Share News

బె‘ధర’ గొడుతున్నాయ్‌

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:51 PM

vegetables prices.. Increased ‘ఏమిటీ మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకురావాలా?. వాటి ధరలు వింటేనే గుండెలు గుభేలుమంటున్నాయి తెలుసా. కూరలు వద్దు. కాస్త చారు, పచ్చడితో గడిపేద్దాం. మరోరోజు పప్పుచారు, అప్పడాలతో సర్దుకుపోదాం’. ఇదీ ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో జరుగుతున్న సంభాషణ. ఎన్నడూలేని విధంగా కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి.

బె‘ధర’ గొడుతున్నాయ్‌

  • పెరిగిన కూరగాయల ధరలు

  • ఏదైనా కిలో రూ.60 నుంచి రూ.80పైనే..

  • బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు

  • నరసన్నపేట/టెక్కలి రూరల్‌/ కాశీబుగ్గ, నవంబరు 28(ఆంరఽధజ్యోతి): ‘ఏమిటీ మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకురావాలా?. వాటి ధరలు వింటేనే గుండెలు గుభేలుమంటున్నాయి తెలుసా. కూరలు వద్దు. కాస్త చారు, పచ్చడితో గడిపేద్దాం. మరోరోజు పప్పుచారు, అప్పడాలతో సర్దుకుపోదాం’. ఇదీ ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో జరుగుతున్న సంభాషణ. ఎన్నడూలేని విధంగా కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి. ఇటీవల వర్షాలకు కూరగాయ పంటలు దెబ్బతినడంతో వాటికి గిరాకీ పెరిగింది. ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ.60 నుంచి రూ.80 పలుకుతోంది. మరికొన్ని ధరలు రూ.100 నుంచి రూ.120 ఉన్నాయి. కార్తీకమాసం ముగిసినా కూరగాయల ధరలు తగ్గకపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. కిలో కొనాల్సిన వారు పావు, అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో టమోటా కిలో రూ.80, వంకాయలు రూ.80, బీరకాయలు రూ.70 నుంచి రూ.80, పందిరి చిక్కుడు రూ.120, క్యారెట్‌ కిలో రూ.60 నుంచి రూ.70, బెండకాయలు కిలో రూ.70, అరటికాయ ఒకటి రూ.10, బంగాళదుంపలు కిలో రూ.25 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే క్యాబేజీ పువ్వు ఒకటి రూ.40 నుంచి రూ.50, మునగకాయలు కిలో రూ.200 చొప్పున విక్రయాలు సాగిస్తున్నారు. రైతుబజారుల్లో కూడా బయట మార్కెట్‌ కన్నా కిలోపై రూ.5 నుంచి రూ.10లోపు మాత్రమే తక్కువ ధరలు ఉంటున్నాయి. దీంతో నాలుగైదు రకాల కూరగాయాలను కొనుగోలు చేయాల్సిన వినియోగదారులు వాటి ధరలను చూసి ఒకట్రెండు రకాలతో సరిపెట్టుకుంటున్నారు. సాధారణంగా శీతాకాలంలో కూరగాయల ధరలు అందుబాటులో ఉంటాయి. కాగా ఇటీవల కురిసిన మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడి తగ్గింది. ఆకుకూరలు ఆచూకీ ఎక్కడా కనిపించడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయల సాగు పెరిగి.. ఉత్పత్తులు అందుబాటులోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

  • కొండెక్కిన కోడిగుడ్డు

  • కూరగాయల బాటలోనే కోడిగుడ్డు ధర కూడా పరుగులెడుతోంది. ఎప్పుడూ రూ.5 నుంచి రూ.5.50లోపు ఉండే కోడిగుడ్డు ధర ప్రస్తుతం హోల్‌సేల్‌ మార్కెట్‌లో రూ.6.90 పలుకుతోంది. రిటైల్‌గా రూ.7.50 నుంచి రూ.8 చొప్పున విక్రయిస్తున్నారు. జిల్లాలో రోజుకు 15లక్షల కోడిగుడ్లు వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన ధరతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం తప్పడం లేదు. వాస్తవానికి ట్రేడర్లు ఈ గుడ్డు ధరను నిర్ణయిస్తారు. గుడ్డుకు ఉండే గిరాకీ, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ధర నిర్ధారిస్తారు. ప్రస్తుతం పేపరు ధరకు మించి గుడ్లను విక్రయిస్తున్నారు. వినియోగదారులపై భారం మోపుతున్నారు. వ్యయప్రయాసలు పడి రైతులు కోళ్లను పెంచి గుడ్లను ఉత్పత్తి చేయిస్తే.. ట్రేడింగ్‌ కంపెనీలు, ఏజెంట్లు దోచుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Nov 28 , 2025 | 11:51 PM