేచ్ఛను కల్పించాలి. నీకేం కాదు.. అంతా మేం చూసుకుంటాం అనే భరోసా పిల్లలకు అందిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలా చెప్పడం ద్వారా నేరాలకు అవకాశం ఇవ్వకుండా చూసిన వారవుతామ’ని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

  • అవగాహన పెంచేలా..

  • చిన్నారులపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వారికి ప్రాథమిక స్థాయి నుంచే అన్ని విషయాలపై అవగాహన పెంచాలి. గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌పై అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. జిల్లాలో పోక్సో, నిర్భయ కేసులు కూడా అదుపులోకి వస్తున్నాయి. అఘాయిత్యాలు, నేరాల నియంత్రణపై విద్యా సంస్థల్లో దీనిపై మరింత అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి.

    - సీహెచ్‌ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం

Updated Date - Sep 25 , 2025 | 12:04 AM